ప్రత్యేకంహోమ్

War Zone: ఇరాన్ దీవులపై అమెరికా దాడులు

#Hormuz

హోర్మోజ్ జల సంధిని స్వాధీనం చేసుకోవడానికి వీలుగా అమెరికా సాయుధ బలగాలు ఇరాన్ దీవులపై ఆపకుండా దాడులకు తెగబడుతున్నాయి. బుధవారం లారక్ ద్వీపంపై అమెరికా క్షిపణి దాడి జరిగినట్లు ఇరాన్‌కు చెందిన తస్నీమ్ వార్తా సంస్థ వెల్లడించింది. హోర్ముజ్ జలసంధి చుట్టుపక్కల ఉన్న ఇరాన్ ద్వీపాలపై ఇటీవల వరుస దాడులు జరుగుతున్నాయి. యుద్ధాన్ని ముగించేందుకు జరిగిన ప్రాథమిక ఒప్పందం విఫలమైన తర్వాత ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా మరింత కీలకంగా మారింది.

లారక్ ద్వీపం హోర్ముజ్ జలసంధిలో అత్యంత ఇరుకైన ప్రాంతానికి సమీపంలో ఉండటంతో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. 1987 నుంచి ఈ ద్వీపం ఇరాన్ చమురు ఎగుమతులకు కేంద్రంగా ఉపయోగపడుతోంది. ఇక్కడ సైనిక స్థావరం కూడా ఉంది. యుద్ధం ప్రారంభ దశలో హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రవేశించడానికి లేదా బయటకు వెళ్లడానికి ఇరాన్ అనుమతించిన కొద్దిమంది నౌకలు తప్పనిసరిగా లారక్ ద్వీపం మార్గంలోనే ప్రయాణించాల్సి వచ్చింది. ఈ మార్గాన్ని వినియోగించిన నౌకల నుంచి భారీ మొత్తంలో రుసుము వసూలు చేసినట్లు సముద్ర రవాణా విశ్లేషణ సంస్థలు పేర్కొన్నాయి. అందుకే ఈ ద్వీపాన్ని “టెహ్రాన్ టోల్‌బూత్”గా కూడా అభివర్ణిస్తున్నారు. హోర్ముజ్‌లో నౌకలపై ఇరాన్ టోల్ వసూలు చేయడాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఖార్గ్ ద్వీపం ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావించబడుతోంది. ఉత్తర గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ఈ ద్వీపం నుంచి ఇరాన్ మొత్తం ముడి చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం జరుగుతున్నట్లు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అంచనా. మార్చి నెలలో ఈ ద్వీపంపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖార్గ్‌ను ఇరాన్‌కు చెందిన “కిరీట రత్నం”గా అభివర్ణిస్తూ అక్కడి సైనిక లక్ష్యాలన్నింటినీ ధ్వంసం చేశామని ప్రకటించినప్పటికీ, చమురు నిల్వలు, ఎగుమతి మౌలిక వసతులకు నష్టం కలగలేదని సమాచారం. 1960, 1970 దశకాల్లో చమురు ఉత్పత్తి పెరిగిన సమయంలో భారీ చమురు నౌకలు నిలిచే సౌకర్యం ఉండటంతో ఖార్గ్ ద్వీపం వేగంగా అభివృద్ధి చెందింది. తరువాత ఒమాన్ గల్ఫ్ తీరంలో జాస్క్ టెర్మినల్‌ను ప్రారంభించినప్పటికీ, ఖార్గ్ ఇప్పటికీ ఇరాన్ చమురు ఎగుమతులకు అత్యంత కీలక కేంద్రంగానే కొనసాగుతోంది.

గల్ఫ్‌లోని అతిపెద్ద ద్వీపమైన ఖేష్మ్ హోర్ముజ్ జలసంధి ప్రవేశ ద్వారాన్ని నియంత్రించే స్థితిలో ఉంది. సుమారు వంద కిలోమీటర్ల పొడవైన ఈ ద్వీపం ప్రకృతి సౌందర్యం, యునెస్కో గుర్తింపు పొందిన శిలా నిర్మాణాలు, మడ అడవులు, నీలి సముద్ర జలాలతో ప్రముఖ పర్యాటక కేంద్రంగా నిలిచింది. గత కొన్నేళ్లుగా పర్యాటక రంగం అభివృద్ధితో స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమైంది. అయితే ఇదే ద్వీపం ఇరాన్‌కు అత్యంత కీలకమైన సైనిక స్థావరాల్లో ఒకటిగా కూడా మారింది. గల్ఫ్‌లో ప్రయాణించే నౌకలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యంతో పాటు విదేశీ సైనిక దళాలపై దాడులు చేసే ఆయుధ వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయని భద్రతా విశ్లేషకులు చెబుతున్నారు. గత వారం కూడా ఈ ద్వీపంపై అమెరికా దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

గల్ఫ్ మధ్యభాగంలో ఉన్న లెసర్ టున్బ్, గ్రేటర్ టున్బ్, అబూ మూసా అనే మూడు చిన్న ద్వీపాలపై ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య చాలా కాలంగా యాజమాన్య వివాదం కొనసాగుతోంది. వీటితో పాటు సిరి ద్వీపాన్ని కూడా ఇరాన్ భారీగా సైనికీకరించింది. ఈ ద్వీపాలను నౌకా విధ్వంసక క్షిపణులు, ఆధునిక రక్షణ వ్యవస్థలతో కూడిన చిన్న కోటలుగా మార్చినట్లు వ్యూహాత్మక నిపుణులు పేర్కొంటున్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ నౌకాదళ దళాలు ఇక్కడ మోహరించగా, సమీపంలోని శత్రు నౌకలు, సైనిక స్థావరాలు, యుద్ధ సామగ్రిని లక్ష్యంగా చేసుకునే కొత్త క్షిపణి వ్యవస్థలను కూడా ఇరాన్ మోహరించినట్లు గతంలో ప్రకటించింది.

హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గంగా పరిగణించబడుతోంది. ఈ జలసంధిని ఆనుకుని ఉన్న ఇరాన్ ద్వీపాలపై నియంత్రణ సాధించడం లేదా వాటిని నిర్వీర్యం చేయడం ద్వారా చమురు సరఫరా, సముద్ర వాణిజ్యం, సైనిక ఆధిపత్యంపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అమెరికా–ఇరాన్ ఘర్షణలో ఈ ద్వీపాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Related posts

నిర్మాతగా నా స్థాయిని పెంచే చిత్రం “మఫ్టీ పోలీస్”

Satyam News

శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం

Satyam News

రెండు పెట్రోల్ బ్యాంకులను సీజ్ చేసిన కలెక్టర్

Satyam News

ప్రకృతి ప్రసాదం సంక్రాంతి పర్వదినం

Satyam News

ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన అమెరికా

Satyam News

వైజాగుకు వైకాపా తలాక్!

Satyam News

Leave a Comment