కృష్ణహోమ్

రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరుమెదపరేం

మహిళా రిజర్వేషన్‌కు లింకుపెట్టి డీలిమిటేషన్ బిల్లును అమలు చేయడం అంటే ఎస్‌సి, ఎస్‌టిలతోపాటు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, సామాజిక న్యాయం దెబ్బతింటుందని, అయినా టిడిపి, వైసిపిలు దీనిపై నోరుమెదపడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు.

శుక్రవారం విజయవాడలో బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌తో కలిసి మాట్లాడారు. డీలిమిటేషన్‌పై ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, కేరళ, తెలంగాణా వ్యతిరేకిస్తున్నాయని, ఎపి ఎంపిలుగానీ, టిడిపి, వైసిసిగానీ నోరెత్తకపోవడం దిగజారుడుతనమని, గెలిపించిన ప్రజలను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో టిడిపి, వైసిపి రెండూ రాష్ట్రప్రయోజనాలకు విఘాతం కలిగించాయని అన్నారు. జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోగా వైసిపి ఏకంగా సీట్లు అన్ని ప్రాంతాలకు సమానంగా పంచాలని కొత్తపల్లవి ఎత్తుకుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్‌డిఏలో భాగస్వామిగా ఉన్నా ప్రశ్నించÅ£పోగా ప్రతిపక్ష పార్టీలకు లేఖల పేరుతో ముఖ్యమంత్రి ముందరికాళ్లకు బంధం వేస్తున్నారని అన్నారు.

ఎపికి జరుగుతున్న నష్టాన్ని పార్లమెంటులో ఎంపిలు ప్రశ్నించకపోతే ఎపికి భవిష్యత్ లేకుండా పోతుందని అన్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్రాలను సంప్రదించకపోతే కేంద్రాన్ని అడిగే ధైర్యం కూడా ముఖ్యమంత్రి చేయలేకపోతున్నారని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసిపి కూడా అన్యాయంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.

గతంలోనే ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసం మరో బిల్లు తీసుకొస్తుంటే కొత్తగా తీసుకొస్తున్నట్లు చంద్రబాబు లేఖ రాయడం అంటే ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడమేనని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ఎంపిలు ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని అన్నారు.

2023లో తీసుకొచ్చిన చట్టాన్ని 2024 ఎన్నికల్లో అమలు చేయకుండా బిజెపి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసిందని, ఈ మూడేళ్లలో నిద్రపోయి ఇప్ప్పుడు రిజర్వేషన్ అమలు గురించి గగ్గోలు పెడుతోందని ఎద్దేవా చేశారు. 131వ రాజ్యాంగ సవరణలో కనీష్టంగా 816 సీట్లు ఉండాలని ప్రతిపాదించారని, బెంగాల్లో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ 816 సీట్ల సంఖ్య గరిష్టమని, అసలు సంఖ్య అందుకు లోబడి ఉంటుందని స్పష్టం చేశారు.

అంటే మన రాష్ట్రానికి 38 సీట్లు వస్తాయన్న గ్యారంటీ లేదు. చట్టంలో ఉన్నదొకటయితే చంద్రబాబు అమిత్‌షాలు లేనిదాన్ని ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెంచితే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, నియంత్రణ పాటించని ఉత్తరభారతదేశంలో రాష్ట్రాలకు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌కు లబ్ది కలుగుతుందని తెలిపారు.

సీట్ల పెంపు ఎలా ఉంటుందో చెప్పకుండా తోచిన విధంగా చేసుకుపోవడం అన్యాయమన్నారు. 1996లోనే వామపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చాయని అన్నారు. 2010లో ఇదే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిందని, లోక్‌సభలో కొందరు బిజెపి ఎంపిలు కూడా అడ్డుకుని, 2023లో పార్లమెంటులో ఆమోదించినా అమలు చేయకుండా జనాభాలెక్కల పేరుతో తొక్కిపెట్టారని అన్నారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, నియోజవకర్గాల ఏర్పాటు వంటి వేర్వేరు అంశాలను ఇందులో ప్రస్తావించారని తెలిపారు.

రాష్ట్రాలకు అన్యాయం జరగదని, దీనిపై తనదీ బాధ్యతని చెబుతూనే ప్రధాని రాష్ట్రాలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఇప్ప్పుడు జనాభా లెక్కలు మొదలుపెట్టి 2011 జనాభా లెక్కల ప్రకారం చేయడం అంటే ఎస్‌సి, ఎస్‌టిలకు అన్యాయం చేయడమేనని తెలిపారు. ప్రస్తుతం ఆయా తరగతుల జనాభా పెరిగిందని, పాత లెక్కల ప్రకారం ఇస్తే వారికి పార్లమెంటు సీట్లు తగ్గుతాయని అన్నారు.

ఈ విషయంలో బిజెపి ఎంపిలను సంతప్తి పరిచేందుకు అన్ని రకాల కుట్రలూ చేశారని విమర్శించారు. వాస్తవంగా డీలిమిటేషన్ అనేది ఒక కమిటీ ఏర్పాటు చేసిన తరువాత రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని సమగ్రంగా జరగాలని, అదేమీ లేకుండానే పునర్విభజన ప్రక్రియ చేస్తున్నారని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని కప్పిపుచ్చేందుకు అనేక ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.

డీలిమిటేషన్‌తో నిమిత్తం లేకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని, డీలిమిటేషన్ బిల్లును ఉపసంహరించుకుని అన్ని పక్షాలతో సంప్రదించడానికి తుది రూపం ఇవ్వాలని శ్రీనివాసరావు డిమాండు చేశారు.

సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు అని చెబుతున్నా దానికి సంబంధించి పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలనుగానీ కేంద్రం సంప్రదించలేదని అన్నారు. 2023లో బిల్లును తీసుకొచ్చిన సమయంలో 2026 సెన్సన్‌కు లింకు పెట్టారని, ఇప్ప్పుడు 2011 లెక్కల ప్రకారం చేస్తున్నామని చెబుతున్నారని ఇదంతా మోసమని అన్నారు. పార్లమెంటులో, చట్ట్టసభల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండు చేశారు.

Related posts

కోవర్టు ఆపరేషన్లతో రేవంత్ కు పరేషాన్

Satyam News

మత్తు పదార్థాల వల్ల భవిష్యత్తు అంధకారం

Satyam News

సీఎం రేవంత్ కు నర్సస్ అసోసియేషన్ కృతజ్ఞతలు

Satyam News

ఫేక్ వార్తలపై వైసీపీకి షాక్ ఇచ్చిన కోర్టు

Satyam News

హార్మోజ్ జలసంధిని మళ్ళీ మూసేసిన ఇరాన్

Satyam News

మిథున్ రెడ్డికి బిగ్‌షాక్..బెయిల్ రద్దు.?

Satyam News

Leave a Comment