సంపాదకీయంహోమ్

అబద్ధాల పునాదులపై ఎంత కాలం ఇలా…?

#Jagan

అధికారం కోల్పోయిన రెండేళ్ల తర్వాత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఆసక్తికరమైన ఈ అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తం అవుతున్నది. అదేమిటంటే…. పార్టీ ఏ ప్రాంతంలో కూడా ఆశాజనకంగా లేదు. అందుకే జగన్ మోహన్ రెడ్డి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అందుకే నిరాశ నిస్పృహలతో జగన్ మోహన్ రెడ్డి అసహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. గత కొన్నాళ్లుగా ఆయన చేస్తున్న తప్పులు పార్టీ కొంప ముంచబోతున్నాయనే భావన కూడా ఆ పార్టీ వర్గాల్లో ఉంది. అధికారం కోల్పోయి రెండేళ్లు కావడంతో మళ్లీ అధికారం సంపాదించాలనే ధ్యేయంతో ఆయన తప్పటడుగులు వేస్తున్నారని వారు అంటున్నారు.

2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తరువాత ఆయన పెట్టిన మొదటి ప్రెస్‌మీట్‌లో, “కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోతాయి.. తర్వాత మనదే అధికారం” అంటూ పార్టీ నేతల్లో ఆశాభావం వ్యక్తం చేసే విధంగా మాట్లాడారు. దాంతో ఆయన కాలాన్ని నమ్ముకున్నారని, ఐదేళ్లపాటు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని అందరూ అభిప్రాయపడ్డారు.

గోబెల్స్ ప్రచారం పైనే జగన్ ఆశలన్నీ…

అయితే నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర కంటే ఆయన గోబెల్స్ ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడంతో ఇప్పుడు ఆయన చెప్పే మాటలను సామాన్య ప్రజలు నమ్మడం లేదు. ఇటీవల కాలంలో ఆయన చేసిన ప్రతి విమర్శ తిరిగి ఆయనకే కొట్టింది. దీంతో ఆయన ఏమి చేస్తున్నారో, పార్టీ ఎటు వెళుతోందో తెలియక పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

ఇక ఇటీవల కాలంలో మరో అంశంగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ను ఎత్తుకుని అదే రీతిలో జగన్ విమర్శలకు గురయ్యారు. ఏడాది క్రితం జరిగిన డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, డీఎస్సీ ప్రశ్నాపత్రం లీకైందని, డీఎస్సీలో టీడీపీ వారికే ఉద్యోగాలు ఇచ్చారని, ముఖ్యంగా కమ్మవారికే అన్ని ఉద్యోగాలు ఇచ్చారని ఆయన తన పార్టీ నాయకులతో చేయించిన ప్రచారం ఆయనకే తిరిగి కొట్టింది.

ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా అంటూ ఆయన చేసిన యాగీ మొదట్లో కొంతమందైనా నమ్మేలా చేసింది. ఎప్పుడైతే తన పెయిడ్ బ్యాచ్‌తో స్పోర్ట్స్ ఉద్యోగాలన్నీ కమ్మవారికే ఇచ్చారని రిటైర్డ్ ఐఏఎస్‌తో వ్యాఖ్యలు చేయించారో, వారి క్రెడిబిలిటీ మరింతగా దెబ్బతింది. ఆ రిటైర్డ్ ఐఏఎస్ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా టీడీపీ డీఎస్సీలో ఎంతమందికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారు, అందులో కమ్మవారు ఎంతమంది ఉన్నారో లెక్కలతో సహా ప్రజలకు బహిరంగం చేసింది. దీంతో జగన్ బ్యాచ్‌కు చుక్కలు కనిపించాయి. వారు ప్రజలను ఎంత మోసగిస్తున్నారో, ఏ రకంగా బురద చిమ్ముతున్నారో ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు కూడా జగన్ కే దెబ్బ…

ఇదొక్కటే కాదు.. ఇటీవల కాలంలో తెలంగాణకు చెందిన ఓ సీనియర్ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు కూడా జగన్‌కే చుట్టుకున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యల వెనుక వైకాపానే ఉందని, ఒక పథకం ప్రకారం దెబ్బకొట్టడానికే జగన్ ఆ వ్యాఖ్యలు చేయించారనే భావన జనసేన, కూటమి నాయకులు, కార్యకర్తల్లో వ్యక్తమైంది. దీన్ని కూటమి బలంగా తిప్పికొట్టడంతో ఇక్కడ కూడా జగన్‌కు నిరాశే ఎదురైందని చర్చ సాగుతోంది.

