ముఖ్యంశాలుహోమ్

కేంద్ర ప్రతినిధి బృందంతో చంద్రబాబు భేటీ

#CBNMeeting

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు కేంద్ర ఉక్కు గనుల శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్  నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో కీలక సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 విధానాలపై సమగ్రంగా చర్చిస్తూ, పరిశ్రమల ఏర్పాటు వేగవంతం చేయడం, అనుమతుల ప్రక్రియను సరళీకరించడం, అనవసర నియంత్రణలను తగ్గించడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 800కు పైగా నిబంధనలను 100లోపు పరిమితం చేయాలని సీఎస్ సహా ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు. పరిశ్రమలకు అవసరమైన పర్మిషన్లు, లైసెన్సులను సింగిల్ డిజిట్‌కు తగ్గించాలని సూచించారు. అయితే ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.

పరిశ్రమలపై అనవసర వేధింపులు లేకుండా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యం ఇవ్వాలని, డబుల్ లైసెన్సింగ్ విధానాలను పూర్తిగా తొలగించాలని సీఎం పేర్కొన్నారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ విషయంలో నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్రానికి అనుగుణమైన నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే అటవీ చట్టాలను వీలైనంతవరకు సరళీకరించాలని కేంద్ర బృందానికి సూచించారు.

డీ-రెగ్యులేషన్ ఫేజ్-2ను మే నెలాఖరులోగా అమల్లోకి తీసుకురావాలని, అందుకు అవసరమైన ఆర్డినెన్సులను తీసుకురావాలని సీఎం ఆదేశించారు. దరఖాస్తు నుంచి అనుమతుల వరకూ మొత్తం ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని సూచించారు. ఫేజ్-2 అమలుతో పరిశ్రమల అనుమతుల ప్రక్రియలో కనీసం 40 శాతం సమయం తగ్గేలా చూడాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్  మాట్లాడుతూ, పరిశ్రమల అనుమతులు, నిబంధనల సడలింపులో కేంద్రం ప్రతిపాదనలకంటే ఆంధ్రప్రదేశ్ ముందుందని అభినందించారు. స్పందించిన సీఎం, రాష్ట్రంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కంటే ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకు ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ను అమలు చేస్తున్నామని వివరించారు.

డీ-రెగ్యులేషన్ ఫేజ్-3పై కూడా చర్చ సాగగా, జూన్ నెల నుంచి దానిపై పని ప్రారంభిస్తామని స్టీల్ సెక్రటరీ తెలిపారు. ఫేజ్-3లో టెక్నాలజీ అనుసంధానం, ఏఐ టూల్స్ వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో డేటా లేక్, రియల్ టైం డేటా, సీఎఫ్ఎంఎస్, అవేర్-2.0, వాట్సాప్ గవర్నెన్స్ వంటి ఆధునిక వ్యవస్థలను ఇప్పటికే వినియోగిస్తున్నామని తెలిపారు.

మొత్తంగా పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించడం, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

Related posts

ఆ క్షణం చనిపోవాలనుకున్నా: నటి హేమ

Satyam News

బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

Satyam News

42 % రిజర్వేషన్ లతో నే స్థానిక సంస్థల ఎన్నికలు

Satyam News

మహిళల అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు

Satyam News

లోకేష్ డ్రీమ్ ప్రాజెక్ట్… గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా ఏపీ

Satyam News

విజయవాడ లో 10 వేల సీసీ కెమెరాలు

Satyam News

Leave a Comment