బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో కొద్దిసేపు ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. ఈ సందర్భంగా సింగరేణి, ఫోన్ ట్యాపింగ్ కేసు, రోహింగ్యాల అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
సింగరేణిని కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి దోచుకుంటున్నాయని ఆరోపించిన బండి సంజయ్, గతంలో కేసీఆర్ కుటుంబమే సింగరేణిని దోచుకుందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో మంత్రులు, దళారులు కలిసి దోపిడీ చేస్తున్నారని, అందుకే ఒకరి అవినీతిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అవినీతిపై బీఆర్ఎస్ లేఖ రాస్తే, బీఆర్ఎస్ అవినీతిపై కూడా విచారణ జరుపుదామా? అని మంత్రి భట్టి వ్యాఖ్యానించడం ఈ కుమ్మక్కును బయటపెడుతోందని అన్నారు. సింగరేణిలో రెండు పార్టీల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసిన ఆయన, 2014 నుంచి ఇప్పటి వరకు గనుల కేటాయింపులు, జరిగిన దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.
తెలంగాణ లో ఆగని గనుల దోపిడి
తెలంగాణలో జరిగిన దోపిడీపై ప్రశ్నిస్తే గుజరాత్‌ను ఎందుకు లాగుతున్నారని నిలదీశారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమైందని, అయితే ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే ఇప్పుడు గనుల దోపిడీ ఎక్కువగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో సింగరేణిని దోచుకుంది ఆయన కుటుంబమేనని, ఆ సొమ్ముతోనే బీఆర్ఎస్ పార్టీని ఇన్నాళ్లు నడిపించారని బండి సంజయ్ ఆరోపించారు.
రూ.42 వేల కోట్ల సింగరేణి సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం దోచుకుందని, సంస్థను అప్పుల పాల్జేసిందని విమర్శించారు. ఎన్నికల ముందు సింగరేణిని లాభాల్లోకి తెస్తామంటూ హామీలు ఇస్తారని, అధికారంలోకి వచ్చాక ఆ సొమ్మంతా దారి మళ్లించడం పరిపాటైందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ తోడు దొంగలేనని, సింగరేణి ప్రజలు, కార్మికులు ఈ రెండు పార్టీల తీరును చూసి అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ సాక్షా? నేరస్తుడా?
ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను సాక్షిగా పిలిచామని మంత్రులు చెబుతుంటే, విచారణకు పిలిచామని సజ్జనార్ చెబుతున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, కేసీఆర్‌లకు కాంగ్రెస్ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇస్తోందా? అని ప్రశ్నించారు.
అసలు ఫోన్ ట్యాపింగ్ దోషులెవరో తేలాలంటే అందరినీ సాక్షులుగా పిలవాలని, దొంగలను సాక్షులుగా పిలవడమేంటని నిలదీశారు. సిట్ విచారణను మంత్రులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సిట్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, ప్రభుత్వ ఒత్తిడికి లొంగితే సిట్ అధికారుల క్రెడిబిలిటీ పోతుందని హెచ్చరించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను విచారణకు పిలిచి తన ఫోన్ ట్యాప్ అయ్యిందని, మావోయిస్టు జాబితాలో తన పేరును చేర్చారని చెప్పారని బండి సంజయ్ వెల్లడించారు. అయితే ఇందుకు కారకులైన వారిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ స్కాంలు బయటపడుతున్నప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ కేసుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన బండి సంజయ్, “కేటీఆర్ పెద్ద సంసారి అయినట్లు మాట్లాడుతున్నారు. ఎన్ని కుటుంబాలను, ఎంత మంది జీవితాలను నాశనం చేశారో తెలియదా?” అని ప్రశ్నించారు. నిజాం అరాచకాలను మర్చిపోలేదని, కేటీఆర్ అరాచకాలను కూడా మర్చిపోమని హెచ్చరించారు.
కేటీఆర్ లో ఇంకా తగ్గని అహంకారం
కేటీఆర్‌లో ఇంకా అహంకారం తగ్గలేదని, ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెబుతున్న కేసీఆర్, కేటీఆర్ తన సవాల్‌కు సిద్ధమా? అని ప్రశ్నించారు. దేవుడి ఆలయం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేసే దమ్ముందా? అని సవాల్ విసిరారు. మావోయిస్టుల జాబితాలో హీరోయిన్లు, వ్యాపారులతో పాటు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్ నెంబర్లు చేర్చిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించిన ఆయన, చివరకు కేసీఆర్ బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ఆ జాబితాలో చేర్చి ట్యాపింగ్ చేయించలేదా? అని నిలదీశారు.
దేశ భద్రత పేరుతో ఈ చర్యలను సమర్థించుకోవడం సిగ్గుచేటని అన్నారు. తాను సవాల్ విసిరితే లీగల్ నోటీసులంటూ డ్రామాలు ఆడతారని, చివరకు వాటికైనా కట్టుబడి ముందుకు సాగరని విమర్శించారు. రోహింగ్యాల అంశంపై మాట్లాడుతూ, 2014కంటే ముందే రోహింగ్యాలు పాతబస్తీలోకి అక్రమంగా ప్రవేశించారని, వారికి రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులేనని ఆరోపించారు.
రోహ్యాంగాలకు ఇళ్లు ఇచ్చిన కేసీఆర్… షేమ్
బీఆర్ఎస్ పాలనలో నాటి హోంమంత్రి రోహింగ్యాలకు ఇండ్లు మంజూరు చేసి మద్దతు ఇచ్చారని అన్నారు. ఓటు బ్యాంకు కోసం పాలకులే రోహింగ్యాలకు వంతపాడుతుంటే, శాంతిభద్రతలను కాపాడేదెవరు? అని ప్రశ్నించారు. సింగరేణిపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో టైంపాస్ చేయొద్దని హితవు పలికిన బండి సంజయ్, సింగరేణి అవకతవకలకు సంబంధించిన రికార్డులన్నింటినీ వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
లేకపోతే ఆ రికార్డులు తారుమారు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణికి చెల్లించాల్సిన రూ.42 వేల కోట్లను తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
