ఒక ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ ఆ మేరకు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. అందులో భాగంగా బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇటీవల ప్రధాని మోడీ విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మే 13 నుంచి అమల్లోకి వచ్చేలా సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జ్ (SWS), అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ (AIDC)లను కూడా ప్రభుత్వం పెంచింది.
దీంతో బంగారం దిగుమతులపై మొత్తం కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి చేరింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ బంగారం దిగుమతులు విలువ పరంగా 24 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 71.98 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే పరిమాణ పరంగా మాత్రం దిగుమతులు 4.76 శాతం తగ్గి 721.03 టన్నులకు చేరాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం కూడా భారత్ దిగుమతి బిల్లుపై ప్రభావం చూపుతోంది. FY25 (ఆర్ధిక సంవత్సరం)లో కిలో బంగారం ధర 76,617.48 డాలర్లు ఉండగా, FY26లో అది 99,825.38 డాలర్లకు పెరిగింది.
దేశీయ మార్కెట్ లో భారీగా పెరిగిన బంగారం ధరలు
దేశీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజులో రూ.1,500 పెరిగి రూ.1,56,800కు చేరగా, వెండి ధర కిలోకు రూ.12,000 పెరిగి రూ.2,77,000కు చేరింది.
అయితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 1 శాతం తగ్గి 4,692.64 డాలర్లకు చేరగా, వెండి 3.04 శాతం పడిపోయి 83.49 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
గతంలో 2024-25 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగానికి ఊతమివ్వడం, స్మగ్లింగ్ తగ్గించడం, దేశీయ ధరలను తగ్గించడమే లక్ష్యంగా బంగారం దిగుమతి సుంకాన్ని 6 శాతానికి తగ్గించింది. అంతకుముందు 2022లో Russia-Ukraine War ప్రభావంతో రూపాయి పతనం, కరెంట్ అకౌంట్ లోటు పెరగడంతో దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచింది.
భారత్ ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారం వినియోగించే దేశంగా ఉంది. ముఖ్యంగా ఆభరణాల పరిశ్రమ అవసరాల కోసం బంగారం దిగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ పశ్చిమ ఆసియా సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థకు “లైవ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ స్ట్రెస్ టెస్ట్”లా మారిందన్నారు. ఇది ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్, రూపాయి మారకం విలువపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.
అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి మూతపడటంతో భారత్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. దేశంలో వినియోగించే LPGలో 60 శాతం దిగుమతుల ద్వారా వస్తుండగా, అందులో 90 శాతం హోర్ముజ్ జలసంధి మార్గంలోనే రవాణా అవుతోంది.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రజలకు పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించడం, మెట్రో సేవలు వినియోగించడం, కార్‌పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, అవసరం లేని విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం వంటి సూచనలు చేశారు.
