క్రీడలుహోమ్

వయసు చిన్నదే.. చెస్‌లో లక్ష్యం ప్రపంచ రికార్డే!

#Chess

చిన్న వయసులోనే చెస్‌లో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ ప్రపంచ రికార్డుల దిశగా అడుగులు వేస్తున్న చిన్నారులను తెలంగాణ ప్రభుత్వ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అభినందించారు. చదరంగం పిల్లల్లో మేధస్సుకు పదును పెట్టడంతో పాటు ఏకాగ్రత, సహనం, వ్యూహాత్మక ఆలోచనా శక్తిని పెంపొందిస్తుందని వారు పేర్కొన్నారు.

బ్లిస్‌బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్, డైమండ్ చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని సైబర్ గేట్‌వే కార్యాలయంలో ప్రపంచ రికార్డు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సయాన్ష్ (3), ఇషిక (4), చైత్ర (7), మణి అస్రిత్ (9), విహాన్ (9) తమ చెస్ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా అజయ్ మిశ్రా మాట్లాడుతూ.. చిన్న వయసులోనే చెస్‌పై ఆసక్తి పెంచుకుని, ఏకాగ్రతతో ఎత్తులు వేస్తూ వ్యూహాత్మకంగా ఆలోచించడం అభినందనీయమన్నారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి తగిన ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.

దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రపంచ రికార్డులు సాధించేందుకు వయస్సు అడ్డంకి కాదని ఈ చిన్నారులు నిరూపిస్తున్నారని అన్నారు. మూడేళ్లు, నాలుగేళ్లు, ఏడేళ్లు, తొమ్మిదేళ్ల వయసులోనే ఇలాంటి ప్రయత్నాలకు ముందుకు రావడం విశేషమన్నారు. దీని వెనుక పిల్లల కృషి, పట్టుదల, సంకల్పం, ఏకాగ్రత ఉన్నాయని పేర్కొన్నారు.

చెస్ అనేది కేవలం గెలుపోటములకు సంబంధించిన ఆట మాత్రమే కాదని, సహనం, ముందుచూపు, నిర్ణయ సామర్థ్యానికి పరీక్ష అని వివరించారు. చెస్ బోర్డుపై ప్రతి ఎత్తు ఒక ఆలోచనకు ప్రతిరూపమని, ప్రతి నిర్ణయం వ్యూహాత్మక దృష్టిని ప్రతిబింబిస్తుందని అన్నారు.

ప్రపంచ రికార్డు సాధించడం గొప్ప విషయమే అయినప్పటికీ, దాని వెనుక నిరంతర సాధన, క్రమశిక్షణ, కోచ్‌ల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ముఖ్యమని తెలిపారు. రికార్డుల పేరుతో చిన్నారులపై ఒత్తిడి తీసుకురాకుండా వారి ఆసక్తి, ఆనందం, అభిరుచులకు అనుగుణంగా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. రికార్డు సాధించినా, సాధించకపోయినా పిల్లల ప్రయత్నాన్ని అభినందించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ నరేష్ రెడ్డి, డాక్టర్ వినయ్, చిన్నారుల తల్లిదండ్రులు, చెస్ అకాడమీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మకరజ్యోతి దర్శనంతో తరించిన భక్తులు

Satyam News

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్సీ నాగబాబు

Satyam News

ఎఫ్ఎన్ సిసి – పుల్లెల గోపీచంద్ బ్యాడ్మిండన్ లీగ్

Satyam News

బేతుపల్లి చెరువు సహాయక బృందాలకు సీఎం రేవంత్ అభినందన

Satyam News

భారత్ ను చూసి నేర్చుకోండి: బ్యాంకులకు ట్రంప్ సలహా

Satyam News

విద్య వైద్యానికే అధిక ప్రాధాన్యత

Satyam News

Leave a Comment