కలియుగ వైకుంఠం తిరుమల గిరులు ఈ రోజు భక్తి పారవశ్యంతో పులకించిపోయాయి. యుగాలుగా భక్తుల కన్నీటిని, కానుకలను, కోరికలను ఆదరించిన ఆ దివ్య క్షేత్రంలో, చరిత్రలో నిలిచిపోయే మరో స్వర్ణ అధ్యాయం లిఖితమైంది. చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా పాల్గొన్న పవిత్ర సమయంలో, శ్రీవారికి 121 కిలోల బంగారు, వజ్రాభరణాలను భక్తితో సమర్పించారు. టీటీడీ అర్చకులు, అధికారులు వేద మంత్రాల నడుమ ఈ కానుకలను స్వీకరించారు.
“ప్రతిరోజూ స్వామివారు 120 కిలోల బంగారు ఆభరణాలతో అలంకృతులవుతారు. ఆ దేవదేవుని ఆదేశంతోనే 121 కిలోలు సమర్పించాం” అని ఆ దంపతులు వినమ్రంగా పలికిన మాటలు, వారి నిష్కల్మష భక్తికి అద్దం పట్టాయి.
శ్రీనివాసుని కోసం 46 దివ్యాభరణాలు
106 కిలోల బంగారంతో శ్రీవారి కోసం ప్రత్యేకంగా తయారైన ఆభరణాలు
శ్రీ పద్మావతీ అమ్మవారికి 15 కిలోల బంగారు వస్త్రం
బంగారు కిరీటం, కౌస్తుభం, శ్రీవత్సం, సూర్యకటారి
తులసిపాత్ర హారం, అష్టోత్తర కాసుల మాల, చతుర్భుజ లక్ష్మీ హారం
బంగారు పాద కవచాలు, అందెలు, పాకడాలు
నాగాభరణ వడ్డాణం, నాగాభరణ కడియాలు
శంఖ కవచం, చక్ర కవచం, వైకుంఠ హస్తం, కటి హస్తం
2,427 క్యారెట్ల నీలాలు, పుష్యరాగం, కెంపులు, పచ్చలతో శ్రీవత్సం పతకం
238.2 క్యారెట్ల వజ్రాలు పొదిగిన ఆభరణాలు
చరిత్ర సాక్షిగా…
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భావోద్వేగంతో చరిత్రను గుర్తుచేశారు. పల్లవ, చోళ, చేర, పాండ్య రాజులు… మైసూరు, మరాఠా పాలకులు… ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు రత్నకిరీటం, పీతాంబరం వంటి అమూల్య ఆభరణాలను శ్రీవారికి సమర్పించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.
ఆ మహానుభావుల కాలం నుంచి నేటి జైన్ దంపతుల వరకు… శతాబ్దాలు గడిచినా, తరాలు మారినా, వేంకటేశ్వరునిపై భక్తి విశ్వాసాలు ఒక్క క్షణమైనా తగ్గలేదు, పెరుగుతూనే ఉన్నాయి!
“డబ్బు, సంపద, హోదా ఎప్పటికీ శాశ్వతం కావు. ఆధ్యాత్మికత, ధర్మం, సేవాభావమే మనిషికి నిజమైన సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తాయి” అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచంలో ఎందరో బిలియనీర్లు, ట్రిలియనీర్లు ఉన్నారు. కానీ సంపాదించిన సంపదను సద్వినియోగం చేసే అదృష్టం కొందరికే దక్కుతుంది. ఆ అదృష్టవంతుల్లో నిలిచి, తమ దాతృత్వంతో అందరికీ ఆదర్శంగా నిలిచారు జైన్ దంపతులు.
మానవ సేవే… మాధవ సేవ
“భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ మానవ సేవే మాధవ సేవ అనే సూత్రాన్ని మరువకూడదు. సమాజ హితం కోసం పనిచేసేవారే దేవునికి అత్యంత సన్నిహితులు” అని సీఎం పిలుపునిచ్చారు. జైన్ దంపతుల బాటలో ఇతర సంపన్నులు కూడా పేదల సంక్షేమానికి, సమాజ సేవకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తోడ్పడాలని కోరారు. భక్తులు సమర్పించే ప్రతి రూపాయి వారి సౌకర్యాలకు, సేవలకే వినియోగిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
భవిష్యత్తుకు దివ్య సంకల్పాలు
టీటీడీ సహకారంతో రాష్ట్రంలో 5,000 దేవాలయాల నిర్మాణం
దేశంలోని అన్ని రాజధానుల్లో, విదేశాల్లో హిందువులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు
ప్రతి ఆలయంలో అన్నప్రసాద వితరణ
‘ప్రాణదానం’ ద్వారా వైద్య సేవలు
‘విద్యాదానం’ కింద ప్రత్యేక నిధితో యువతకు నైపుణ్య శిక్షణ
‘వృక్షో గోవిందం’ పేరుతో రాష్ట్రవ్యాప్త హరిత కార్యక్రమం
హంద్రీ-నీవా ద్వారా కళ్యాణి డ్యాంకు, సోమశిల ద్వారా బాలాజీ రిజర్వాయర్‌కు నీరు; అవసరమైతే తిరుమలకు రెండో పైప్‌లైన్
“టెక్నాలజీ, నాలెడ్జ్‌తో పాటు భగవంతుని కృప ఉండటం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రం, దేశం మరింత అభివృద్ధి చెందడం ఖాయం” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నమ్మిన వారికి శ్రీవారి అండ
చరిత్రలో ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగాయి. కానీ ఏడుకొండల స్వామి సన్నిధిపై చేయి వేసే సాహసం ఎవ్వరూ చేయలేకపోయారు. కొలిచినవారికి, నమ్మినవారికి ఆ దేవదేవుడు కవచంలా నిలుస్తాడు. ఆ మాటలు పలుకుతూ ముఖ్యమంత్రి గొంతు గద్గదమైంది. “ప్రాణదానం కార్యక్రమం ప్రారంభించిన రోజే అలిపిరిలో నాపై దాడి జరిగింది. అంత పకడ్బందీగా జరిగిన దాడిలోనూ ఎవరి ప్రాణాలు పోలేదంటే అది స్వామి కృపే. ఆ వేంకటేశ్వరుడే నాకు ప్రాణభిక్ష పెట్టారు, పునర్జన్మనిచ్చారు” అంటూ ఆనాటి ఘటనను భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు.
టీటీడీకి ముఖ్యమంత్రి సందేశం
తిరుమల కొండపై పచ్చదనం విరాజిల్లాలి; దేవుని పవిత్రత విషయంలో రాజీ వద్దు
గో-సంరక్షణ, వేద పరిరక్షణకు అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలి; దానికి టీటీడీ నాందీ పలకాలి
శ్రీవారి ఆలయం ఆదర్శంగా, పవిత్రతకు మారుపేరుగా నిలవాలి
భక్తి విశ్వాసాలతో సేవలందిస్తున్న శ్రీవారి సేవకులను మరింత ప్రోత్సహించాలి
ప్రతిచోటా నిర్మించే ఆలయాల్లో ప్రశాంత, పవిత్ర వాతావరణం ఉండేలా చూడాలి
నిజమే… సంపద వస్తుంది, పోతుంది. కానీ భక్తితో సమర్పించిన ఒక్క కానుక, యుగయుగాలకు చరిత్రలో నిలిచిపోతుంది.

