పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ను చూసేందుకు అనుమతించని అదియాలా జైలు సూపరింటెండెంట్ పై ఆయన సోదరి అలీమా ఖాన్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఇమ్రాన్ ఖాన్‌ను వారంలో రెండు సార్లు కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కలిసి మాట్లాడేందుకు అనుమతించాలన్న హైకోర్టు ఆదేశాలు పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు.
అదియాలా జైలు వద్ద దిగ్బంధం చేపట్టిన తర్వాత ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు కూడా గతంలో అనేక సార్లు నిరసనలు నిర్వహించినప్పటికీ, జైలు అధికారులు సమావేశాలకు అనుమతించలేదని ఆరోపించారు. ఇమ్రాన్ ఆరోగ్యం, హక్కులు, మానవీయ పరిస్థితుల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ అలీమా కోర్టును ఆశ్రయించారు.
మార్చి 24న హైకోర్టు ఇచ్చిన తీర్పులో వారానికి రెండు సార్లు భేటీలకు అనుమతించాలన్న ఆదేశాలను అధికారులు అమలు చేయలేదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. మార్చి 28, 2024న రూపొందించిన ఎస్‌ఓపీల ప్రకారం మంగళ, గురువారాల్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, మిత్రులు కలిసేందుకు అనుమతించాల్సి ఉన్నప్పటికీ, అధికారులు వాటిని అమలు చేయలేదని ఆమె వివరించారు.
దాంతో జైలు సూపరింటెండెంట్ అబ్దుల్ గఫూర్ అంజుమ్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజా ఐజాజ్ అజీమ్, కేంద్ర గృహ కార్యదర్శి ఖుర్రం ఆఘా, పంజాబ్ హోమ్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శి నూరుల్ అమీన్‌లను కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. అయితే నవంబర్ 11, 2024న పిటిఐ నేతలు జైలుకు వెళ్లినప్పుడు, గంటల తరబడి వేచిచూపించి, తరువాత అక్రమంగా అదుపులోకి తీసుకున్నట్లు పిటిషన్‌లో ఆరోపించారు.
కోర్డు ఆదేశాలను ధిక్కరిస్తున్న జైలు అధికారులు
కోర్టు ఆదేశాలను కావాలనే ఉల్లంఘించడం, హైకోర్టు ప్రతిష్ఠను దెబ్బతీయడం వంటి చర్యలకు వారు పాల్పడ్డారని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను అమలు చేయాలని, ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని అలీమా కోరారు. శుక్రవారం ఉదయం అలీమా, సీఎం ఆఫ్రిది హైకోర్టుకు వెళ్లి ప్రధాన న్యాయమూర్తిని కలిసేందుకు ప్రయత్నించారు.
కానీ కలవడానికి నిరాకరించారని ఆఫ్రిది మీడియాకు తెలిపారు. అక్టోబర్ 27 నుంచి ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీని ఎవరూ చూడలేదని, ఆయన ఆరోగ్యం గురించి ఏ సమాచారం లేదని ఆఫ్రిది ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ సోదరీమణుల పట్ల నవంబర్ 19న పోలీసులు దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలను కూడా ఆయన గుర్తుచేశారు.
ఇమ్రాన్‌ను రెండుమూడు నిమిషాలైనా కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా అధికారులు తిరస్కరించారని ఆఫ్రిది చెప్పారు. పిటిఐపై వివక్ష చూపుతున్నారని, పార్టీ నాయకత్వాన్ని మూలకు తోస్తున్నారని ఆరోపించారు. పరిస్థితి మరింత దిగజారితే ఇరువైపులా నియంత్రించలేని పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు.
పార్లమెంట్ సమావేశాలకు అడ్డుపడతామని కూడా ప్రకటించారు. ఇక కేంద్ర సమాచార మంత్రి అతౌల్లా తారర్ మాత్రం పిటిఐ అక్రమ డిమాండ్‌కు కట్టుబడి పరిపాలనను పక్కనపెడుతోందని విమర్శించారు. జైలు శిక్ష అనుభవిస్తున్న నేత నుండి రాజకీయ మార్గదర్శనం పొందడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. పిటిఐపై విదేశీ వేదికల ద్వారా పాక్ ప్రతిష్ఠ దెబ్బతీసే ప్రచారాలు చేసినట్లు కూడా ఆరోపించారు.
ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు…
ఇమ్రాన్ కుటుంబం, పిటిఐ నేతలు జైలు అధికారులు కావాలనే సమావేశాలను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి ఆఫ్రిది అక్టోబర్ 15న పదవీ స్వీకారం తరువాత ఎనిమిదోసారి కూడా ఇమ్రాన్‌ను కలిసే అవకాశాన్ని కోల్పోయారు.
నవంబర్ 25న కూడా గంటలకొద్దీ సాగిన నిరసన అనంతరం ఆందోళన నిలిపివేశారు. ఇంతలో ఇమ్రాన్ ఆరోగ్యం విషయంలో పిటిఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నవంబర్ 4 తరువాత ఆయనను ఎవరూ చూడలేదని జుల్ఫి బుఖారి పేర్కొన్నారు. జైలు అధికారులు మాత్రం ఇమ్రాన్ ఆరోగ్యంగా ఉన్నారని, ఇతర జైలుకు మార్చే ప్రణాళికలేదని తెలిపారు.
సోషల్ మీడియాలో ‘Where is Imran Khan?’ హ్యాష్‌టాగ్ ట్రెండింగ్ అయిన నేపథ్యంలో బీబీసీ, నిక్కై వంటి అంతర్జాతీయ మీడియా కూడా ఇమ్రాన్ పరిస్థితిపై కథనాలు ప్రసారం చేశాయి. అయితే ప్రధానమంత్రి రాజకీయ వ్యవహారాల సలహాదారు రానా సనౌల్లా, పిటిఐ ఉన్నత నేతలు ఇద్దరూ ఇమ్రాన్ ఆరోగ్యం బాగానే ఉందని, ఎటువంటి సమస్యలేదని స్పష్టం చేశారు.
