వేంకటేశ్వర స్వామికి కల్తీ నెయ్యితో నైవేద్యం పెట్టి ఆ నెపం నాపై వేస్తున్నారు అంటూ చంద్రబాబునాయుడు నిప్పులు చెరగారు. గతంలో ఇదే విధంగా బాబాయిని చంపి నాపై వార్త రాశారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో రౌడీయిజం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. మార్కాపురం జిల్లాలో నిర్వహించిన “ వెలిగొండతో జలకళ – హార్టీకల్చర్ రైతుల జీవితాల్లో కళకళ” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రసంగించారు.
వేదిక వద్ద ఏర్పాటు చేసిన ర్యాంపుపై నడుస్తూ ప్రజల హర్షధ్వానాల మధ్య ఆయన మాట్లాడారు. గత పాలనలో రాష్ట్రం విధ్వంసమైందని, పునర్నిర్మాణం కోసం ఎన్నికల్లో ప్రజల సహకారం కోరానని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన, బీజేపీలతో కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ప్రజల ఆశీస్సులతో విజయం సాధించామని చెప్పారు. ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్‌తో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
మళ్లీ ఎన్నికల్లో మమ్మల్నే గెలిపించాలి
అరకు నుంచి ఉమ్మడి ప్రకాశం వరకు ప్రతిపక్షానికి ఒక్క సీటు కూడా రాలేదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రకాశం, మార్కాపురం జిల్లాలన్నింటిలో కూటమిని వందశాతం గెలిపించాలని ప్రజలను కోరారు. ఒంగోలుకు 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన ఇబ్బందిని తొలగిస్తూ మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు.
మార్కాపురంతో పాటు మదనపల్లి, పోలవరం జిల్లాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలు నీరు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నాయని, మార్కాపురానికి మరో వరంగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని, ఇప్పుడు దాన్ని పూర్తి చేసే అవకాశం కూడా తనకే లభించిందన్నారు.
2019-24 మధ్య రాష్ట్రానికి చీకటి రోజులు వచ్చాయని, ఆ కాలంలో వెలిగొండ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని విమర్శించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4.35 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగరి నియోజకవర్గాలతో పాటు ఉదయగిరి, కడప, బద్వేలు ప్రాంతాలకు కూడా నీరు అందుతుందని తెలిపారు.
నేను సీఎంగా కొనసాగి ఉంటే వెలిగొండ ఎప్పుడో పూర్తయ్యేది
తాను ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే 2021లోనే ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇచ్చేవాళ్లమని అన్నారు. గత పాలకులు పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేశామని దొంగనాటకాలు ఆడారని ఆరోపించారు. నిజంగా పనులు పూర్తయ్యి ఉంటే ఇప్పుడు తనకు రావాల్సిన అవసరం ఉండేదే కాదన్నారు. నాలుగు సార్లు సభలు పెట్టి నాలుగు తేదీలు ఇచ్చినా ప్రాజెక్టు పూర్తి కాలేదని విమర్శించారు.
ఉత్తుత్తి ప్రాజెక్టుకు రిబ్బన్ కట్ చేసి ప్రజలను మోసం చేశారని అన్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.9,081 కోట్ల నిధులు అవసరమని, ఇప్పటివరకు రూ.5,451 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. భూసేకరణకు రూ.484 కోట్లు, పునరావాసానికి రూ.184 కోట్లు వ్యయం చేశామని తెలిపారు. రెండు దశల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించామని, ఇంకా రూ.2,540 కోట్లు అవసరమని చెప్పారు.
గత 20 నెలల్లోనే రూ.540 కోట్లు ఖర్చు చేసి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. రూ.456 కోట్లతో ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేసి సభకు వచ్చినట్లు చెప్పారు. గత పాలకులు ఐదేళ్లలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేసి పనులు పూర్తయ్యాయని ప్రచారం చేశారని విమర్శించారు. ఎవరు మంచి చేస్తే వారికి ప్రజలు అండగా నిలిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ప్రజల జీవితాలు మెరుగుపడతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
