25.1 C
Hyderabad
September 12, 2026
ప్రత్యేకంహోమ్

ఫారెక్స్ నిల్వల్లో ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరిన భారత్

#ReserveBankOfIndia

భారత ఆర్ధిక వ్యవస్థ శత్రువులు కుళ్లుకునే స్థాయికి చేరుకుంటున్నది. ఫారెక్స్ (విదేశీ మారక ద్రవ్యం) నిల్వల్లో రికార్డు స్థాయిలో పెరుగుదల సాధించింది. రష్యాను దాటి నాలుగో స్థానంకు భారత్ చేరుకున్నది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కల్పించిన రాయితీతో కూడిన కరెన్సీ మార్పిడి సదుపాయానికి భారీగా విదేశీ నిధులు తరలిరావడంతో సెప్టెంబర్‌ 4తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు ఏకంగా 44.9 బిలియన్‌ డాలర్లు పెరిగి రికార్డు స్థాయిలో 785.7 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఒక వారంలో ఇంత భారీగా నిల్వలు పెరగడం ఇదే తొలిసారి.

దీంతో ప్రపంచంలో అత్యధిక విదేశీ మారక నిల్వలు కలిగిన దేశాల జాబితాలో రష్యాను అధిగమించి నాలుగో స్థానానికి చేరుకున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. చైనా, జపాన్‌, స్విట్జర్లాండ్‌ భారత్‌ కంటే ముందున్నాయి. ఆగస్టు 28తో ముగిసిన వారంలో భారత విదేశీ మారక నిల్వలు అప్పటివరకు అత్యధికంగా సుమారు 740 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

రూపాయిపై కొనసాగుతున్న వత్తిడి

ఫారెక్స్ నిల్వలు భారీగా పెరిగినప్పటికీ రూపాయి విలువపై ఒత్తిడి కొనసాగుతోంది. శుక్రవారం వరుసగా నాలుగో సెషన్‌లోనూ రూపాయి క్షీణించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే గురువారం 94.45గా ఉన్న రూపాయి విలువ శుక్రవారం 95.56కు పడిపోయింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడులు పెరగడం రూపాయిపై ఒత్తిడికి కారణమయ్యాయి.

రిజర్వ్‌ బ్యాంక్‌ జోక్యంతో రూపాయి నష్టాలు కొంత మేర తగ్గాయని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియాలో ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 4.79 శాతం తగ్గింది. ఈ నెలలో ఇప్పటివరకు 0.4 శాతం మేర క్షీణించింది.

రిజర్వు బ్యాంకు శుక్రవారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, విదేశీ మారక నిల్వల్లో అత్యధిక భాగం ఉండే విదేశీ కరెన్సీ ఆస్తులు సెప్టెంబర్‌ 4తో ముగిసిన వారంలో 47.5 బిలియన్‌ డాలర్లు పెరిగి 648.17 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. యూరో, పౌండ్‌, యెన్‌ వంటి అమెరికాయేతర కరెన్సీల విలువల్లో చోటుచేసుకునే మార్పుల ప్రభావం కూడా డాలర్లలో లెక్కించే విదేశీ కరెన్సీ ఆస్తుల విలువలో ప్రతిబింబిస్తుంది.

అదే వారంలో బంగారం ధర ఔన్సుకు 4,429 డాలర్లకు 0.56 శాతం తగ్గింది. దీంతో భారత్‌ వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ 2.59 బిలియన్‌ డాలర్లు తగ్గి 113.81 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

ప్రత్యేక కరెన్సీ మార్పిడి కార్యకలాపాల ద్వారా విదేశీ కరెన్సీ నిధుల సమీకరణను ఆర్ బీ ఐ కొనసాగిస్తున్నది. ఆగస్టు 31 నాటికి ఈ ప్రత్యేక మార్పిడి కార్యకలాపాల ద్వారా మొత్తం 136.4 బిలియన్‌ డాలర్ల విదేశీ కరెన్సీ నిధులు సమీకరించినట్లు అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ రెండో వారం వరకు మరిన్ని విదేశీ నిధులు దేశంలోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

విదేశీ కరెన్సీ ఆస్తులు మరింత పెరిగి 655 బిలియన్‌ డాలర్లను కూడా అధిగమించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విదేశీ కరెన్సీ నాన్‌-రెసిడెంట్‌ బ్యాంకు (ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బి) డిపాజిట్ల కోసం ఆర్‌బీఐ కల్పించిన ప్రత్యేక సదుపాయం ఆగస్టు 31తో ముగిసింది. అయితే ఇప్పటికే నిధులు సమకూర్చేందుకు అంగీకరించిన డిపాజిట్లకు సెప్టెంబర్‌ 11 వరకు బ్యాంకులు ఈ మార్పిడి సదుపాయాన్ని వినియోగించుకునే అవకాశం కల్పించారు. బాహ్య వాణిజ్య రుణాలు, విదేశీ కరెన్సీ బాండ్లు మాత్రం డిసెంబర్‌ 31 వరకు ఈ సదుపాయానికి అర్హత కలిగి ఉంటాయి.

Related posts

సమ్మెలో పాల్గొన్న 4 లక్షల మంది గిగ్ వర్కర్లు

Satyam News

ఎర్రచందనం అక్రమ రవాణా సహకరించిన ఆఫీసర్ అరెస్టు

Satyam News

ఆంధ్ర ప్రదేశ్ లో 2 ఫేక్ యూనివర్సిటీలు

Satyam News

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన వనపర్తి ఎస్పీ

Satyam News

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..??

Satyam News

పెంచలయ్య కుటుంబానికి అండగా కోటంరెడ్డి

Satyam News

Leave a Comment