తిరుపతి శివారులో భారీగా గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు బయటపడిన ఘటన కలకలం రేపింది. అధికారులు నిర్వహించిన దాడుల్లో వందల సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడికి చెందిన గోడౌన్‌పై అధికారులు దాడులు నిర్వహించినట్లు సమాచారం.
అధికారులకు అందిన సమాచారం మేరకు తిరుపతి పరిసర ప్రాంతంలో సౌజన్య పేరుతో ఉన్న గోడౌన్‌లో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వెంటనే దాడులు నిర్వహించిన అధికారులు అక్కడ భారీగా సిలిండర్లను గుర్తించారు. దాడుల్లో మొత్తం 595 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు, 80 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల విచారణలో భారత్ గ్యాస్ పేరుతో ప్రైవేట్ “గో గ్యాస్” సంస్థకు చెందిన సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేసినట్లు బయటపడింది. గో గ్యాస్ పేరుతో అక్రమ రవాణాకు సిద్ధం చేసిన ఈ సిలిండర్లు బ్రహ్మారెడ్డి అనే వ్యక్తికి చెందినవిగా అధికారులు గుర్తించారు.
అధికారుల ప్రాథమిక దర్యాప్తులో గత ఏడు సంవత్సరాలుగా తిరుమలకు గ్యాస్ సిలిండర్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అనుమానం వ్యక్తమైంది. భారత్ గ్యాస్ పేరుతో గో గ్యాస్ సిలిండర్లను తరలిస్తూ అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ముఖ్యంగా తిరుమల ప్రాంతంలో గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్‌లో విక్రయించేందుకు ఈ సిలిండర్లను నిల్వ ఉంచినట్లు సమాచారం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వ్యాపారానికి సంబంధించిన లైసెన్స్ 2019లోనే గడువు ముగిసినట్లు అధికారులు గుర్తించారు.
అయినప్పటికీ అదే పేరుతో కార్యకలాపాలు కొనసాగిస్తూ అక్రమంగా సిలిండర్లను నిల్వ చేసి సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. ఇటీవల తిరుమలకు మరోసారి పెద్ద మొత్తంలో సిలిండర్లు సరఫరా చేయడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలోనే ఈ అక్రమ నిల్వలను అధికారులు పట్టుకున్నారు.
అధికారులు దాడులు నిర్వహిస్తున్న సమయంలో గోడౌన్ యజమాని అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్లను సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
