టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా తిరుమలను టూరిజం కేంద్రంగా మార్చేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. తిరుమల లో ఉన్న కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కర్ణాటక ప్రవాస సౌదా పేరిట ఉన్న ఆధునిక భవనాలన్నింటినీ నిర్వహించేందుకుగాను కర్ణాటక టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విభాగానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. దీంతో ఇకపై శ్రీవారి ఆలయానికి వెనుక వైపు ఆనంద నిలయానికి అతి సమీపంలో ఉన్న ఈ కర్ణాటక భవనాలన్నింటిలోనూ భక్తులు కాకుండా విహారయాత్రకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో గత రెండు రోజులుగా తిరుమలలో ఉన్న కర్ణాటక ప్రవాస సౌధ నిర్వహణ పనులను టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అప్పగించేందుకు అసెంబ్లీలో ప్రతిపాదన ను ప్రవేశపెట్టినట్టు స్వయంగా కర్ణాటక రాష్ట్ర కర్ణాటక ప్రిన్సిపల్ సెక్రటరీ.రాజేంద్ర కుమార్ కటారియా ప్రకటించారు.
ఇప్పటివరకు తిరుమల లో ఉన్న కర్ణాటక ప్రవాస సౌద భవనాలను ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కర్ణాటక ప్రభుత్వం నిర్వహిస్తూ వచ్చింది. సిబ్బంది కొరత ప్రభుత్వం స్వయంగా నిర్వహించలేకపోవడం కారణంగా ఆ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అప్పగిస్తూ తాజాగా చర్యలు తీసుకున్నారు.
పవిత్రమైన శ్రీవారి ఆలయానికి వెనుక వైపు కర్ణాటక ప్రవాస సౌధ భవనాలు నిర్మించబడ్డాయి. దశాబ్దాల తరబడి నుండి కొనసాగుతున్న ఈ స్థలంలో ఇటీవలే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆధునికమైన వసతులతో భవనాలను నిర్మించింది. మూడు బ్లాకులు పూర్తి చేసుకున్న ఈ స్థలంలో ఇప్పుడు వీఐపీల కోసం నాలుగో బ్లాకు నిర్మాణం ప్రారంభించింది.
దాదాపు 350 గదులు తో మూడు బ్లాకులను పూర్తి చేసిన అధికారులు అందులోనే అత్యంత ఖరీదైన కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించుకున్నారు. కళ్యాణ మండపం రెంట్ కూడా నాలుగు లక్షలకు పై గానే నిర్ధారించారు. గదులు కూడా భక్తులకు అందుబాటులో లేని ఎక్కువ ధరలతో పక్కా వ్యాపార సామ్రాజ్యాన్ని తిరుమల కొండపై అది కూడా శ్రీవారి ఆలయానికి అత్యంత సమీపంలో ఏర్పాటు చేసుకున్నారు.
తిరుమల శ్రీవారికి మైసూర్ మహారాజా అందించిన కానుకలతో కర్ణాటక రాష్ట్ర ప్రజలతో తిరుమలకు ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ ఇక్కడ వెలకట్టలేని కోట్లాది విలువైన స్థలాలను కర్ణాటకకు టీటీడీ నామమాత్రపు విలువతో లీజు పద్ధతిలో స్థలాలను కర్ణాటక ప్రభుత్వానికి కొనసాగిస్తోంది.
ఈ స్థలాలను టిటిడి అనుమతి లేకుండా కర్ణాటక రాష్ట్రం కూడా లీజుకు ఇవ్వడం లేదా ఇతర విభాగాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించడం చేయడం నిబంధనలకు విరుద్ధం.
ఆధ్యాత్మిక భావన తప్ప భక్తుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనందం కాలక్షేపం ఊహించరాదని, అసలు విహార కేంద్రంగా తిరుమలను చూడరాదని భక్తి పారవశ్యంలో మాత్రమే యాత్రికులు ఉండాలని, తిరుమల క్షేత్రంలో వాతావరణ పరిస్థితులు కూడా అందుకు అనుగుణంగానే ఉండేలా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంది.
తిరుమలను ఎట్టి పరిస్థితుల్లోనూ టూరిజం కేంద్రంగా విహార కేంద్రంగా భావించరాదని ఈ మేరకే గతంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, తో సహా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయిస్తున్న దర్శన టికెట్ల కోటా కూడా ఈ పాలక మండలి పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయించింది.
అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహా మిగిలిన కొన్ని ఇతర రాష్ట్రాలు కూడా తిరుమలలో తమకు స్థలాలను కేటాయిస్తే అతిధి భవనాలను నిర్మించుకుంటామని తమ రాష్ట్రం వైపు నుంచి వచ్చే అతిధుల కోసం వాటిని వినియోగించుకుంటామని అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమల లో ఇలాంటి పరిస్థితి ఉండకూడదు అని టిటిడి పాలకమండలి తిరస్కరించింది.
ఈ నేపథ్యంలో తిరుమల పవిత్రత కోసం ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ రాజకీయ ఒత్తిడులను సైతం పట్టించుకోకుండా తిరుమల పవిత్రతను కాపాడమే లక్ష్యంగా టిటిడి పాలక మండలి పనిచేస్తోంది. అయితే తాజాగా రెండు రోజులుగా సాగుతున్న కర్ణాటక అసెంబ్లీ సమావేశాలలో కొండపై ఉన్న కర్ణాటక ఆస్తులను ఏకంగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కు కట్టబెట్టాలని చూస్తుండడంపై టిటిడి పాలక మండలి ఎందుకు మౌనం వహిస్తోంది అనే అనుమానాలు కలుగుతున్నాయి.
