ఐదు రోజుల పాటు (16.03.2026 నుండి 20.03.2026) నిర్వహింపబడే ఉగాది ఉత్సవాలు (16.03.2026) నేడు శ్రీశైలం లో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమశాస్త్రానుసారం జరిపించబడ్డాయి. ఈ సందర్భంగా శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపారు.
ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా కార్యనిర్వహణాధికారి స్థానాచార్యులు (అధ్యాపక), అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలో స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు.
ఆలయప్రవేశం చేసిన వెంటనే వేదపండితులు వేదపారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించారు. వేదపఠనం అయిన వెంటనే స్థానాచార్యులు ( అధ్యాపక) , అర్చకస్వాములు, వేదపండితులు, లోకక్షేమాన్నికాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు. దీనికే శివసంకల్పం అని పేరు.
ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించ కుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన, ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు సంకల్పపఠనం చేశారు.
గణపతి పూజ
సంకల్పపఠనం తరువాత ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించబడింది. గణపతిపూజ తరువాత పుణ్యాహవచనం జరిపించబడింది. వృద్ధి మరియు అభ్యుదయాల కోసం ఈ పుణ్యహవచనం జరిపించబడుతుంది. సంకల్పపఠనం తరువాత చండీశ్వరపూజ జరిపించబడింది.
ఈ ఉత్సవాలు క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి పర్యవేక్షణలో, శివపరివార దేవతలలో ఒకరైన చండీశ్వరుని నాయకత్వంలో నిర్వహించబడుతాయని చెప్పబడుతోంది. అందుకే యాగశాల ప్రవేశం తరువాత చండీశ్వరునికి ప్రత్యేకంగా పూజాదికాలు జరపించడం సంప్రదాయం.
కంకణ పూజ, కంకణధారణ
చండీశ్వరపూజ తరువాత కంకణాలకు (రక్షాబంధనాలకు) శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపించబడ్డాయి. తరువాత అధికారులు, అర్చకస్వాములు కంకణాలను ధరించారు. కంకణధారణ తరువాత ఋత్విగ్వరణం నిర్వహించబడింది. ఉత్సవాలలో ఆయా వైదిక కార్యక్రమాలు నిర్వహించమని ఋత్విక్కులను ఆహ్వానిస్తూ వారికి దీక్షావస్త్రాలను అందజేసే కార్యక్రమానికే ఋత్విగ్వరణం అని పేరు.
ఋత్విగ్వరణం తరువాత అఖండదీపస్థాపన చేయబడింది. అనంతరం వాస్తుపూజ చేయబడింది. వాస్తు హోమం తరువాత మండపారాధన చేసి ప్రత్యేక కలశస్థాపన చేయబడింది. కలశస్థాపన తరువాత కలశార్చన జరిపించబడింది. తరువాత పంచావరణార్చనలు నిర్వహించబడ్డాయి. అనంతరం లోకకల్యాణం కోసం జపానుష్ఠానాలు జరిపించబడ్డాయి.
ఉత్సవాల మొదటిరోజు సాయంకాలం జరిగే అంకురార్పణకు ఎంతో విశేషముంది. ఈ కార్యక్రమములో ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత పునీత ప్రదేశములోని మట్టిని సేకరించి యాగశాలకు తీసుకువస్తారు. దీనినే “మృత్సంగ్రహణం” అంటారు. తరువాత ఈ మట్టిని తొమ్మిది పాలికలలో (మూకుళ్ళలో) నింపి, దాంట్లో నవధాన్యాలను పోసి, ఆ మట్టిలో మొలకెత్తించే పనిని ప్రారంభిస్తారు.
ఈ అంకురారోపణ కార్యక్రమానికి చంద్రుడు అధిపతి, శుక్లపక్ష చంద్రునివలే పాలికలలోని నవధ్యాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు. పాలికలలో రోజూ నీరు పోసి నవధాన్యాలు పచ్చగా మొలకెత్తేలా చూస్తారు. అలంకారాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టే దీనికి అంకురార్పణ అని పేరు.
ఈ ప్రారంభ పూజా కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, అర్చకస్వాములు, వేదపండితులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఉత్సవాలలో భాగంగానే ఈ సాయంకాలం స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ జరిపించబడుతుంది. ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనసేవపై వేంచేబు చేయించి విశేషంగా అలంకార మండపములో పూజాదికాలు జరిపించబడుతాయి.
తరువాత గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. భృంగివాహనాధీశులైన శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించడం వలన పనులలో ఏకాగ్రత లభిస్తుందని, పాపాలు హరించబడుతాయని చెప్పబడుతోంది.
మహాలక్ష్మీ అలంకారం
ఉత్సవాలలో భాగంగా ఈ రోజు (16.03.2026) శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తికి మహాలక్ష్మీ అలంకారం గ్రామోత్సవం జరుగనున్నాయి. చతుర్భుజాలు గల ఈ దేవిపై రెండు చేతులలో పద్మాలను, క్రింది చేతులలో కుడివైపున అభయ హస్తం, ఎడమ వైపు వరముద్రతో దర్శనం ఇవ్వనున్నారు. మహాలక్ష్మీ స్వరూపాన్ని దర్శించడం వలన శత్రుబాధలు నివారించబడి, సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది.
అదే విధంగా గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంభాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్ర డోలు కుణిత, జాంజ్ పథక్ (కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం, గిరిజన చెంచు నృత్యం తదితర కళారూపాలు గ్రామోత్సవంలో ఏర్పాటు చేయబడ్డాయి.
