తెలంగాణలో పోలియో నిర్మూలన లక్ష్యంగా సబ్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే (SNID)-2026లో భాగంగా రేపు ఆదివారం 22న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు 18,01,698 మంది చిన్నారులకు రెండు చుక్కల బైవాలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ (bOPV) అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు.
కార్యక్రమ నిర్వహణకు 7428 పోలియో బూత్‌లు, 245 మొబైల్ బృందాలు, 245 ట్రాన్సిట్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. 23, 24 తేదీల్లో ఇంటింటి పర్యటనలు చేపట్టి టీకాలు పొందని చిన్నారులకు టీకాలు వేస్తారు. GHMCతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో 25వ తేదీన కూడా కార్యక్రమం కొనసాగుతుంది. యాచకులు, సంచార జాతులు, వలస కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులు, ఇటుక బట్టీలు, మురికివాడలు, శివారు ప్రాంతాలు, గిరిజన, మత్స్యకార కుటుంబాల చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇందుకు వివిధ ప్రభుత్వ శాఖల సహకారం తీసుకోనున్నారు.
ఈ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు GHMC పరిధిలో వినూత్న ప్రచారానికి వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 1,165 నివాస సముదాయాలు, హై-రైజ్ అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లోని 6,172 డిజిటల్ స్క్రీన్లపై మూడు రోజుల పాటు పోలియో అవగాహన సందేశాలను ప్రదర్శిస్తున్నది. తల్లిదండ్రులు, సంరక్షకులకు నేరుగా సమాచారం చేరవేసి, చిన్నారులకు టీకాలు వేయించేందుకు వారిని ప్రోత్సహించడం ఈ ప్రచారం ప్రధాన ఉద్దేశం.
గత 18 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం పోలియో రహిత రాష్ట్రంగా కొనసాగుతోందని కమిషనర్ తెలిపారు. ఈ స్థితిని నిరంతరం కొనసాగించడంతో పాటు, ఐదేళ్లలోపు వయసున్న ప్రతి చిన్నారికి పోలియో టీకాలు అందించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టిందన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ భాగస్వాములై, తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని గౌరవ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారని తెలిపారు.
