పల్నాడు జిల్లాలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ నమూనాలు అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తల మన్ననలు పొందుతున్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ ‘వాగెనింగెన్ యూనివర్సిటీ అండ్ రీసెర్చ్’ బృందం బుధవారం యడ్లపాడు మండలంలో పర్యటించి, ఇక్కడి సాగు పద్ధతులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కే. అమలకుమారి నేతృత్వంలో ఈ పర్యటన కొనసాగింది. ముందుగా బృందం ఉన్నవ గ్రామంలో పరమాత్ముల కోటేశ్వరమ్మ నిర్వహిస్తున్న బయో రిసోర్స్ సెంటర్‌ను సందర్శించింది. ప్రకృతి సిద్ధంగా తయారు చేసే వివిధ రకాల కషాయాలు, జీవామృతం, ఎరువుల తయారీ విధానాన్ని కోటేశ్వరమ్మను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో బయో రిసోర్స్ కేంద్రాల పనితీరు, రైతులకు అందుతున్న సేవల గురించి డి.పి.ఎమ్ అమలకుమారి బృందానికి వివరించారు.
‘ఏ-గ్రేడ్’ మోడల్‌కు ఫిదా….
కొత్తపాలెం గ్రామంలో ఏటీఎం మానం శ్రీకాంత్ పర్యవేక్షణలో సాగవుతున్న ‘ఏ-గ్రేడ్’ మోడల్ క్షేత్రాన్ని బృందం సందర్శించింది. మునగ, బీర, సొర, పొట్ల, దొండ వంటి వివిధ రకాల పంటల సమ్మేళనంతో కూడిన ఈ సాగు విధానం బృందాన్ని విశేషంగా ఆకట్టుకుంది. అలాగే ప్రకృతి వ్యవసాయంలోని తొమ్మిది సార్వత్రిక సూత్రాల చక్రం పనితీరును కూడా అధికారులు వివరించారు. ఈ సందర్భంగా టీమ్ లీడర్ లారెన్స్ జోన్స్ వాల్టర్స్ మాట్లాడుతూ.. ఇలాంటి ఆగ్రో ఫారెస్ట్రీ నమూనాల వల్ల భూమి పైన, భూమి లోపల జీవ వైవిధ్యం అద్భుతంగా పెరుగుతుందని కొనియాడారు.
చీడపీడల నివారణ…
బహుళ పంటల సాగు వల్ల చీడపీడల ఉధృతి తగ్గుతుంది. పరాగసంపర్కం మెరుగుపడటం వల్ల పంట నాణ్యత, దిగుబడి పెరుగుతాయి. క్షేత్ర పర్యటన అనంతరం ఏ పీ సీ ఎన్ ఎఫ్, ఇగార్ల్ సిబ్బంది మరియు మహిళా సంఘాల ప్రతినిధులతో బృందం ప్రత్యేకంగా చర్చించింది. క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న రికార్డులు, రిజిస్టర్‌లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో నెదర్లాండ్స్ బృందం సభ్యులు లారెన్స్ జోన్స్ వాల్టర్స్, కళ్యాణ్ గుంటుబోయిన, గెర్ట్ వాన్ డుయింకెర్కెన్, సైమన్ జెన్నె ఓస్టింగ్, సౌమ్య కాంతి కర్వారు పాల్గొన్నారు. వీరితో పాటు ఆర్ వై ఎస్ ఎస్ ప్రతినిధులు ధర్మేందర్, ఓంకార్, అదనపు డి.పి.ఎమ్ ప్రేమ్‌రాజ్, మరియు ఇతర ప్రకృతి వ్యవసాయ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
