రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా.. మంత్రి నారా లోకేశ్ రష్యా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రష్యాలోని సెయింట్‌పీటర్స్ బర్గ్‌లో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిష్టాత్మక ఎకనామిక్ ఫోరమ్ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన లోకేశ్.. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ల్యాండ్ అయిన కొద్ది సేపటికే ఆ ప్రాంతం బాంబుల మోతతో దద్దరిల్లింది.
రష్యా, ఉక్రెయిన్ దేశాలు నాలుగేళ్ల నుంచి భీకర యుద్ధం చేసుకొంటున్నాయి. అంతర్జాతీయంగా రష్యా ప్రతిష్టను దెబ్బతీయడానికి.. సెయింట్‌పీటర్స్ బర్గ్ నగరాన్ని ఉక్రెయిన్ టార్గెట్ చేసింది. 130 దేశాల నుంచి సుమారు 20 వేల ప్రతినిధులు పాల్గొంటున్న సదస్సు లక్ష్యంగా డ్రోన్లు ప్రయోగించింది. నగరంలోని పెట్రోలియం నిల్వ కేంద్రాలు, రష్యన్ నేవల్ బేస్, షిప్‌యార్డులపై ఉక్రెయిన్ డ్రోన్లు బాంబుల వర్షం కురిపించాయి.
ఒకవైపు ఉక్రెయిన్ డ్రోన్లు.. రష్యా కీలక స్థావరాలను పేల్చేస్తున్న సమయంలోనే.. సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో అంతర్జాతీయ ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భారత్ నుంచి ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని సుదీర్గ సముద్ర తీరంలో.. మినీ అణువిద్యుత్ కేంద్రాలు.. న్యూక్లియర్ డీశాలినేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రష్యా అణు విద్యుత్ సంస్థ రోసాటమ్ ప్రతినిధులను ఆహ్వానించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రాకెట్ల తయారీకి మొదట్లో రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్ కాస్పోస్ సాయం చేసింది. ఇప్పుడు ఏపీలో ఇస్రో రాకెట్ లాంఛింగ్ స్టేషన్ శ్రీహరి కోటకు సమీపంలో.. కొత్తగా ఏర్పాటు చేసిన స్పేస్ సిటీలో.. రాకెట్లు, ఉపగ్రహాల నిర్మాణానికి పెట్టుబడులు పెట్టాలని మంత్రి లోకేశ్ ప్రతిపాదించారు. రష్యా అంతరిక్ష రంగానికి ఏపీ స్పేస్ సిటీని లాంచ్ ప్యాడ్‌లా వాడుకోవచ్చని తెలిపారు.
భారత ఏరో స్పేస్, రక్షణ రంగాలను అనుసంధానించేలా.. న్యూక్లియర్ గ్రేడ్ మిశ్రమ లోహాలు, కార్బన్ ఫైబర్ కాంపొనెంట్ తయారీ యూనిట్ నెలకొల్పాలని రష్యా సంస్థలను కోరారు. ఒకవైపు ఉక్రెయిన్ డ్రోన్లు బాంబులతో భీభత్సం సృష్టిస్తున్న సమయంలో.. మంత్రి లోకేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు రష్యా ప్రభుత్వ రంగ సంస్థలతో సంప్రదింపులు జరపడం సాహసమనే చెప్పుకోవాలి.
