ప్రత్యేకంహోమ్

పశువులు తినే తౌడుతో ప్రియాగోల్డ్ బిస్కెట్లు

#DodlaDairy

పశువులు తినే తౌడు తో ప్రియా గోల్డ్ బిస్కెట్లు తయారు చేస్తున్నట్లు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిర్ధారించింది. దొడ్ల డెయిరీ కి చెందిన పాల నమూనాలో నాణ్యతా లోపాలతో పాటు ప్రమాదకర పదార్థాలు ఉన్నట్లు కూడా నిర్ధారణ అయింది. యుయిర్‌ ఆర్గానిక్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ విక్రయించిన పసుపు ఎండు ద్రాక్ష నమూనాల్లోనూ ప్రమాదకర అవశేషాలను గుర్తించారు.

ఈ మూడు సంస్థలతో పాటు మరికొన్ని ఆహార వ్యాపార సంస్థలపైనా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ దృష్టి సారించింది. నిల్వల నిర్వహణ, పరిశుభ్రత, పారిశుద్ధ్య నిబంధనలను పాటించనందుకు సన్‌ రిడ్జెస్‌ హెల్త్‌ కేర్స్‌, నర్పధమ్‌ ఫుడ్స్‌ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తనిఖీల సమయంలో లైసెన్సు పొందిన ప్రాంగణం మూసివేసి ఉండటంతో పాటు వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన వివరాలపై స్పష్టత కోరుతూ షా కాంతిలాల్‌ అండ్‌ జయంతిలాల్‌ సంస్థకు కూడా నోటీసు ఇచ్చింది.

గత ఆరు నెలలుగా ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీలు, అమలు చర్యలను మరింత ముమ్మరం చేసింది. ఆహార తయారీ సంస్థలతో పాటు ఆన్‌లైన్‌ వాణిజ్య వేదికల ద్వారా విక్రయించే ఉత్పత్తులపైనా పర్యవేక్షణ పెంచింది. ప్రజలకు ఆహార భద్రతకు సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తోంది. వినియోగదారులకు సురక్షితమైన ఆహారం అందేలా చూడటం, నాణ్యతా ప్రమాణాలను ఉల్లంఘించే సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగుతున్నాయి.

సూర్య ఫుడ్‌ అండ్‌ ఆగ్రో, దొడ్లా డెయిరీ లిమిటెడ్‌, యుయిర్‌ ఆర్గానిక్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లపై ఆహార భద్రతా చట్టం కింద అభియోగాల నమోదు, ప్రాసిక్యూషన్‌ ప్రక్రియకు అనుమతి ఇచ్చినట్లు సంస్థ వెల్లడించింది. వినియోగదారుడి నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా సూర్య ఫుడ్‌ అండ్‌ ఆగ్రో సంస్థ తయారీ కేంద్రంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రియాగోల్డ్‌ బిస్కెట్ల తయారీలో పీచు పదార్థానికి మూలంగా పశువుల దాణా కోసం ఉద్దేశించిన తవుడును ముడి పదార్థంగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఆ తవుడు ఉన్న గోనె సంచులపై కూడా అది పశువుల దాణా కోసమేనని సూచించే గుర్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మనుషుల ఆహార తయారీలో ఉపయోగించడానికి ఉద్దేశించని పదార్థాన్ని బిస్కెట్ల తయారీలో వినియోగించడం తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనగా పరిగణించారు.

బిస్కెట్ల తయారీలో తవుడు వినియోగంతో పాటు ఆ సంస్థ తయారీ కేంద్రంలో పరిశుభ్రత, క్రిమికీటకాల నియంత్రణ, ముడి పదార్థాల నిల్వ, వివిధ పదార్థాలను వేరుగా ఉంచడం, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత, ప్రాంగణ నిర్వహణ, తయారీ మధ్యంతర దశల్లోని పదార్థాల నిర్వహణలోనూ లోపాలను గుర్తించారు. గతంలోనే ఈ ఉల్లంఘనల కారణంగా సూర్య ఫుడ్‌ అండ్‌ ఆగ్రో సంస్థ లైసెన్సును ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా సంస్థపై న్యాయపరమైన చర్యలను ప్రారంభించింది.

మరోవైపు దొడ్ల డెయిరీ లిమిటెడ్‌కు చెందిన పూర్తి కొవ్వు శాతం కలిగిన పాల నమూనా పరీక్షల్లోనూ తీవ్రమైన లోపాలు బయటపడ్డాయి. సంస్థకు చెందిన పాల నమూనాను సేకరించి పరీక్షించగా, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పాలలో కొవ్వు శాతం లేదని తొలుత ఆహార విశ్లేషకులు నిర్ధారించారు. దీనిపై సంస్థ అప్పీల్‌ చేయడంతో నమూనాను ఉన్నతస్థాయి సూచన ప్రయోగశాలకు పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో పాలలో డిటర్జెంట్‌ లేదా కాస్టిక్‌ సోడా వంటి పదార్థాలు ఉన్నట్లు, అదే సమయంలో పాలలో కొవ్వు శాతం కనీస నిర్దేశిత స్థాయి కంటే తక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెల్లడించింది.

ఈ పాలు సురక్షితం కాని ఆహారంగా, నాణ్యతా ప్రమాణాలకు తగని ఉత్పత్తిగా పరిగణనలోకి తీసుకున్నారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 కింద ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించి, దొడ్ల డెయిరీతో పాటు ఉత్పత్తి తయారీ, విక్రయాలకు సంబంధం ఉన్న ఇతర ఆహార వ్యాపార సంస్థలపై కూడా ప్రాసిక్యూషన్‌ చర్యలకు సంబంధిత అధికార యంత్రాంగం అనుమతిచ్చింది.

యుయిర్‌ ఆర్గానిక్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ విక్రయించిన పసుపు ఎండు ద్రాక్ష నమూనాల్లోనూ ప్రమాదకర అవశేషాలను గుర్తించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సేకరించిన నమూనాలను పరీక్షించిన ఆహార విశ్లేషకులు, అందులో పురుగుమందుల అవశేషాలు నిర్దేశిత గరిష్ఠ పరిమితులను మించిపోయినట్లు ప్రకటించారు. సంస్థ అప్పీల్‌ చేసిన అనంతరం నమూనాను సూచన ప్రయోగశాలకు పంపించగా, థియామెథాక్సామ్‌ (Thiamethoxam), ఫ్లూఓపైరామ్‌ (Fluopyram) సంబంధిత జీవక్రియ అవశేషాలు అనుమతించిన పరిమితులకు మించి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆహార భద్రతా చట్టంలోని నిబంధనల ప్రకారం సంస్థపై ప్రాసిక్యూషన్‌ ప్రారంభించేందుకు సమర్థ అధికారి అనుమతి మంజూరు చేశారు.

Related posts

బీహార్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15 ఎకరాల భూమి కేటాయింపు

Satyam News

ఆశ్చర్యకరంగా శుభ్‌మన్ గిల్‌ కు ఉద్వాసన

Satyam News

ఇంకొద్ది సేపటిలో 4రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

Satyam News

వైద్యుల నిర్లక్ష్యంతోనే మా బిడ్డ మృతి

Satyam News

ఎన్నిక ఏదైనా కాంగ్రెస్‌దే విజయం

Satyam News

తీవ్రమౌతున్న ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం

Satyam News

Leave a Comment