మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత ఆస్తి లాగా భావించి కబ్జాలు పెట్టే పుంగనూరు మళ్లీ వార్తలకెక్కింది. పుంగనూరులో నామినేషన్ల ప్రక్రియలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడటం, తెలుగుదేశం పార్టీ నాయకులకు రక్తగాయాలు కావడం తో పుంగనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
ఇదంతా పెద్ద కుట్ర ప్రకారమే జరిగిందని భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్రయాదవ్ తీవ్ర ఆరోపణ చేశారు. నిన్న రాత్రి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గెస్ట్ హౌస్ లోనే కుట్ర జరిగిందని ఆయన తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన దాడులు అత్యంత దురదృష్టకరమని, ఈ అరాచకాలకు పూర్తిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
ఎంతటి పుడింగి అయినా సరే నియోజకవర్గాన్ని తన జాగీరుగా భావిస్తే జనం ఆగ్రహం ముందు నిలబడలేరు. 7 ఏళ్ల క్రితం వరకు పుంగనూరు ఇలా ఉండేది కాదు. ప్రశాంతంగా ఉండేది. కండకావరంతో ఒకప్పటి పులివెందుల కంటే భయంతో పుంగునూరులో తమకు ఎదురులేదని పెద్దిరెడ్డి కుటుంబం మొత్తం విర్రవీగారు. ఇవాళ పుడింగుల పీచం అణచడం మాకు చిటికెలో పని అని వారికి జనం బుద్ధి చెప్పారు.
పుంగనూరులో జరిగిన ఈ ఘటనలు అత్యంత బాధాకరం, ఆందోళనకరం. ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (అక్కడ లేడు), ఆయన కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి మరియు వారి అనుచరులు ఇలా దౌర్జన్యాలకు పాల్పడడం, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం క్షమించరాని నేరం అని పుంగనూరు ప్రజలు అంటున్నారు.
చట్టాన్ని రక్షించాల్సిన ప్రజాప్రతినిథే నామినేషన్ దాఖలు సమయానికంటే ముందే వచ్చి స్వయంగా ఒక అధికారిని భయానికి గురిచేయడం ఆయన నియంతృత్వ పోకడలకు, గూండాగిరీకి పరాకాష్ఠగా నిలిచింది.
మరోవైపు, ఆయనతో పాటు అనుచరులు కూడా చేస్తున్న బెదిరింపుల ముందు విధుల్లో ఉన్న ఆ అధికారులు బిక్కుబిక్కుమంటూ, ఏం చేయాలో పాలుపోక ప్రాణభయంతో వణికిపోయిన నిస్సహాయత చూస్తే గుండె తరుక్కుపోతుంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన ఒక ఎంపీ, ఇలా అధికారులను భయభ్రాంతులకు గురిచేయడం వ్యవస్థ సిగ్గుపడే దుస్థితిని స్పష్టం చేస్తోంది.
నామినేషన్లు స్వీకరించే అధికారిని బెదిరించడమే కాకుండా బయట ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కూడా హతమార్చేందుకు ప్లాన్ చేసినట్లు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. ఫార్ములా వన్ రేసుల లెక్కన, హాలీవుడ్ సినిమాలో క్లైమాక్స్ ఛేజింగ్ సీన్ స్పీడులో జనం మీదకు మిథున్ రెడ్డి కాన్వాయ్ కారు దూసుకెళ్లింది. ఆఖరు నిమిషంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పుకున్నారు కానీ లేకపోతే పెను ప్రమాదం జరిగేది.
వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ స్కార్పియో కారును టీడీపీ వారిపైకి పంపాలని స్వయంగా ఆయనే అరుస్తూ ఆదేశాలు ఇచ్చాడు. కోనేరు దగ్గరి నుండి గవర్నమెంట్ కాలేజీ వరకు ఇదే స్వైరవిహారం. గాయపడ్డా లెక్కచేయలేదు. పదకొండు గంటలకు నామినేషన్ సమయం అయితే, ఈ స్పీడుతో అరగంట ముందే వచ్చి ముందే నామినేషన్ తీసుకోమని లోన ఎన్నికల అధికారి మీద కూడా దౌర్జన్యం చేశారు.
