దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు, నిధుల మంజూరులో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ప్రధానిని కలిసిన అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మసాగర్, డిండి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. ఈ మూడు ప్రాజెక్టుల కోసం గత, ప్రస్తుత ప్రభుత్వాలు కలిపి సుమారు రూ.50 వేల కోట్లు ఖర్చు చేశాయని, సుప్రీంకోర్టు స్టే సహా వివిధ కారణాలతో పనులు ఏళ్ల తరబడి మందగించాయని వివరించారు. దరఖాస్తులు స్వీకరించి పర్యావరణ ప్రభావ అంచనా ప్రక్రియ చేపట్టవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, కేంద్ర పర్యావరణ శాఖలో దరఖాస్తుల పరిశీలన నెలల తరబడి ఆలస్యమవుతోందని తెలిపారు.
తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్లకు మహారాష్ట్ర అంగీకారం కావాలి
తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రికి పటాలు, గణాంకాలతో వివరించినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ అంశంపై గతంలో ప్రధానికి రాసిన లేఖకు స్పందనగా ఆయన కార్యాలయం సూచన మేరకు కేంద్ర జల సంఘం సమావేశం నిర్వహించిందని చెప్పారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ముంబయిలో కలిసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, 152 మీటర్ల నీటిమట్టానికి ఆ రాష్ట్ర అంగీకారం సాధించేలా ప్రధాని చొరవ తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. అదనపు ముంపు కారణంగా కలిగే నష్టానికి కేంద్రం లేదా మహారాష్ట్ర నిర్ణయించే మేరకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసినట్లు తెలిపారు.
సమ్మక్క–సారలమ్మ బ్యారేజీకి ఛత్తీస్‌గఢ్ ఎన్ఓసీ కోసం ప్రయత్నాలు
సమ్మక్క–సారలమ్మ బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని, హైడ్రాలజీ అనుమతి కూడా లభించిందని మంత్రి తెలిపారు. అయితే బ్యారేజీని పూర్తి సామర్థ్యంతో వినియోగించుకోవడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) రావాల్సి ఉందన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకుని అనుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్లు చెప్పారు.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన మేరకు ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి ముంపు నివేదిక తెప్పించామని, అదనపు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కోసం అడిగిన మొత్తాన్ని కూడా చెల్లించామని వివరించారు. ముంపు వల్ల కలిగే నష్టానికి పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇప్పటికే తెలియజేసినట్లు చెప్పారు. డీపీఆర్ సమర్పించిన సమయంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే దానిని పరిశీలించాలని సాంకేతిక సలహా కమిటీని కోరినట్లు తెలిపారు.
నాలుగు సాగునీటి పథకాలకు రూ.5,856 కోట్లు కోరాం
2027–28 ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన కింద తెలంగాణలోని నాలుగు సాగునీటి పథకాలకు రూ.5,856 కోట్ల ఆర్థిక సాయం కోరినట్లు మంత్రి తెలిపారు. ఇందులో సీతమ్మసాగర్–సీతారామ సమీకృత ఎత్తిపోతల పథకానికి రూ.5,183 కోట్లు, మోడికుంట వాగు ప్రాజెక్టుకు రూ.392 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.178 కోట్లు, చనాకా–కొరాట బ్యారేజీకి రూ.103 కోట్లు కేటాయించాలని కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపాదనలు సమర్పించినట్లు వివరించారు.
రాష్ట్రాలకు మూలధన పెట్టుబడుల ప్రత్యేక సాయం పథకం కింద దేశవ్యాప్తంగా రూ.2 లక్షల కోట్ల మేర 50 ఏళ్ల వడ్డీలేని రుణాలను కేంద్రం ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ పథకం కింద తెలంగాణకు ఇప్పటివరకు రూ.1,457 కోట్లు అందాయని తెలిపారు. రాష్ట్రంలో 70 నుంచి 90 శాతం వరకు పనులు పూర్తయిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అదనంగా రూ.5,000 కోట్లు మంజూరు చేయాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. ఈ నిధులు విడుదలైతే 2027 మార్చి 31లోగా వాటిని వినియోగించుకుని, ఏడాదిలోపు కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు ఇప్పటికే ఉన్న ఆయకట్టును స్థిరీకరించగలమని వివరించారు.
మేడిగడ్డ నుంచి ప్రస్తుతం నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాదు
మేడిగడ్డ బ్యారేజీ నుంచి ప్రస్తుతం నీటిని ఎత్తిపోయే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేసినట్లు మీడియా ప్రశ్నలకు సమాధానంగా మంత్రి తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఒకే తరహా సీకెంట్ పైల్ పునాదులు ఉన్నాయని, వాటి రూపకల్పన, నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు నిపుణులు తమ నివేదికల్లో పేర్కొన్నారని చెప్పారు.
మేడిగడ్డ బ్యారేజీని గత ప్రభుత్వ హయాంలోనే నిర్మించారని, అప్పుడే అది దెబ్బతిన్నదని ఉత్తమ్ ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయాలని కోరడం అర్థరహితమని వ్యాఖ్యానించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు గతంలో సుమారు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసి 30 శాతం పనులు పూర్తిచేసిన తర్వాత, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మళ్లించారని మంత్రి విమర్శించారు. కమీషన్ల కోసమే గత ప్రభుత్వం ఈ మార్పు చేసిందని ఆరోపించారు. దిగువకు ప్రవహిస్తున్న గోదావరి జలాలను ప్రస్తుతం దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా వినియోగించుకుంటున్నామని తెలిపారు.
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయం, అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి కేంద్రం సహకారం అవసరమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రికి సమర్పించిన విజ్ఞప్తులపై కేంద్రం తీసుకునే నిర్ణయాలపై తెలంగాణ ప్రభుత్వం తదుపరి కార్యాచరణను రూపొందించనుంది.
