తిరుమల కేంద్రంగా వైసీపీ సాగిస్తున్న కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయని కూటమి ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తిరుమలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాల్లో అనూహ్యంగా పెరిగే భక్తుల రద్దీని కూడా ముందుగానే అంచనా వేసుకుని సమర్థవంతమైన ఏర్పాట్లు చేస్తోందని పేర్కొంటున్నాయి. దర్శనాలు, భద్రత, అన్నదానం, వసతి వంటి అన్ని అంశాల్లో క్రమబద్ధమైన నిర్వహణ కొనసాగుతోందని చెబుతున్నాయి.
ఈ సమర్థవంతమైన పాలనను తట్టుకోలేక వైసీపీ ముఠా, సాక్షి మీడియా ద్వారా తిరుమలలో తొక్కిసలాట జరిగిందని, ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే స్వయంగా తిరుమలలో పర్యటించిన ఎస్పీ, అక్కడ ఎలాంటి తొక్కిసలాట జరగలేదని స్పష్టంగా వెల్లడించిన విషయాన్ని కావాలనే విస్మరిస్తున్నారని అంటున్నారు. నిత్యం ఏదో అపచారం జరిగిపోయినట్టు విషప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని కూటమి నేతలు మండిపడుతున్నారు.
ఐదేళ్ల అక్రమాలకు తెర దించిన కూటమి ప్రభుత్వం
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆలయాలకు సరైన రక్షణ లేకుండా పోయిందని, అప్పట్లో జరిగిన దుష్టచర్యలు దేశమంతా చూసిందని విమర్శిస్తున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ నిత్యం కొత్త కుట్రలతో ఆలయాలపై దుష్ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను కించపరుస్తోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఆలయాలపై కావాలనే వ్యాప్తి చేస్తున్న ఈ తప్పుడు ప్రచారం ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన దుష్ట సంప్రదాయమని అంటున్నారు.
ప్రధాన ఆలయాలను లక్ష్యంగా చేసుకుని జరగని సంఘటనలను జరిగినట్టుగా, లేని అవమానాలను ఉన్నట్టుగా అబద్ధాలు సృష్టించి సోషల్ మీడియాలో విషప్రచారం చేయడం కేవలం ఆలయాలపై దాడి మాత్రమే కాదని, కోట్లాది భక్తుల విశ్వాసంపై దాడిగా వారు అభివర్ణిస్తున్నారు.
తిరుమలపై వైసీపీ నిత్యం కుట్రలు చేస్తోందని పేర్కొంటూ, టీటీడీ గోశాలలో ఆవులు చనిపోతున్నాయని అబద్ధాలు ప్రచారం చేయడం, నిత్య అన్నదానం సరిగా జరగడం లేదని వదంతులు పుట్టించడం, దర్శన్ కంపార్ట్‌మెంట్ వద్ద డ్రామాలు ఆడించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటి ఘటనలను ఉదాహరణలుగా చూపుతున్నారు.
కట్టు కథలు సృష్టిస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న జగన్ అండ్ కంపెనీ
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేద విద్యార్థులకు నెలకు రూ.3,000 భృతి ఇస్తూ వారి అభ్యున్నతికి చర్యలు తీసుకుంటే, దానిపైనా తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మహాద్వారం ముందు గేట్ వద్ద సరదాగా దిగిన ఫోటోను కూడా వక్రీకరించి ప్రచారం చేయడం, టీటీడీ చైర్మన్ క్రైస్తవుడని అబద్ధాలు వ్యాప్తి చేయడం, భక్తులు పరుగులు తీశారంటూ ఫేక్ వీడియోలతో తొక్కిసలాట కథనాలు సృష్టించడం వంటి అంశాలను వారు ప్రస్తావిస్తున్నారు.
వైసీపీ హయాంలో ముంతాజ్ హోటల్‌కు ఇచ్చిన అనుమతులను రద్దు చేసిన కూటమి ప్రభుత్వంపై నిందలు మోపడం, చంద్రగిరి రోడ్డులోని హోటల్ ప్రకటనను అలిపిరి దారిలో ఉందని తప్పుడు ప్రచారం చేయడం, డ్రామా ఆర్టిస్టులను పెట్టి తాగుతున్నారంటూ దిగజారుడు ప్రచారం చేయడం వంటి ఘటనలు వరుసగా జరిగాయని ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ఒక్కటి రెండు కాదని, తిరుమల కొండపై వైసీపీ మూక చేసిన దాష్టీకాలు, దారుణాలు, దోపిడీలు అనేకమని పేర్కొంటున్నారు.
