ప్రత్యేకంహోమ్

ఇరాన్ యుద్ధ ప్రభావంతో భారత్ అతలాకుతలం?

#UnitedNations

గల్ఫ్ యుద్ధ ప్రభావం భారత్ పై తీవ్ర స్థాయిలో ఉండబోతున్నట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. United Nations Development Programme విడుదల చేసిన “Military Escalation In The Middle East: Human Development Impacts Across Asia And The Pacific” నివేదిక ప్రకారం, ఈ పరిస్థితుల కారణంగా భారత్‌లో సుమారు 25 లక్షల మంది పేదరికంలోకి జారే ప్రమాదం ఉందని పేర్కొంది.

మొత్తం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సుమారు 8.8 మిలియన్ మంది పేదరికంలోకి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల గృహాల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. దీంతో ఆహార భద్రతపై ఒత్తిడి పెరుగుతుండగా ప్రభుత్వ ఖజానాలపై భారమూ అధికమవుతోంది.

భారత్‌లో పేదరిక శాతం 23.9 శాతం నుంచి 24.2 శాతానికి పెరిగే అవకాశం ఉందని, దాదాపు 24.6 లక్షల మంది కొత్తగా పేదరికంలోకి చేరవచ్చని నివేదిక స్పష్టం చేసింది. సంక్షోభం తర్వాత దేశంలో పేదల సంఖ్య 35.4 కోట్లకు చేరవచ్చని అంచనా.

అభివృద్ధి గతి తప్పుతున్న పలు దేశాలు

మానవ అభివృద్ధి సూచిక (HDI) పరంగా కూడా ప్రభావం ఉండనుందని నివేదిక వెల్లడించింది. భారత్‌లో సుమారు 0.03 శాతం లేదా 0.12 సంవత్సరాల అభివృద్ధి వెనుకబడే అవకాశం ఉందని అంచనా. ఇదే సమయంలో ఇరాన్ వంటి దేశాలు ఒకటిన్నర సంవత్సరాల అభివృద్ధిని కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది.

భారత్ ఇంధన అవసరాల్లో 90 శాతం కంటే ఎక్కువ దిగుమతులపై ఆధారపడుతోంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియా నుంచి 40 శాతం క్రూడ్ ఆయిల్, 90 శాతం ఎల్పీజీ వస్తున్నాయి. అదనంగా ఎరువుల దిగుమతుల్లో 45 శాతం వాటా కూడా ఈ ప్రాంతానిదే. యూరియా ఉత్పత్తికి అవసరమైన గ్యాస్‌లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ పరిస్థితుల్లో ఘర్షణల ప్రభావం ఇంధన రంగంపై తీవ్రంగా పడుతోంది.

ఎల్‌ఎన్‌జీ ధరలు పెరగడంతో భారత్ సహా పలు దేశాలు మళ్లీ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడుతున్నాయి. వాణిజ్య పరంగా కూడా ప్రభావం గణనీయంగా ఉంది. భారత్ ఎగుమతుల్లో 14 శాతం, దిగుమతుల్లో 20.9 శాతం పశ్చిమ ఆసియా మార్కెట్లతో సంబంధం కలిగి ఉంది. బాస్మతి బియ్యం, టీ, రత్నాలు, ఆభరణాలు, వస్త్రాల ఎగుమతులు ప్రభావితమయ్యే అవకాశముంది.

రవాణా ఖర్చులు, బీమా ప్రీమియాలు పెరగడం, మార్గ మార్పులు, సరుకు ఆలస్యం వంటి అంశాలు సరఫరా గొలుసులను దెబ్బతీస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో పాటు భారత్ నుంచి వెళ్లే సరుకులు కూడా నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

ఆహార భద్రతపై పెను ప్రభావం

ఆహార భద్రతపై కూడా ప్రభావం పడుతోంది. గల్ఫ్ దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు తగ్గితే అక్కడ పనిచేస్తున్న భారతీయుల నుంచి వచ్చే రిమిటెన్సులు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో సుమారు 93.7 లక్షల భారతీయులు నివసిస్తూ దేశానికి వచ్చే రిమిటెన్సుల్లో 38-40 శాతం పంపిస్తున్నారు. ఈ ఆదాయం తగ్గితే గ్రామీణ, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

ఖరీఫ్ పంటల సీజన్‌కు ముందు ఈ పరిస్థితులు రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం యూరియా నిల్వలు 6.114 మిలియన్ టన్నులుగా ఉన్నప్పటికీ దీర్ఘకాలిక అంతరాయం ఉంటే వ్యవసాయంపై ప్రభావం తప్పదని నివేదిక హెచ్చరించింది.

ఉద్యోగ రంగంలో కూడా ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. హాస్పిటాలిటీ, ఫుడ్ ప్రాసెసింగ్, నిర్మాణ సామగ్రి, స్టీల్, రత్నాలు, వజ్రాల రంగాల్లో వ్యయాలు పెరగడం, ఆర్డర్లు రద్దవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. భారతదేశంలో 90 శాతం ఉద్యోగాలు అసంఘటిత రంగంలో ఉండటంతో కార్మికులు, వలస కార్మికులు ఎక్కువగా ప్రభావితమవుతారు.

అదనంగా వైద్య పరికరాల ముడి సరుకుల ధరలు 50 శాతం వరకు పెరగవచ్చని, ఔషధాల హోల్‌సేల్ ధరలు ఇప్పటికే 10-15 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. అయితే ఈ సంక్షోభం దేశాలకు దీర్ఘకాలికంగా సామాజిక భద్రతా వ్యవస్థలను బలోపేతం చేసుకునే అవకాశం కూడా ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Related posts

శ్రీవారి పరకామణి చోరీ కేసు: పిటిషనర్ శ్రీనివాసులుకు ప్రాణహాని భయం

Satyam News

ప్రొఫెసర్ తో వైసీపీ గేమ్స్…. బ్లూ మీడియాలో ఫేక్‌ స్టోరీ

Satyam News

ఆన్ లైన్ బెట్టింగ్ ల కోసం మర్డర్… దారుణం

Satyam News

సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు పై కేసు నమోదు

Satyam News

సొంత చెల్లి గుర్తు లేదా..?? రాదా…?? జగన్‌..??

Satyam News

ఇరాన్‌పై దాడుల మీద ఇజ్రాయెల్ ప్రకటన

Satyam News

Leave a Comment