బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ యొక్క రజతోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని సోమవారం జూన్ 22 న సాయంత్రం హైటెక్ సిటీలోని నొవాటెల్ హోటల్ లో నిర్వహిస్తున్నామని నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.
నేడు హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారు మాట్లాడుతూ 2000 వ సంవత్సరములో ప్రారంభమైన సంస్థ 25 సంవత్సరములు పూర్తి చేసుకొని ముందుకు సాగుతోందని ప్రస్థానాన్ని వివరించారు. నందమూరి తారకరామారావు, శ్రీమతి బసవతారకం లో ఆశయాల మేరకు నడపడం జరుగుతోందని అంటూ గత సంవత్సర కాలంగా రజతోత్సవ వేళ పలు కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు.
ఈ రజతోత్సవ కార్యక్రమాల ముగింపు ఈ నెల 22 న నిర్వహించబోయే భారీ కార్యక్రమంతో ముగుస్తుందని వివరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె పి నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశిష్ట అతిదులుగా హాజరుకానున్నారని తెలిపారు. వీరితో పాటూ కేంద్ర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, తెలంగాణా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఆంద్ర ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ లు హాజరుకానున్నారని బాలకృష్ణ వెల్లడించారు.
గడువు లోగా తుళ్లూరు క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం
ఈ కార్యక్రమం ద్వారా 25 సంవత్సరముల గడిచిన కాలాన్ని అవలోకనం చేసుకొంటూ భవిష్యత్తులో హైదరాబాదు హాస్పిటల్ వద్ద నిర్మించనున్న సరికొత్త నార్త్ బ్లాక్ మరియు అమరావతిలోని తుళ్లూరు వద్ద నిర్మించనున్న హాస్పిటల్ ను అనుకొన్న గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్మాణంతో పాటూ నడపడానికి గత 25 సంవత్సరములుగా సహకరించిన వారందరినీ గుర్తుకుతెచ్చుకొని వారి స్పూర్తితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. లభాపేక్ష లేకుండా సంస్థ నిర్వహించడం జరుగుతోందని, భవిష్యత్తులోనూ ఇదే పంథాలో కొనసాగుతున్నామని స్పష్టం చేశారు.
మీడియా సమావేశానికి ముందుగా హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకలలో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారుల మధ్య సంస్థ సిబ్బంది ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి వారితో పంచుకొన్నారు. అనంతరం చిన్నారులకు బొమ్మలు మరియు ఇతర బహుమతులు అందజేశారు. అనంతరం హైదరాబాదుకు చెందిన శ్రీ సీతారామారాజు హాస్పిటల్ కు అందించిన లక్ష రూపాయాల విరాళాన్ని స్వీకరించారు.
తర్వాత త్రివేణి, కృష్ణవేణి స్కూల్లకు చెందిన విద్యార్థీ, విద్యార్థిణులు క్యాన్సర్ రోగుల సహాయార్థం సేకరించిన లక్షా వెయ్యి నూట పదహారు రూపాయాల విరాళాన్ని యాజమాన్యం, పిల్లలు బాలకృష్ణ అందజేశారు. పిమ్మట అమరావతిలోని తుళ్లూరు వద్ద నిర్మాణమవుతున్న నూతన హాస్పిటల్ నిర్మాణానికి శ్రీ కాకర్ల రాఘవేంద్ర రావు అందించిన పది లక్షల రూపాయాల విరాళాన్ని చెక్కు రూపంలో స్వీకరించారు.
ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా చిన్నారులు చేస్తున్న మంచి పనిని ప్రశంసించారు. పుట్టిన రోజులు శుభాకాంక్షలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేస్తూ రానున్న రోజులలో మరింత ఉత్సాహంగా పని చేసేందుకు భగవంతుడు అవకాశమివ్వాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమాలలో మెడికల్ డైరెక్టర్, BIACH&RI డా. టి సుబ్రహ్మణ్యేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్ డా. ఫణికోటేశ్వర రావు, ఆసోసియేట్ డైరెక్టర్ – అకడమిక్స్ డా. కల్పనా రఘునాధ్,పలువురు వైద్య విభాగాధిపతులు, వైద్యులు, నర్సింగ్ మరియు పారా మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
