ఏలూరు జిల్లా కామవరపుకోట మండల జెడ్పీటీసీ అభ్యర్థి గా మాజీ మంత్రి మాగంటి బాబు సతీమణి మాగంటి పద్మవల్లీ దేవి ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయం లో తన నామినేషన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఏలూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్థానానికి ఎన్డీయే కూటమి (టీడీపీ – జనసేన – బీజేపీ) బలపరిచిన అభ్యర్థి గా మాగంటి పద్మవల్లీ దేవి పేరు వినబడుతుంది.
మాగంటి పద్మ వల్లీదేవి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ఏలూరు నగర వీధులన్నీ పచ్చ జెండాలు, కూటమి పతాకాలతో జనసంద్రంగా మారాయి. మాజీ మంత్రి మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) నాయకత్వంలో మాగంటి నిలయం నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు సాగిన భారీ ర్యాలీకి వేలాదిగా కూటమి నాయకులు తరలి వచ్చారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులతో ఏలూరు నగరం కిక్కిరిసిపోయింది.
దారిపొడవునా ప్రజలు పద్మవల్లీ దేవిపై పూలవర్షం కురిపిస్తూ శుభాకాంక్షల తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మాగంటి పద్మవల్లీ దేవి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ ప్రజల నుంచి వెల్లువెత్తిన అపూర్వ ఆదరణ, శుభాకాంక్షలు చూస్తుంటే ఎన్నికల ఫలితం ముందే ఖరారైనట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు.
మూడు తరాల ప్రజాసేవ వారసత్వంతో ప్రజల హృదయాల్లో నిలిచిన మాగంటి కుటుంబానికి కూటమి బలం తోడైందని, పద్మవల్లీ దేవి రికార్డు స్థాయి భారీ మెజారిటీతో విజయం సాధించి ఏలూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠాన్ని అధిష్టించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
