ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 99.99 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కూటమి కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లోనూ ఫ్యాన్ గాలి పూర్తిగా ఆగిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో వైఎస్సార్సీపీ శిబిరంలో భూకంపం పుట్టింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డపైనే వైఎస్ ఫ్యామిలీకి తొలిసారి ఎదురుదెబ్బ తగలడంతో ఆ పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఈ భారీ ఓటమికి కారణం ఎవరా అని బేరీజు వేసుకుంటున్న జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి వర్గాల నోటా ఇప్పుడు ఒకే ఒక్క పేరు వినిపిస్తోంది. అదే… యువనేత, మంత్రి నారా లోకేష్!
ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తీరు చూస్తుంటే… వైసీపీ నేతలకు దిమ్మతిరిగిపోతోంది. ఎక్కడైతే మనదే హవా అనుకున్నారో, ఏ మున్సిపాలిటీల్లో అయితే తిరుగులేదని భావించారో…ఆ స్థానాలన్నీ ఒక్కొక్కటిగా కూటమి ఖాతాలో పడిపోతుండటంతో వైఎస్సార్సీపీ పెద్దలు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పులివెందుల మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత చరిత్రలో తొలిసారి వైఎస్ కుటుంబం చేతి నుంచి అధికారం జారిపోవడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి…తెరవెనుక నడిచిన అసలు వ్యూహాన్ని చూసి కంగుతింటున్నట్లు సమాచారం.
ఈ మొత్తం ఎన్నికల మేనేజ్మెంట్లో నారా లోకేష్ వేసిన గ్రౌండ్ వర్క్, వ్యూహాత్మక అడుగులే కూటమిని విజయ తీరాలకు చేర్చాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక దగ్గరుండి చూసుకోవడం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, ఎక్కడా లోటుపాట్లు రాకుండా ప్రతి మున్సిపాలిటీని సీరియస్‌గా తీసుకోవడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు. ప్రతిపక్షం ఊహించని రీతిలో పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లడం వల్లనే 99.99% స్థానాల్లో కూటమి జెండా ఎగిరేలా చేయగలిగారు.
సొంత అడ్డాలోనే పార్టీని కాపాడుకోలేకపోయామనే ఆవేదనతో పాటు, నారా లోకేష్ రాజకీయ వ్యూహాల ముందు తమ పార్టీ సీనియర్లు తేలిపోయారనే నిరాశ ఇప్పుడు వైఎస్సార్సీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అంతా ఆయనే చేశాడు, కూటమిని ముందుండి నడిపించి మన కొంప ముంచాడు అంటూ వైసీపీ శిబిరంలో లోకేష్‌పై తీవ్ర స్థాయిలో అక్కసు వెళ్లగక్కుతున్నారు.
మొత్తానికి, మున్సిపల్ ఎన్నికల ఫలితాల ద్వారా నారా లోకేష్ తన పొలిటికల్ మాస్టర్ మైండ్ ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. జగన్, కళ్లెదుటే కంచుకోటలను బద్దలు కొట్టి, కూటమికి చారిత్రక విజయాన్ని అందించిన లోకేష్ వ్యూహం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