ఇటీవల కాలంలో ఆయన నిర్వహించిన ప్రెస్‌మీట్లలో ఒకదానిలో తన తాత రాజారెడ్డి, తన తండ్రి రాజశేఖర్‌రెడ్డి, తన బాబాయి వివేకానందరెడ్డిలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హత్య చేయించారని ఆయన విమర్శించారు. అయితే ఆ విమర్శలను టీడీపీ బలంగా తిప్పికొట్టింది. జగన్ తాత రాజారెడ్డి ఎలాంటి వ్యక్తో, తండ్రి రాజశేఖర్‌రెడ్డి ఎలాంటి వ్యక్తో అంటూ టీడీపీ ఆధారాలతో పాత చరిత్రను తవ్వితీసి జగన్‌ను ఎండగట్టింది.

ఇక జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్య ఎవరు చేయించారో, ఎవరు దానిలో పాత్రధారులో, కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ ఎందుకు అరెస్టు చేసిందో, ఆయన చెల్లెలు, తల్లి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ టీడీపీ ఎదురుదాడి చేసింది. పాత చరిత్రతో పాటు తన చెల్లెలు చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టలేక జగన్ పార్టీ, “దీన్ని మా నాయకుడు ఎందుకు ప్రస్తావించారు?” అంటూ చెంపలేసుకుందని చర్చ జరుగుతోంది.

జగన్ పిలుపునకు స్పందన కరవు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిన సందర్భంగా జగన్ పార్టీ నిర్వహించిన “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమం కూడా అనుకున్నంత విజయవంతం కాలేదు. స్వంత పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పదవుల తాయిలాలు, ఎమ్మెల్యే సీట్లు ఇస్తాననే హామీలతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారని, దాంతో కొంతమంది పదవులకు ఆశపడి అందులో పాల్గొన్నారనే భావన పార్టీలో ఉంది. మరీ ముఖ్యంగా పార్టీ ఐడీ కార్డులు పంపిణీ చేస్తామని సామాన్య కార్యకర్తలకు ఆశ చూపి వారిని కార్యక్రమంలో పాల్గొనేలా చేశారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మొత్తం మీద జగన్ ఏదో చేయబోయి ఏదో చేస్తున్నారని, చివరకు అది ఆయనకే తిరిగి కొడుతోందనే భావన వ్యక్తమవుతోంది. ఎందుకు జగన్ ఈ విధంగా చేస్తున్నారనే దానిపై కొందరు నేతలు ఇలా అంటున్నారు. లిక్కర్ కుంభకోణంలో తనకు అత్యంత సన్నిహితులైన వారిని ఈడీ అరెస్టు చేస్తుండటంతో, దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్ ఈ విధమైన ఎత్తుగడలు వేస్తున్నారని, అయితే అవి ఫలితాలను ఇవ్వడం లేదని వారు అంటున్నారు.

లిక్కర్ కుంభకోణంలో తన పీఏ అరెస్టయిన విషయాన్ని, తన అంతరంగికులతో పాటు తననూ ప్రశ్నించే అవకాశం ఉండడంతో, జగన్ మొదట తన తాత, కుటుంబ సభ్యుల మరణాల అంశంతో సానుభూతి పొందాలని భావించారని, అది ఫలించకపోవడంతో ఇప్పుడు డీఎస్సీ అంశాన్ని అందుకున్నారని వారు చెబుతున్నారు. నిజంగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో అవినీతి, అక్రమాలు జరిగి ఉంటే పోరాడే పద్ధతి ఇది కాదని, కానీ ఆయన దానికి కూడా కులరంగు పులమాలని చూశారని, అయితే ప్రభుత్వం అత్యంత అప్రమత్తతతో దాన్ని తిప్పికొట్టడంతో జగన్ మరోసారి ప్రజల్లో చులకన అయ్యారనే భావన పార్టీ వర్గాలతో పాటు ఆయన సానుభూతిపరుల్లోనూ వ్యక్తమవుతోంది.

Related posts

బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణ హత్య

Satyam News

ఫుల్‌ఫామ్‌లో ఏపీ ఎకానమీ…. దేశంలోనే టాప్‌ ప్లేస్‌

Satyam News

విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గించేలా ప్రణాళికలు

Satyam News

ఉత్సాహంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సమావేశం

Satyam News

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల పరిశీలన

Satyam News

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం అమలు చేయాలి

Satyam News

Leave a Comment