ఆధ్యాత్మికంహోమ్

మోక్ష ‘ద్వారం’ వైకుంఠ ఏకాదశి…..

సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో రెండింటికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఆనాడు ముఖ్యంగా పీఠాధిపతులు, సన్యాసాశ్రమంలో ఉన్నవారు చాతుర్మాస్య వ్రత దీక్ష చేపడతారు.

దానిని శయన ఏకాదశి అని కూడా అంటారు. రెండవది వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పేర్లతో వ్యవహరిస్తారు. ఇది హిందువులందరికీ ముఖ్యమైన పర్వదినం. ఇది ధనుర్మాసంలో వస్తుంది.

సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనూ రాశిలోకి ప్రవేశించే సమయం వరకూ ధనుర్మాసంగా పరిగణిస్తారు. ధనుర్మాసం ముప్పై రోజులు. ఇది మార్గశిర పుష్యమాసాల్లో విస్తరించి ఉంటుంది. ధనుర్మాస కాలం ఎంతో పుణ్యప్రదమైనదని, విష్ణువును ఈ మాసంలో ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశినాడు పూజించడం విశేషమైనదని అంటారు.

అందుకే మాసానాం మార్గశీర్షిహం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో శ్రీమహావిష్ణువుకు సూర్యచంద్రులు దక్షిణ, వామనేత్రాలు. ఒకటి తేజస్సు, మరొకటి ఆహ్లాదం అందిస్తాయి. నేత్రాలు వేరైనా స్వామి కాంతి తత్త్వం ఒక్కటేనన్న మహా తత్త్వాన్ని ఈ పర్వం విశదపరుస్తుంది.ధనుర్మాసమంతా ముఖ్యంగా కన్నెపిల్లలకు ఉత్సాహభరితంగా ఉంటుంది.

వేకువనే లేచి, ఇంటి ముందు కళ్ళాపి చల్లి, రంగురంగుల రంగవల్లులపై గొబ్బెమ్మలను అలంకరించి గొబ్బి పాటలు పాడతారు. ధనుర్మాసం దేవతలకు బ్రహ్మ ముహూర్తం. ఆ సమయంలో వారు విష్ణుమూర్తిని దర్శిస్తారు. ఆ సమయం ఎంతో విలువైనది. ముక్కోటి దేవతలు వచ్చి ఆయనను దర్శించే సమయం.

వైకుంఠ ఏకాదశికి సంబంధించిన కథ ఒకటి పద్మ పురాణంలో ఉంది. పూర్వం మురాసురుడనే రాక్షసుడు ముల్లోకాలను హింసించడమే కాక, ఇంద్రుణ్ని కూడా జయించాడు. ఇంద్రుని ప్రార్థనపై విష్ణువు అతనితో వేయి సంవత్సరాలు యుద్ధం చేసి అలసి బదరికాశ్రమం చెంత ఉన్న హైమవతి అనే గుహలో విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోయేడు.

అది తెలుసుకున్న మురుడు విష్ణువును సంహరించడానికి అదే సమయమని గుహలో ప్రవేశించాడు. ఆ సమయంలో విష్ణువు శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించింది. ఆమె తీవ్రమైన చూపులతో మురుని బూడిద చేసింది. శ్రీహరి మేల్కొని అక్కడ ఉన్న కన్యను, పడి ఉన్న బూడిద కుప్పను చూశాడు.

ఆ రోజు ఏకాదశి. ఆ కన్య జరిగినదంతా చెప్పింది. సంతోషించిన విష్ణువు ఆమెకు ఏకాదశి అని నామకరణం చేసి ఏదైనా వరం కోరుకోమన్నాడు. దానికి ఆ కన్య ఏకాదశినాడు నీ దేహం నుంచి జన్మించాను. కనుక నా పేరున వ్రతమాచరించి, ఉపవసించి, నారాయణుని పూజించిన వారు ఐహికాముష్మికాలు పొందేట్లు వరమీయమని కోరింది.

శ్రీహరి తథాస్తు అన్నాడు. కుంఠ అనగా కొరత కలది. వైకుంఠ అనగా ఏ కొరతాలేనిది. అది విష్ణు నివాసం. అక్కడ శ్రీమహావిష్ణువు తన సతి మహాలక్ష్మితో శేషశయ్యపై నివసిస్తాడు. త్రేతాయుగంలో రావణుని బాధలకు తాళలేక దేవతలు బ్రహ్మతో సహావైకుంఠానికి వచ్చి హరి దర్శనం చేసుకున్నారు, వారికి ఏకాదశియే ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశం కల్పించి మార్గదర్శి కావడం చేత వైకుంఠ ఏకాదశి అనే పేరు వచ్చిందని మరొక కథనం.

