స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రాష్ట్రంలో నేడు మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో పోలింగ్ చురుకుగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో అంటే 3 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో, రెండు నగర పంచాయితీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఈ 92 చోట్ల 11,705 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈరోజు మొత్తం 99,36,014 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. 36,351 మంది పోలీస్ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. అదే విధంగా 671 అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై పోలీసులు నిఘా పెట్టారు. 1,233 సమస్యాత్మక కేంద్రాల్లో పోలీస్ భద్రతతో బాటు డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంది. రేపు అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహిస్తారు. నేడు ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
చెదురుమదురు సంఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం లేదు. అయితే పులివెందులలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. సుమారు 70 మంది వైసీపీ పోలింగ్ ఏజెంట్లతో ఎంపీ అవినాశ్ రెడ్డి ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో అవినాశ్ రెడ్డి, పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీంతో ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఎన్నికల సందర్భంగా పులివెందులలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో తాజా ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
70 మంది వైసీపీ ఏజెంట్లతో ఎంపీ కార్యాలయానికి రావడం.. పోలీసులు ఆయనను అడ్డుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పులివెందులలోని 70 పోలింగ్ బూత్‌లలో వైసీపీ ఏజెంట్లు లేరంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలపైనా టీడీపీ వర్గాలు స్పందించాయి. 70 మంది పోలింగ్ ఏజెంట్లతో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఆర్వో కార్యాలయానికి చేరుకోవడం వల్ల అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకుందని విమర్శించారు. తమ పార్టీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లకు పంపించుకోలేని వైసీపీ నాయకులు, ఆ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించాయి.
ఏజెంట్లను నియమించుకోవడం.. పోలింగ్ కేంద్రాలకు పంపించడం ఆయా పార్టీల బాధ్యత అని పేర్కొన్నాయి. తమ వైఫల్యాలను ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేయకుండా వాస్తవాలను ప్రజలకు వివరించాలని హితవు పలికాయి. పులివెందులలో ఎన్నికలు ప్రశాంతంగా.. పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నాయి. రాజకీయంగా ఎదుర్కోలేక అల్లర్లు, ఆరోపణల ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ తీరును తప్పుబట్టాయి. ఎన్నికల సమయంలో అనవసర ఆరోపణలు, వివాదాలకు తావివ్వకుండా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.
