పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రులు అచ్చెన్నాయుడు, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డి, బీఎన్. విజయకుమార్, ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రకాశం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని మంత్రి గొట్టిపాటి చెప్పారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. పొగాకు బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే వేలం వేదికల ద్వారానే కొనుగోళ్లు జరగాలని, అనధికార లావాదేవీలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైతులు పండించిన పంటకు సరైన విలువ దక్కేలా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేపడుతుందని చెప్పారు. ఉత్పత్తి పెరిగిందనే కారణంతో రైతులకు నష్టం కలిగించే నిర్ణయాలను అనుమతించబోమని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేసిందన్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పొగాకును తిరస్కరించడం వల్ల రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి పరిస్థితులు లేకుండా కనీస మద్దతు ధరగా రూ. 200 తగ్గకుండా కంపెనీలు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు చెప్పారు.
గత ఏడాది మార్కెట్‌లో లభించిన ప్రోత్సాహకర ధరల కారణంగా ఈసారి సాగు విస్తీర్ణం పెరిగిందని, సిగిరెట్ వంటి వాటిపై ట్యాక్సులు పెరిగాయనే కారణాలు చెప్పి పొగాకును తిరస్కరించరాదని మంత్రి స్పష్టం చేశారు. పండించిన పంటకు మార్కెట్ కల్పించే బాధ్యతను సంబంధిత సంస్థలు నిర్వర్తించాల్సిందేనని పేర్కొన్నారని తెలిపారు. భవిష్యత్తులో ఉత్పత్తి, డిమాండ్, కొనుగోలు సామర్థ్యం వంటి అంశాలను ముందుగానే సమీక్షించి పంట ప్రణాళిక రూపొందించే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు.
రైతులు, పొగాకు కంపెనీలు, బోర్డు అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేస్తే ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని, రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
