మెదక్హోమ్

ఆదర్శ నియోజకవర్గంగా హుస్నాబాద్‌

#Husnabad

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి  వివేక్ వెంకటస్వామితో కలిసి పాల్గొన్నారు.

జనగామ గ్రామంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమం, తోటపల్లి గ్రామంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణానికి భూమిపూజ, టామ్‌కాం ఆధ్వర్యంలో మెగా విదేశీ ఉద్యోగ మేళా, ఉమ్మాపూర్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హుస్నాబాద్ ప్రాంత రైతుల ఆదాయం పెంచేందుకు ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 14 వేల ఎకరాలకు పైగా సాగు జరుగుతోందన్నారు.

5 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నందున రైతులు ఆయిల్ పామ్ వంటి దీర్ఘకాలిక, లాభదాయక పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు.

ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వ సబ్సిడీ

ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేల వరకు సబ్సిడీ అందిస్తోందని, నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలు సాగు చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. నర్మేటలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ అందుబాటులో ఉండటంతో రైతులకు మార్కెటింగ్ సమస్య ఉండదని వివరించారు.

గ్రామాలకు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించే  ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి ప్రకటించారు. చిన్న గ్రామాల్లో 100 ఎకరాలకు పైగా, పెద్ద గ్రామాల్లో 200 ఎకరాలకు పైగా ఆయిల్ పామ్ సాగు జరిగితే వరుసగా రూ.5 లక్షలు, రూ.10 లక్షల అభివృద్ధి ప్రోత్సాహక నిధులు అందజేస్తామని తెలిపారు.

హుస్నాబాద్ లో అడ్వాన్స్‌డ్  టెక్నాలజీ సెంటర్

హుస్నాబాద్‌లో రూ.45.15 కోట్ల వ్యయంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణం ప్రారంభించడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి పేర్కొన్నారు. టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం ద్వారా యువతకు రోబోటిక్స్, 3డీ ప్రింటింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), ప్రొడక్ట్ డిజైన్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో శిక్షణ అందుతుందని తెలిపారు.

ఒక్కో శిక్షణార్థికి నెలకు రూ.2 వేల స్టైపెండ్ కూడా ప్రభుత్వం అందిస్తోందన్నారు. హుస్నాబాద్‌ను వెనుకబడిన ప్రాంతంగా కాకుండా విద్య, వైద్యం, పర్యాటకం, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. 250 పడకల ఆసుపత్రి, పీజీ మెడికల్ కాలేజీ, నాలుగు లైన్ల రహదారి, అర్బన్ ఫారెస్ట్ పార్క్, ఎల్లమ్మ చెరువు పర్యాటక అభివృద్ధి, ఇండస్ట్రియల్ పార్క్ వంటి అనేక ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు.

టామ్‌కాం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా విదేశీ ఉద్యోగ మేళాకు సుమారు 1,500 మంది నిరుద్యోగ యువత నమోదు చేసుకోవడం సంతోషకరమని మంత్రి అన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తూ, స్థానిక యువత ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

జర్మనీ సహా పలు దేశాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, హుస్నాబాద్‌లో జర్మన్ భాషా శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. జర్మన్ భాష నేర్చుకునే యువతకు వ్యక్తిగతంగా నెలకు రూ.1,000 స్టైపెండ్ అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

స్వయం ఉపాధి వైపు యువత

వ్యవసాయ పనిముట్ల తయారీ, ఎంఎస్‌ఎంఈ రంగాల్లో కూడా ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందించి యువతను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు. హుస్నాబాద్‌లో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.

ఉమ్మాపూర్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల శాశ్వత భవనాల నిర్మాణానికి భూమిపూజ చేయడం ఆనందదాయకమని మంత్రి అన్నారు. ఏడాది వ్యవధిలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల హాస్టల్ నిర్మాణానికి రూ.15 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని, త్వరలోనే శంకుస్థాపన నిర్వహిస్తామని తెలిపారు.

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హుస్నాబాద్ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల, లా కళాశాల, ఫార్మసీ కళాశాల వంటి విద్యాసంస్థలు మంజూరు చేశామని, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, సైకిళ్లు వంటి సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన ఉన్నత విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు.

గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి రూ.220 కోట్లు

గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి ప్రభుత్వం రూ.220 కోట్లు కేటాయించిందని, రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు, యువత, విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేసే దిశగా అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం చేస్తామని మంత్రి తెలిపారు.

మంత్రి వివేక్ వెంకట్ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంటూ, టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో రూ.4 వేల కోట్లకు పైగా వ్యయంతో 119 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కేంద్రాల్లో రోబోటిక్స్, 3డీ ప్రింటింగ్, ఈవీ మెయింటెనెన్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, డిజిటల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ వంటి ఆధునిక కోర్సుల్లో శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ATCలలో శిక్షణ పొందే ప్రతి విద్యార్థికి నెలకు రూ.2 వేల స్టైపెండ్ అందిస్తున్నామని తెలిపారు.

అలాగే జర్మన్ భాష నేర్చుకునే యువతకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తూ విదేశీ ఉపాధికి సిద్ధం చేస్తున్నామని చెప్పారు.టామ్‌కాం ద్వారా రాష్ట్ర యువతకు దేశ, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం రూ.90 కోట్ల బడ్జెట్ కేటాయించిందని తెలిపారు.

విదేశాల్లో ఉద్యోగాలు అందిపుచ్చుకోవాలి

విదేశాల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, యువత నైపుణ్యాలు, భాషా పరిజ్ఞానం పెంపొందించుకుని ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందన్నారు.

నాణ్యమైన విద్య అందించేందుకు కృషి

హుస్నాబాద్‌లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కావడం ఈ ప్రాంత విద్యార్థులకు గొప్ప అవకాశమని పేర్కొన్నారు. కళాశాల హాస్టల్ నిర్మాణం, ఆధునిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

హుస్నాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని, ఇక్కడి నుంచి శిక్షణ పొందిన యువత ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు సాధించాలని మంత్రి వివేక్ వెంకట్ స్వామి ఆకాంక్షించారు.

కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి,ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్ క్రాంతి వెస్లీ ,సిపి రష్మీ పెరుమాళ్,ఆడిషన్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ,మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్ బంక చందు , కౌన్సిలర్ లు ,సర్పంచ్ లు ముఖ్య నేతలు,అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా శ్రీ శేషదాసుల ఆరాధన రథోత్సవం

Satyam News

కాక్రోచ్ లకు ఇంత డబ్బు ఎలా వచ్చింది?

Satyam News

ఉత్సాహంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సమావేశం

Satyam News

ఇరాన్ తో చర్చలు విఫలం: వెనుతిరిగిన వాన్స్

Satyam News

ఏపీలో మూడు జిల్లాలకు రెడ్ అలెర్ట్

Satyam News

శ్రీ కనక దుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర సమర్పణ

Satyam News

Leave a Comment