ఉత్తర భారత దేశాన్ని ఒకానొక సమయంలో ఆధ్మాత్మిక ప్రవచనాలతో ఊపేసిన డేరా సచ్చా సౌదా (DSS) అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గుర్తున్నాడా? రామ్ రహీమ్ సింగ్ అత్యాచారం, హత్య కేసులలో నేరస్తుడుగా నిర్ధారణ అయి జైలు జీవితం అనుభవిస్తున్న విషయం కూడా గుర్తుండే ఉంటుంది.
ఇప్పుడు ఆ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను హత్య కేసులో నిర్దోషిగా పంజాబ్, హర్యానా హైకోర్టు నేడు ప్రకటించింది. డేరా సచ్చా సౌదా పేరుతో పంజాబ్, హర్యానా రాష్ట్రాలనే కాకుండా ఉత్తర భారత దేశం మొత్తం తన ప్రభావాన్ని విస్తరించుకుని చివరకు జైలు జీవితం గడుపుతున్న రామ్ రహీమ్ సింగ్ పై కేసు కొట్టేయడం సంచలనం కలిగించింది.
వివరాల్లోకి వెళితే… రామ్ చందర్ ఛత్రపతి అనే జర్నలిస్టు హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సుమారు ఏడు సంవత్సరాల క్రితం చండీగఢ్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును ఆయన హైకోర్టులో అప్పీల్ చేశారు. ఆ అప్పీల్‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, న్యాయమూర్తి విక్రమ్ అగర్వాల్ ధర్మాసనం ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.
అదే సమయంలో ఈ కేసులో ఉన్న మరో ఇద్దరు నిందితుల అప్పీళ్లు మాత్రం కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో పూర్తి తీర్పు ప్రతులు ఇంకా విడుదల కాలేదు. అయితే విచారణ సమయంలో బుల్లెట్‌కు సంబంధించిన సాక్ష్యాలపై తీవ్ర వివాదం నెలకొంది.
ముఖ్యంగా హత్యలో ఉపయోగించారని చెప్పిన “లపువా” సాఫ్ట్ లీడ్ బుల్లెట్‌ను ధర్మాసనం స్వయంగా పరిశీలించింది. పోస్ట్‌మార్టం సమయంలో ఛత్రపతి శరీరం నుంచి తీసిన బుల్లెట్‌ను ప్లాస్టిక్ కంటైనర్‌లో పెట్టి సీల్ చేసినట్లు రికార్డుల్లో ఉంది. ఆ కంటైనర్‌పై All India Institute of Medical Sciences (AIIMS) సీల్స్ సరిగ్గా ఉన్నాయని డిఫెన్స్ లాయర్ పేర్కొన్నారు.
సీల్స్ చెదరగొట్టకుండా ఉంటే, బుల్లెట్‌ను ముందుగా ఫోరెన్సిక్ నిపుణుడు ఎలా పరీక్షించాడన్న సందేహాన్ని వారు కోర్టు ముందు ఉంచారు. దీనికి ప్రతిగా ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు, ఫోరెన్సిక్ నిపుణుడు కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో తాను కంటైనర్‌ను తెరిచి పరీక్షించానని స్పష్టంగా చెప్పాడని తెలిపారు. బుల్లెట్‌పై గుర్తులు ఉండటం, సంతకాలు ఉండటం అన్నీ రికార్డుల్లో ఉన్నాయని వాదించారు.
డిఫెన్సు సీనియర్ న్యాయవాదులు ఆర్. బసంత్, ఆర్‌ఎస్ రాయ్‌లు సీల్స్ సమగ్రతను ప్రధాన అంశంగా తీసుకుని వాదనలు వినిపించారు. కంటైనర్‌పై రెండు AIIMS సీల్స్ సరిగ్గా ఉండగా అందులోని వస్తువులను ఎవరూ ముందుగా తాకలేరని వారు పేర్కొన్నారు. విచారణ సమయంలో ధర్మాసనం “బుల్లెట్‌పై ఎలాంటి గుర్తులు కనిపించడం లేదు” అని వ్యాఖ్యానిస్తూ, ఫోరెన్సిక్ నిపుణుడు చెప్పిన సంతకం బుల్లెట్‌పై ఉందా లేక కంటైనర్‌పైనా ఉందా అనే విషయంపై స్పష్టత కోరింది.
దీనికి సమాధానంగా కంటైనర్‌పై మాత్రం సంతకాలు ఉన్నాయని, కానీ బుల్లెట్ సాఫ్ట్ లీడ్‌తో తయారైనది కావడంతో కాలక్రమేణా గుర్తులు కనిపించకపోవచ్చని న్యాయవాదులు తెలిపారు. దాదాపు 23 సంవత్సరాల తరువాత ఈ కేసులో బుల్లెట్‌పై గుర్తులు కనిపించకపోవడం కూడా విచారణలో కీలక అంశంగా మారింది.
చివరకు అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగా హైకోర్టు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను ఈ హత్య కేసులో నిర్దోషిగా ప్రకటించింది. అయితే అత్యాచార కేసులో ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నందున ఆయన జైలులోనే కొనసాగనున్నారు.
