విశాఖపట్నంహోమ్

భోగాపురం విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి నూతన అధ్యాయం

#PavanKalyan

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రూ.17,435 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం కావడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టుల ద్వారా రోడ్ల అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని, ఇంధన రంగ పరిశ్రమలకు అవసరమైన సరఫరా వ్యవస్థ (సప్లై చైన్) మెరుగుపడుతుందని చెప్పారు. దీంతో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.

ఏ దేశమూ కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదని, మౌలిక వసతులను విస్తరించి ప్రజలకు సౌకర్యాలు కల్పించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన “వికసిత భారత్”, “ఆత్మనిర్భర భారత్” లక్ష్యాలు దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే దిశగా ఉన్నాయని పేర్కొన్నారు. చరిత్ర కేవలం నిర్మించిన కట్టడాలను మాత్రమే కాకుండా, వాటి వల్ల దేశ భవిష్యత్తులో వచ్చిన మార్పులను కూడా గుర్తుంచుకుంటుందని వ్యాఖ్యానించారు.

విశాఖపట్నంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, ప్రస్తుతం ఎన్టీపీసీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్, జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర నిర్మాణానికి బలమైన పునాదులు వేస్తున్నాయని తెలిపారు. అమరావతి అభివృద్ధికి రూ.50 వేల కోట్ల నిధులు, రాయలసీమ అభివృద్ధికి రూ.13,400 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని, అలాగే విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతోందని చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనపై ఎన్నో విమర్శలు వచ్చాయని, అయితే దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడం తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకప్పుడు విదేశాలకు బంగారం తాకట్టు పెట్టే పరిస్థితిలో ఉన్న భారతదేశాన్ని ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో మోదీ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.

పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ సేవలో మోదీ అంకితభావంతో పనిచేస్తున్నారని, ఆయన శ్రమను కొత్త తరం అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం విదేశీ పెట్టుబడులు భారీగా భారత్‌కు వస్తున్నాయని, విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో ఉన్నాయని, భారత అభివృద్ధిని చూసి శత్రు దేశాలు సైతం అసూయ చెందుతున్నాయని అన్నారు.

సరిహద్దుల్లో బాహ్య శత్రువులతో పాటు అంతర్గత సవాళ్లను కూడా ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధానమంత్రికి ప్రజలంతా అండగా నిలవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. “మీ మీద విమర్శ వస్తే అది యావత్ భారతదేశంపైనే వచ్చిన విమర్శగా భావించే బలం ప్రజలు ఇవ్వాలి” అని అన్నారు.

సభా వేదికపై మాట్లాడుతూ, “భారతదేశంలో నరేంద్ర మోదీకి సాటి నాయకుడు మరొకరు లేరు. రారు, రాబోరు” అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 144 కోట్ల మంది భారతీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అనేక సవాళ్లను చిరునవ్వుతో ఎదుర్కొని పరిష్కరిస్తున్న నాయకుడు మోదీ అని కొనియాడారు.

2024 ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి ఏర్పాటుకు తాను పట్టుదలగా కృషి చేయడానికి ప్రధాన కారణం రాష్ట్ర అభివృద్ధికి బలమైన నాయకత్వం అవసరమనే నమ్మకమేనని చెప్పారు. భోగాపురం వంటి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడం వంటి పరిణామాలకు కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో కూడిన నాయకత్వమే కారణమని పేర్కొన్నారు.

25 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి సంస్కారం, సంప్రదాయ విలువలు నేర్పాలని, వారిని దేశానికి ఉపయోగపడే బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల విడుదల చేసిన ఒక వీడియోను తాను చూశానని, తనను విమర్శించిన వారిని కూడా పెద్ద మనసుతో క్షమించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. దేశాభివృద్ధిని మోదీ ఒక రామకార్యంగా భావిస్తున్నారని, హనుమంతుడు రామకార్యం కోసం అన్ని అవాంతరాలను అధిగమించినట్లే, దేశసేవలో ఎదురయ్యే ప్రతి సవాలును మోదీ దృఢ సంకల్పంతో అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Related posts

రేవంత్ ప్రభుత్వ పాలసీలు తుగ్లక్ పాలసీలు

Satyam News

నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డు సందర్శించిన కేటీఆర్

Satyam News

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేనకా గాంధీ

Satyam News

లోకేష్‌ ను ఫాలో అవుతున్న జగన్‌, కేటీఆర్‌..

Satyam News

ఇన్‌స్టా పెద్దాయనకు చంద్రబాబు భరోసా….. సిద్దాంతంలో ఇంటరెస్టింగ్‌ సీన్‌!

Satyam News

పాక్ తో క్రికెట్ మ్యాచ్ బాయ్ కాట్

Satyam News

Leave a Comment