నాస్తికుడిని చైర్మన్ చేసి తిరుమల పవిత్రతపై కుట్ర
దొంగలు రాజ్యం చేస్తే ఎలా అనర్థాలు జరుగుతాయో, ప్రజాధనం ఎలా దోపిడీ అవుతుందో, దేవుడిని కూడా ఎలా దోచుకుంటారో జగన్ పాలన స్పష్టమైన ఉదాహరణగా నిలిచిందని విమర్శిస్తున్నారు. దేవుడిపై నమ్మకం లేని వారిని టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టి ఎన్నో ఘోరాలకు పాల్పడ్డారని, “తిరుపతి కొండపై ఉన్నది దేవుడు కాదు నల్లరాయి” అని వ్యాఖ్యానించిన భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్‌గా నియమించి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అస్తవ్యస్తం చేశారని ఆరోపిస్తున్నారు.
చరిత్రలో ముస్లిం దాడుల సమయంలో హిందూ ఆలయాలు, సంప్రదాయాలు ఎలా నశించాయో, అలాంటి పరిస్థితులు జగన్ పాలనలో మరోసారి పునరావృతమయ్యాయని కూటమి వర్గాలు అంటున్నాయి. వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన దోపిడీలపై కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేసి కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, పరకామణి దోపిడీ వ్యవహారాన్ని రాజీ చేసుకుని కప్పిపుచ్చిన తీరు సినిమా కథను తలపించిందని విమర్శిస్తున్నారు.
తలనీలాలు కూడా కొట్టేసిన ఘనులు
రూ.2 కోట్ల విలువైన తలనీలాలను మయన్మార్ మార్గంగా అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడిన ఘటన, పట్టు శాలువాలు తదితర వస్తువుల కొనుగోళ్లలో అక్రమాలు, గోవిందరాజుల స్వామి ఆలయ విమాన గోపురంపై ఉన్న సుమారు 50 కిలోల బంగారం మాయమవడం వంటి అంశాలు వైసీపీ హయాంలోనే జరిగాయని ఆరోపిస్తున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులు పోగొట్టుకున్న విలువైన వస్తువులను తిరిగి ఇవ్వకుండా దోచుకున్న ఘటనలూ ఉన్నాయని పేర్కొంటున్నారు.
తిరుమల వేదికగా ఎన్నో పాపాలు జరిగాయని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అన్యమతస్థుల నియామకాలు, బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం, కొండపై అన్యమత గుర్తులు, టీటీడీ వెబ్‌సైట్‌లో అన్యమత బోధనలు కనిపించాయని అంటున్నారు. భక్తులకు అశ్లీల వెబ్ లింకులు పంపడం, దర్శనం, వసతి, ప్రసాదాలు, టోల్ గేట్ ధరలను భారీగా పెంచి సామాన్య భక్తుడికి వెంకన్న దర్శనం దూరం చేయడం వంటి చర్యలను ప్రస్తావిస్తున్నారు.
లక్షలాది లడ్డులను కరపత్రాలతో ఓట్ల కోసం దుర్వినియోగం చేయడం, ఒకే సామాజిక వర్గానికి అధిక పదవులు కట్టబెట్టడం, అన్నదానంలో నాణ్యతలేని బియ్యం, కల్తీ పదార్థాలు వాడటం, స్వామి నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం, వీఐపీ దర్శనాలు, టికెట్లు, ప్రసాదాల్లో బ్లాక్ మార్కెట్ నడపడం వంటి ఆరోపణలు చేస్తున్నారు.
శారదా పీఠానికి నిబంధనలు తుంగలో తొక్కి భూమి కేటాయింపులు, అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం, టీటీడీ ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా ఉన్న రూ.5 వేల కోట్లను దారి మళ్లించేందుకు ప్రయత్నించడం వంటి అంశాలు కూడా వైసీపీ హయాంలో జరిగిన తీవ్రమైన అక్రమాలుగా వారు పేర్కొంటున్నారు.
