తెలుగుదేశం పార్టీ నాయకులు బీద మస్తాన్ రావు, బీద రవికుమార్ లను మత్స్యకారులు కుల బహిష్కరణ చేశారు. వారి సోదరుడు బీద గిరిధర్ తో సహా ఈ ఇద్దరిని మత్స్యకారులు బహిష్కరించడం పెను దుమారం రేపుతున్నది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో తమిళనాడుకు చెందిన నాలుగు పడవలు ఇటీవల మాయం అయ్యాయి.
తమిళనాడుకు చెందిన ఆ నాలుగు పడవలను అక్రమంగా వేట సాగిస్తుండగా అక్కడి మత్స్యకారులు పట్టుకుని బంధించారు. చాలా కాలంగా తాము కాపలా కాస్తున్న ఆ నాలుగు పడవలు అకస్మాత్తుగా మాయం అయ్యాయి. తమిళనాడు–పుదుచ్చేరి (కరైకల్) ప్రాంతాలకు చెందిన నాలుగు మత్స్యకార బోట్లు అదృశ్యమవ్వడంతో స్థానిక మత్స్యకారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఘటన క్రమంగా రాజకీయ రంగు దాల్చి, బీద మస్తాన్ రావు కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలకు దారి తీసింది.
ఈ బోట్లు 2025లో ఆంధ్ర తీరంలో అక్రమంగా చేపల వేట చేశాయి. దాంతో స్థానిక మత్స్యకారులు పట్టుకుని జువ్వలదిన్నె హార్బర్‌కు తరలించారు. వాటి ఇంజిన్ భాగాలను తొలగించి భద్రపరిచారు. అయితే 2026 మార్చి 12 తర్వాత కొద్ది రోజుల్లోనే ఈ నాలుగు బోట్లు రాత్రికి రాత్రే కనిపించకుండా పోవడం అనుమానాలకు తావిచ్చింది.
ఈ ఘటనపై మత్స్యకార సంఘాలు పెద్ద ఎత్తున సమావేశమై విచారణ జరిపాయి. ప్రకాశం జిల్లా పాకలలో జరిగిన భారీ కుల సమావేశంలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో బోట్లు వదిలేసిన ముగ్గురు వ్యక్తులు తప్పు ఒప్పుకున్నారు. ఎంపీ కుటుంబ చెప్పడం తమకు డబ్బులు ఆశ చూపడంతో బోట్లు విడిచిపెట్టినట్లు వారు తమ తప్పును ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకార పెద్దలు కఠిన నిర్ణయం తీసుకున్నారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ బీద మస్తాన్ రావు, ఆయన కుటుంబ సభ్యులు అయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, బీద గిరిధర్‌లపై సామాజిక బహిష్కరణ విధించారు. ఎవరైనా వారి కుటుంబంతో మాట్లాడితే రూ.1 లక్ష జరిమానా విధించాలని నిర్ణయించారు. అదేవిధంగా రూ.5 కోట్ల జరిమానా విధించారు. వారితో ఎలాంటి సామాజిక, ఆర్థిక సంబంధాలు కొనసాగించరాదని నిర్ణయించారు.
ఇదిలా ఉండగా, బీద కుటుంబం ఈ ఆరోపణలను ఖండించింది. బోట్లు తమతో సంబంధం లేదని అవి పుదుచ్చేరి అధికారుల వద్ద ఉన్నాయని పేర్కొంది. అయినప్పటికీ మత్స్యకారులు ఈ వివరణను నమ్మకపోవడంతో వివాదం మరింత ముదిరింది.
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆంధ్ర–తమిళనాడు తీర ప్రాంత మత్స్యకారుల మధ్య వివాదం ఈ ఘటనతో మళ్లీ తెరపైకి వచ్చింది. అధునాతన బోట్లతో అక్రమంగా వేట జరపడం వల్ల స్థానిక మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటోందని వారు అంటున్నారు.
