ముఖ్యంశాలుహోమ్

గంజాయి సాగు ఆపడానికి ఇక పల్లెల్లో ఈగల్

విశాఖపట్నం వేదికగా ఈగల్ చీఫ్ ఏకే రవికృష్ణ రాష్ట్రంలో గంజాయి నిర్మూలనపై కీలక ప్రకటన చేశారు. అల్లూరి జిల్లా కొత్తవలస గ్రామంలో “పల్లె బాటలో ఈగల్” అనే వినూత్న కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూలై 14 నుంచి ఆగస్టు 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా గంజాయి నిర్మూలనపై ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గంజాయి సాగును పూర్తిగా అరికట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, డ్రోన్ సర్వేలు, కార్డన్ సెర్చ్‌ల ద్వారా సాగు ప్రాంతాలను గుర్తించి ధ్వంసం చేస్తున్నామని చెప్పారు.

గంజాయి సాగుకు అలవాటు పడిన రైతుల్లో మార్పు తెచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతున్నట్లు ఏకే రవికృష్ణ వివరించారు. ఇందులో భాగంగా 25 వేల మంది రైతులకు, 35 వేల ఎకరాల్లో ఇతర లాభదాయక పంటలను సాగు చేసుకునేందుకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లోని చెక్‌పోస్టులను మరింత బలోపేతం చేశామని స్పష్టం చేశారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా ఉండేందుకు విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా ఈగల్ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని, ఆధునిక సాంకేతికతతో ఈగల్ వ్యవస్థను బలోపేతం చేస్తూ యువతను ఈగల్ వారియర్స్గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన పిలుపునిచ్చారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే ‘1972’ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల రాష్ట్రంలో గంజాయి సాగుతో పాటు దాని వినియోగం కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టిందని ఈగల్ చీఫ్ ఏకే రవికృష్ణ ధీమా వ్యక్తం చేశారు.

Related posts

ఏరువాక పున్నమి సందర్భంగా తుమ్మల శుభాకాంక్షలు

Satyam News

మధ్యప్రదేశ్ లో ఇక యూనిఫామ్ సివిల్ కోడ్

Satyam News

రామమందిరం సీఈవో పోస్టుకు గట్టిపోటీ?

Satyam News

డీప్‌ఫేక్ కలకలం: మహిళ ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు!

Satyam News

దివ్య క్షేత్రంగా శ్రీశైలం ఆలయ అభివృద్ధి

Satyam News

‘హైడ్రా’ విలువ ఇప్పటికైనా తెలుసుకోండి

Satyam News

Leave a Comment