మెదక్హోమ్

లైసెన్స్డ్ సర్వేయర్లను నట్టేట ముంచిన రేవంత్ సర్కార్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాయమాటలు నమ్మి తమ ప్రైవేట్ ఉద్యోగాలు వదులుకొని వచ్చిన లైసెన్స్డ్ సర్వేయర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. ఆదివారం సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్ల ప్రతినిధులు హరీశ్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

తమకు జరిగిన అన్యాయం వివరిస్తూ ఆయనకు వినతిపత్రం అందజేశారు. సర్వేయర్ల ఆవేదనను సావధానంగా విన్న హరీశ్ రావు, వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ మోసకారి తీరును ఆయన ఎండగట్టారు.

భూ భారతి పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,500 మంది విద్యావంతులను లైసెన్స్డ్ సర్వేయర్లుగా ఎంపిక చేసి.. తీరా ఇప్పుడు వారిని కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేయడం దారుణమని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీటెక్ లాంటి ఉన్నత చదువులు చదివిన యువత, ప్రభుత్వంలో మంచి ఉద్యోగం, గౌరవ వేతనం వస్తుందన్న ఆశతో తాము అప్పటికే చేస్తున్న ప్రైవేట్, ఐటీ ఉద్యోగాలను సైతం వదులుకొని వచ్చారని గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి స్వయంగా వారికి మంచి వేతనం ఇస్తామని హామీ ఇచ్చి, శిక్షణలు ఇచ్చి, పరీక్షలు పెట్టి, ప్రమాణ స్వీకారాలు కూడా చేయించారని.. కానీ పనుల్లోకి చేరాక మాట తప్పి మోసం చేశారని అన్నారు.

వారికి కనీస వేతనం ఇవ్వకుండా.. సర్వే చేసినందుకు ఎకరానికి కేవలం పది రూపాయల కమిషన్ ఇస్తామని చెప్పడం విద్యావంతులను ఘోరంగా అవమానించడమేనని మండిపడ్డారు.

ఎకరం సర్వే చేస్తే పది రూపాయలా.. అంటే వీరు ఏడాది పొడవునా కష్టపడి రెండు వేల ఎకరాలు సర్వే చేసినా వచ్చేది కేవలం 20 వేల రూపాయలేనా అని హరీశ్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదేనా రేవంత్ రెడ్డి గారు యువతకు ఇచ్చే ఉపాధి అని ప్రశ్నించారు. సర్వేయర్లను మండల ఆఫీసుల్లో ఉచితంగా కూలీల్లా వాడుకుంటూ శ్రమదోపిడీకి పాల్గొనడం దుర్మార్గం అని అన్నారు.

గత ఏడాది కాలంగా ఎలాంటి జీతం లేక, సరైన పని కల్పించక 6,500 మంది సర్వేయర్ల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ రోడ్డున పడ్డ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్ల పేరుతో ప్రభుత్వం వారి జీవితాలతో ఆడకుండా.. ఇచ్చిన మాట ప్రకారం వారికి తక్షణమే గౌరవ వేతనం ఇవ్వాలని, వారి ఉద్యోగాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

లైసెన్స్డ్ సర్వేయర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ వారికి పూర్తి అండగా ఉంటుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. వారి పక్షాన రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టి, సర్వేయర్లకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

Related posts

లెబనాన్ పై మళ్లీ దాడి చేసిన ఇజ్రాయెల్

Satyam News

గణనీయంగా తగ్గిన దుబాయ్ ప్రయాణీకుల సంఖ్య

Satyam News

అల్లుడు తో రాసలీలలు సాగిస్తూ….

Satyam News

పాకిస్తాన్ కు మళ్లీ హెచ్చరిక జారీ చేసిన భారత్

Satyam News

ఐదు రోజుల పాటు భారీ వర్ష సూచన

Satyam News

గ్లోబల్ సి బి ఎస్ ఈ  స్కూల్ కు నేషనల్ ఇన్నోవేటివ్ అవార్డు

Satyam News

Leave a Comment