వైసీపీ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. రాష్ట్రంలో ఏదైనా విషాదం జరిగితే చాలు దానికి రాజకీయం అంటగట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు చేస్తోంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం తొక్కిసలాట ఘటనను సైతం రాజకీయం చేసే ప్రయత్నం చేస్తోంది. ఘటన జరిగిన కాసేపటికే ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ వేసి రాజకీయం మొదలు పెట్టింది.
వైసీపీ ఏమని ట్వీట్ చేసింది
కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట..9 మంది మృతి చెందారని పేర్కొంది. ఇక ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంటగట్టే ప్రయత్నం చేసింది. మీ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది భక్తులు బలి కావాలంటూ చంద్రబాబుపై తన అక్కసును వెళ్లగక్కింది. కనీసం భద్రతా ఏర్పాట్లు కూడా చేయలేదని తన అవగాహన రాహిత్యాన్ని వైసీపీ పార్టీ బయటపెట్టుకుంది.
అంతేకాదు..ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే బ్లూ మీడియా అక్కడ వాలిపోయింది. స్థానికులు సహాయ కార్యక్రమాల్లో బిజీగా ఉంటే వారితో బలవంతంగా ప్రభుత్వంపై బురద జల్లెందుకు ప్రయత్నాలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. కేవలం ఆలయ నిర్వహకుల వైఫల్యమే అని స్థానికులు చెబుతున్నప్పటికీ..పోలీసుల భద్రతా, ప్రభుత్వ వైఫల్యం అంటూ వారిని ప్రశ్నించబోయారు సాక్షి మీడియా రిపోర్టర్. వారితో బలవంతంగా ప్రభుత్వంపై బురద జల్లేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇంతటి విషాదసమయంలో వైసీపీ, ఆ పార్టీ మీడియా వైఖరిని చూసి స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు.
నిజానికి శ్రీకాకుళం కాశీబుగ్గలోని దేవాలయానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఆ ఆలయం ఒకటి ఉందని దేవాదాయ శాఖకు తెలియదు. పూర్తిగా ప్రైవేట్ స్థలంలో ఒడిశాకు చెందిన హరిముకుంద్ పాండా ఈ ఆలయాన్ని నిర్మించారు. 12 ఎకరాల విస్తీర్ణంలో 10 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేసి నిర్మించారు. దాదాపు దశాబ్ధం పాటు కొనసాగిన ఈ ఆలయ నిర్మాణం ఈ ఏడాది జూలైలోనే పూర్తయింది. సాధారణ రోజుల్లో 1000 మందికిపైగా భక్తులు వచ్చేవారు. కార్తీక శనివారం, ఏకాదశి అంటూ ప్రచారం చేయడంతో వేలాది భక్తులు దేవాలయానికి పోటెత్తారు. అంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది.
ఇక, రాష్ట్రంలో ఏ విషాదం, ప్రమాదం జరిగినా ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. ఇటీవల కర్నూలు బస్సు ప్రమాదంలోనూ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేశారు ఆ పార్టీ నేతలు. బెల్టు షాపుల్లో మద్యం అమ్ముతున్నారని సోషల్‌మీడియాలో ఫేక్ వీడియోలు ప్రసారం చేశారు. ఐతే ప్రభుత్వం రంగంలోకి దిగి అసలు విషయాన్ని బయటపెట్టింది. అంతేకాదు, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసింది.