వేరొక కథలో మధుకైటభులను మహావిష్ణువు సంహరించగా వారు దివ్య రూపాలను, దివ్యజ్ఞానాన్ని పొంది వైకుంఠాన్ని నిర్మించి, ‘దేవా! ఏకాదశి వ్రతం నాడు ఉపవాసం ఉండి, ఉత్తర మార్గం ద్వారా నిన్ను దర్శించేవారికి మోక్షం ప్రసాదించమని అర్థిస్తూ, వారిరువురు అలా చేశారు. ఆ కారణంగా వైకుంఠ ఏకాదశినాడు ఉత్తర ద్వార దర్శనం చేస్తే మోక్షం లభిస్తుంది.

ఇదే మోక్షద ఏకాదశి

ఆ కారణంగా ఈ తిథిని మోక్షద ఏకాదశి అని అంటారు.వైకుంఠ ఏకాదశినే ‘పుత్రద ఏకాదశి’ అని అంటారు. సంతానం లేనివారు ఆ నాడు ఉపవాసంతో పాటు విష్ణువును పూజిస్తే సంతానం కలుగుతుందని విశ్వాసం. భద్రావతి రాజ్యాన్ని పరిపాలించిన సుకేత మహారాజు భార్య శైవ్యతో కలిసి విష్ణువును ఏకాదశినాడు మునులు పూజిస్తున్న విషయాన్ని తెలుసుకుని తానూ ఆచరించి సంతానాన్ని పొందాడు.

అలా వైకుంఠ ఏకాదశికి పుత్రద ఏకాదశి అనే పేరు వచ్చింది.వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఎన్నో పురాణ కథలున్నాయి. వైఖానసుడనే రాక్షసుడుండేవాడు. అతనికి అసుర గుణాలు ఉండేవి కావు. అతడు వైకుంఠ ఏకాదశి వ్రతం చేసి మాతా పితరులకు మోక్షం కలిగించాడు. కుచేలుడు ఈ వ్రతం చేసి శ్రీకృష్ణుని అనుగ్రహం తో ఐశ్వర్యవంతుడయ్యాడు.

రుక్మాంగదుడాచరించి పుత్ర పౌత్రాదులను పొంది సకల దేవతారాధ్యుడయ్యాడు. అంబరీషుని వ్రత విధానాన్ని భాగవత పురాణం అద్భుతంగా వర్ణించింది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా శివుడినైనా, కేశవుడినైనా దర్శించడం శుభప్రదం. పేరులో వైకుంఠమని ఉన్నా పరమేశ్వరుడొక్కడే.

శివకేశవ భేదం లేదు

ధనుర్మాసంలో ఆండాళ్ రచించిన తిరుప్పావై గానం చేస్తూ, వైష్ణవులు వైకుంఠనాథుని ఉత్తర ద్వారం గుండా దర్శిస్తే, శివభక్తులు మాణిక్య వాచకులు పాడిన తిరువెంబావై గానం చేస్తూ తమిళనాడులోని శివాలయాల్లోనే కాక తెలుగు ప్రాంతాల్లోని శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి వంటి ప్రముఖ శివాలయాల్లో స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించి పునీతులవుతుంటారు.

సకల శుభాలను పొందుతారు. తిరుప్పావై, తిరువెంబావై పాటలను పోవై పాటలంటారు. ఈ పాటలను పెళ్లి కాని కన్యలు ధనుర్మాసంలో పాడితే అనుకూలమైన వరుడు లభిస్తాడని నమ్మకం. ఇంతటి మహిమాన్వితమైన వైకుంఠ ఏకాదశి నాడు అందరూ ఉత్తర ద్వారం ద్వారా తమ ఇష్టదైవాన్ని దర్శించి సకల శుభాలను పొందాలని ఆకాంక్ష.

Related posts

ఇమ్రాన్ ఖాన్ భార్యకు 17 ఏళ్ల జైలు శిక్ష

Satyam News

21 నుంచి శ్రీ ఆదిశంకరాచార్యుల రథయాత్ర ప్రారంభం

Satyam News

వందేమాతరాన్ని అవమానిస్తే కఠిన శిక్ష?

Satyam News

అమరావతిలో క్రికెట్‌ స్టేడియం…. ఓపెనింగ్‌కి రెడీ.. డేట్‌ ఫిక్స్‌

Satyam News

భారీ ఎత్తున పెరగనున్న మెడికల్ కాలేజీ సీట్లు

Satyam News

కేరళలో భారీ విజయం సాధించిన బీజేపీ

Satyam News

Leave a Comment