జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ కూడా అయిపోయింది. ఫలితం ఎలా వచ్చినా.. ఈ ఎలక్షన్స్‌తో ఒక్క విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చింది. అదేంటంటే.. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. ఆ పార్టీ అధినేత జగన్‌రెడ్డి అస్సలు స్పేస్ లేదు అని తేలిపోయింది. ఈ పోటీలో తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగలేదు. ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు. అయినా ప్రచారం మొత్తం టీడీపీ చుట్టూనే తిరిగింది. మైత్రీవనం కూడలిలో ఎన్డీఆర్ విగ్రహం పెడతానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తన పేరే తారక రామారావు అంటే ఎన్టీఆర్ పేరు తనకు పెట్టారని చెప్పుకున్నారు కేటీఆర్.
టీడీపీ సానుభూతిపరుల ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ పోటీ పడ్డాయి. కానీ వైసీపీ ఓట్ల గురించి ఏ ఒక్క పార్టీ మాట్లాడలేదు. పోటీలో ఉన్న మూడు ప్రధాన పార్టీల్లో ఒక్కరు కూడా జగన్ ఊసెత్తలేదు. ఏపీలో ఐదేళ్ల పాటు జగన్ పాలన ఎలా సాగిందో తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రత్యర్ధులను బూతులు తిట్టడం, మీద కొట్టడం వంటి చర్యలతో వైసీపీ తెలంగాణ ప్రజలకూ అసహ్యం తెప్పించింది. ఇక చంద్రబాబు అరెస్టుతో హైదరాబాద్‌లో ఏపీ సెటిలర్లతో పాటు స్థానిక ప్రజల్లో ఉన్న టీడీపీ సానుభూతిపరుల్లోనూ వైసీపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జగన్ పేరు తీసుకోవడం వల్ల ఏ పార్టీకి పాజిటివ్ వైబ్స్ వచ్చే ఛాన్స్ లేదు.
ఓటు బ్యాంకు లెక్కలు తీసుకున్నా.. తెలంగాణలో జగన్ ప్రభావం అంతంత మాత్రమే అని ప్రధాన పార్టీలు భావించాయి. జగన్ అభిమానుల్లో అత్యధికులు కాంగ్రెస్ మద్దతుదారులే ఉంటారు. తెలంగాణ స్థానిక కాంగ్రెస్ కేడర్‌కి.. జగన్ ఈక్వేషన్స్ కంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపే ముఖ్యం. ఏం చెప్పినా వీళ్లు కాంగ్రెస్‌ను వదిలేసి.. బీఆర్ఎస్‌కు ఓటేసే ఛాన్స్ లేదు. సెటిలర్లలోని జగన్ వీరభిమానుల్లోనూ చాలా మంది బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగానే ఉన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉపందుకోక ముందు తెలంగాణలో సగం మంది టీడీపీలో ఉన్నారు. వీరిలో కాంగ్రెస్‌లో చేరని వాళ్లు.. బీఆర్ఎస్ అంటే గిట్టని వాళ్ల సంఖ్య చాలా పెద్దగానే ఉంటుంది. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి, రేవంత్‌రెడ్డి సీఎం అవ్వానికి ఈ వర్గమే కీలకంగా వ్యవహరించింది. నామ మాత్రంగా ఉన్న జగన్ ఫ్యాన్ బేస్ కోసం వెంపర్లాడితే, భారీ సంఖ్యలో ఉన్న టీడీపీ సానుభూతి పరులు రివర్స్ అవుతారు. అందుకే అటు కేటీఆర్ గానీ, ఇటు రేవంత్‌రెడ్డిగానీ ఎక్కడా జగన్ పేరు కూడా తల్చుకోలేదు.
