తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న ఆంజనేయ పురం ఆంజనేయ స్వామి దేవాలయంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. కడప–రేణిగుంట జాతీయ రహదారి సమీపంలోని ఆంజనేయపురంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూల్చివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని దేవాదాయ శాఖ అధికారులు స్పష్టం చేశారన్నారు. దేవాలయాన్ని కూల్చివేస్తున్నారంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ, వాస్తవాలను తెలియజేసే ఫోటోలు, సంబంధిత డాక్యుమెంట్లను అధికారులు విడుదల చేశారు.
జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా దేవాలయానికి సంబంధించిన 10 సెంట్ల భూమిని సేకరించాల్సి రావడంతో, దేవాలయాన్ని మరోచోట నిర్మించి, ప్రస్తుత దేవాలయంలోని మూలమూర్తులను అక్కడ ప్రతిష్ఠించేందుకు గత కొన్ని నెలలుగా చర్చలు జరిగాయి. ఈ ప్రక్రియలో గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తులు, అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, అందరి అంగీకారంతో దేవాలయాన్ని మరోచోట ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు.
ఈ నిర్ణయంలో భాగంగా నిన్న అర్చకులు, దేవాలయ అధికారులు శాస్త్రోక్తంగా అవసరమైన పూజా కార్యక్రమాలను నిర్వహించి, మూలమూర్తులను ప్రస్తుత దేవాలయం నుంచి సంప్రదాయబద్ధంగా తరలించారు. అనంతరం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో, పాత దేవాలయానికి సమీపంలో నిర్మించిన నూతన నిర్మాణంలో మూలమూర్తులను తాత్కాలికంగా ప్రతిష్ఠించారన్నారు.
ఇదిలా ఉండగా, జాతీయ రహదారి నిర్మాణం కోసం సేకరించిన దేవాలయ భూమి, దేవాలయానికి సంబంధించిన పరిహారంగా అధికారులు మొత్తం రూ.59 లక్షల 30 వేల మొత్తాన్ని ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన ఆంజనేయ స్వామి దేవాలయ ఈఓ ఖాతాలో జమ చేశారన్నారు. అంతేకాకుండా, నూతనంగా దేవాలయ నిర్మాణం చేపట్టేందుకు సమీపంలోనే 50 సెంట్ల భూమిని కూడా ప్రభుత్వం కేటాయించిందన్నారు.
దేవాలయాన్ని కూల్చివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, భక్తుల విశ్వాసాలు, మనోభావాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామస్థులు, భక్తులు, అర్చకుల సమ్మతితోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు స్పష్టం చేశారన్నారు.
దేవాలయానికి సంబంధించి జరుగుతున్న వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కుట్రపూరితంగా చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు, భక్తులు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు .
