ప్రత్యేకంహోమ్

8 వారాలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి…

#OilRefinary

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో మన దేశంలో పెట్రోలు డీజిల్ కొరత వస్తుందనే వార్తలను అధికారులు కొట్టిపడేస్తున్నారు. భారత్ వద్ద ఆరు నుంచి ఎనిమిది వారాలకు సరిపడా ముడి చమురు మరియు ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తక్షణ సరఫరా అంతరాయాలు వచ్చినా దేశానికి పెద్ద ఇబ్బందులు ఎదురుకావని అధికారులు స్పష్టం చేశారు.

భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు, ఎల్‌పీజీ సరఫరాలో దాదాపు సగభాగం హార్మోజ్ మార్గం గుండా వస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ ప్రభుత్వ, సైనిక, అణు స్థావరాలపై దాడులు చేపట్టిన తర్వాత ఈ సముద్ర మార్గంలో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఇరాన్ నౌకాయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు బీమా సంస్థలు కవరేజీ ఉపసంహరించుకోవడం వల్ల ట్యాంకర్ రవాణా దాదాపు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది.

పేరు వెల్లడించకూడదని కోరిన చమురు మంత్రిత్వ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, పరిస్థితిని ప్రభుత్వం “రోజువారీగా, గంట గంటకు” పర్యవేక్షిస్తోందని తెలిపారు. కొందరి అంచనాల ప్రకారం ఈ సంక్షోభం వారం నుంచి పది రోజుల వరకు కొనసాగవచ్చని భావిస్తున్నప్పటికీ, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో సుమారు 25 రోజుల పాటు సరిపడా ముడి చమురు నిల్వలు, అలాగే సమాన కాలానికి సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని తెలిపారు. అవసరమైతే వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు, వాణిజ్య నిల్వలు వినియోగించడం, అలాగే అమెరికా, రష్యా, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి సరఫరాలను మార్చుకోవడం వంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమల్లో ఉన్నాయని వెల్లడించారు.

భారత్ లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం?

తక్షణ కొరతలు సంభవించే అవకాశం తక్కువేనని అధికారులు భావిస్తున్నప్పటికీ, ముడి చమురు ధరలు పెరగడం, రవాణా మరియు బీమా వ్యయాలు అధికమవడం వల్ల భారత్ దిగుమతి బిల్లుపై మరియు ద్రవ్యోల్బణంపై ప్రభావం పడే అవకాశముందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కేంద్ర చమురు మంత్రి హర్ దీప్ సింగ్ పూరి ప్రస్తుత పరిస్థితుల్లో దేశం సిద్ధంగా ఉన్న తీరును మీడియాకు వివరించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.

పెట్రోలు, డీజిల్, ఏటీఎఫ్ సహా కీలక పెట్రోలియం ఉత్పత్తుల సరిపడా నిల్వలు ఉన్నాయని, మధ్యప్రాచ్య పరిస్థితుల వల్ల తలెత్తే తాత్కాలిక అంతరాయాలను ఎదుర్కొనే సామర్థ్యం దేశానికి ఉందని స్పష్టం చేశారు. అయితే నిల్వల ఖచ్చితమైన వివరాలను వెల్లడించలేదు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా మరియు నిల్వల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని, పరిస్థితిని బట్టి దశలవారీ చర్యలు తీసుకునే అవకాశముందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా భారత్ మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుగా, నాల్గో అతిపెద్ద రిఫైనర్‌గా, ఐదో అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిదారుగా ఉన్న విషయం తెలిసిందే.

గత కొన్నేళ్లుగా ఇంధన వనరులను విభిన్నీకరించడం ద్వారా సరఫరా అందుబాటులో ఉండేలా, ధరలు సాధ్యమైనంత నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. హోర్ముజ్ జలసంధి మార్గాన్ని ఉపయోగించని సరఫరా మార్గాల ద్వారా కూడా ఇంధనం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దీంతో ఆ మార్గంలో తాత్కాలిక అంతరాయాలు వచ్చినా దేశీయ సరఫరాపై పెద్ద ప్రభావం ఉండదని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది.

Related posts

ఆందోల్ రైతులకు సింగూర్ నీళ్లిస్తారా? లేక నష్టపరిహారం చెల్లిస్తారా?

Satyam News

కార్తీకమాస ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Satyam News

ఇక నుంచి శ్రీవారి భక్తులకు ‘రీ-ఎంట్రీ’ సదుపాయం

Satyam News

మళ్ళీ విచారణ కు హాజరైన సునీల్ నాయక్

Satyam News

సర్పంచ్ లకు గుడ్ న్యూస్

Satyam News

సోనియా, రాహుల్ పై ఈడీ కేసు కొట్టివేత

Satyam News

Leave a Comment