25.3 C
Hyderabad
September 29, 2026
ముఖ్యంశాలుహోమ్

కల్తీ నెయ్యిపై మరో కమిటీ..నిర్ణయం సరైనదేనా?

#Chandrababu

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఈ వ్యవహారంపై సిట్‌ సమర్పించిన 11 పేజీల నివేదికపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో కుట్ర కోణం దాగి ఉందని, బాధ్యులైన పెద్దలను నిందితులుగా చేర్చడంలో సిట్ విఫలమైందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, కల్తీ నెయ్యి సరఫరాపై లోతైన విచారణ కోసం మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.

గత వైసీపీ ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కి, అర్హత లేని సంస్థలకు టెండర్ల కట్టబెట్టిందని సీఎం మండిపడ్డారు. నందిని వంటి సహకార సంస్థలను పక్కనపెట్టి, ఫేక్ సర్టిఫికెట్స్ ఉన్న కంపెనీలకు ఛాన్స్‌ ఇచ్చారని  ధ్వజమెత్తారు. నాటి TTD పెద్దలు, అధికారులు ఈ కల్తీ వ్యవహారాన్ని ఐదేళ్లపాటు దాచిపెట్టడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ హయాంలో నెయ్యి పరీక్షలు కేవలం ఒకే ఒక్కసారి జరగ్గా, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ కొద్ది కాలంలోనే 10 సార్లకు పైగా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు కేబినెట్‌కు వివరించారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని NDDB నివేదిక స్పష్టం చేసినా, వైసీపీ నేతలు దీనిపై ఎదురుదాడి చేయడం సిగ్గు చేటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానిజాలను రికార్డులు, రిపోర్టులతో సహా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, సత్యకుమార్ ఈ చర్చలో పాల్గొన్నారు. భోలేబాబా డెయిరీ వంటి సంస్థల సామర్థ్యంపై పవన్ కల్యాణ్ ప్రశ్నించగా, కిలో నెయ్యిపై రూ.25 చొప్పున అప్పటి ఛైర్మన్ సన్నిహితులు వసూళ్లకు పాల్పడ్డారని మంత్రి లోకేశ్ ఆరోపించారు. కేవలం 10 మంది సిబ్బంది ఉన్న కంపెనీలకు భారీ కాంట్రాక్టులు ఇవ్వడం వెనుక అవినీతిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.

ఇక, కల్తీ నెయ్యి పాపానికి ఒడిగట్టిన వారు ఎవరైనా సరే కఠిన శిక్ష పడాల్సిందేనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొత్త కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా, సిట్ ఛార్జిషీట్‌లోని లోపాలపై కోర్టులో కేసు వేయడమా లేదా TTD ద్వారా ఫిర్యాదు చేయించడమా అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. తిరుమలకు వచ్చే కోట్లాది భక్తుల విశ్వాసాలను కాపాడటమే తమ ప్రాధాన్యతని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Related posts

విద్యార్థుల హాస్టళ్లకు త్వ‌ర‌లో 2.55 ల‌క్ష‌ల దోమ తెర‌లు

Satyam News

బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్ లు

Satyam News

గణనీయంగా తగ్గిన దుబాయ్ ప్రయాణీకుల సంఖ్య

Satyam News

రెండు పెళ్లిళ్లు..సహజీవనం..అక్రమ సంబంధం..చివరకు మర్డర్

Satyam News

అసెంబ్లీ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ

Satyam News

విజయసాయి రీఎంట్రీ..వైసీపీ సర్కిల్స్‌లో జోరుగా చర్చ.!

Satyam News

Leave a Comment