23.9 C
Hyderabad
September 27, 2026
ముఖ్యంశాలుహోమ్

కవిత భూదాన్ హంగామా: పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం బిత్తరపాటు

#KalvakuntlaKavitha

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న బాధితులకు మద్దతుగా జాగృతి నేత కవిత చేపట్టిన ఆందోళన ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తూతూ మంత్రంగా ఆందోళనలు చేయనని, సమస్యకు పరిష్కారం వచ్చే వరకు అండగా ఉంటానని ప్రకటించిన ఆమె మాట నిలబెట్టుకుంటూ దాదాపు ఇరవై గంటల పాటు నిరసన కార్యక్రమాలను కొనసాగించారు.

దీంతో పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ఆమె ఆందోళనను నియంత్రించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కనిపించింది. వెలుగుమట్ల భూముల వివాదం సద్దుమణుగుతున్న సమయంలో కవిత చేపట్టిన ఈ ఆందోళనతో అంశం మళ్లీ చర్చకు వచ్చింది. కమ్యూనిస్టు పార్టీల తరహాలో దీక్షలు, నిరసనలు చేపట్టిన ఆమె చర్య రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

ఇప్పటివరకు కొన్ని రాజకీయ పార్టీలు బాధితులను పరామర్శించి వెళ్లినప్పటికీ, కవిత మాత్రం పగలు-రాత్రి నిరసన కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా ప్రత్యేకంగా నిలిచారని స్థానికంగా చర్చ సాగుతోంది. గత నెల 24న భూదాన్ భూముల్లో ఉన్న గుడిసెలను అధికారులు తొలగించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు దీనిని అంశంగా తీసుకుని విమర్శలు చేస్తున్నాయి.

బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే బాధితులను పరామర్శించి మద్దతు ప్రకటించగా, కవిత చేపట్టిన దీర్ఘకాలిక ఆందోళనతో రాజకీయంగా కొత్త చర్చ ప్రారంభమైంది. ఉదయం అంబేద్కర్ విగ్రహం వద్ద బాధితులతో కలిసి దీక్ష ప్రారంభించిన ఆమె కలెక్టర్ రావాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీఓ వచ్చినప్పటికీ కలెక్టర్ రావాలని పట్టుబట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.

పోలీసులు అరెస్టు చేసి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించినప్పటికీ, రాత్రి తిరిగి అంబేద్కర్ భవన్‌కు చేరుకుని నిరాహార దీక్ష కొనసాగించారు. ఉదయం నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున వరకు ఆందోళన కొనసాగడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి ఈ కార్యక్రమంపై పడింది. ప్రభుత్వం త్వరలోనే బాధితులకు పట్టాలు ఇవ్వడానికి సిద్ధమవుతోందన్న సమాచారం మధ్య కవిత చేసిన ఈ ఆందోళన రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Related posts

ఫైబర్ నెట్ విస్తృత పరిచేందుకు పటిష్ట ప్రణాళిక

Satyam News

చౌడేశ్వరి హత్య కేసులో సీఐ సస్పెన్షన్

Satyam News

గద్వాల చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

Satyam News

మ్యూనిషన్స్‌ ఇండియా–డ్రోగో ఏరోస్పేస్‌ మధ్య కీలక ఒప్పందం

Satyam News

తిరుమల ల్యాబ్ పై రాజకీయం మొదలెట్టిన వైసీపీ

Satyam News

మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ కు డొనేషన్

Satyam News

Leave a Comment