తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన కేవలం 17 రోజులకే తొలి అధికారిక ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని న్యూఢిల్లీలో కలిశారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రికళగం పార్టీ విజయం సాధించడంతో మే 10న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీకి రావడం ఇదే మొదటిసారి.
ప్రధానమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశం సుమారు అరగంట పాటు కొనసాగినట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర అనుమతులు వంటి అంశాలను విజయ్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
కావేరి జల వివాదంలో భాగమైన మేకేదాటు ప్రాజెక్టుపై కూడా విజయ్ ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని ఇప్పటికే ప్రధానికి లేఖ రాసిన విజయ్, తమిళనాడు ప్రయోజనాలను కాపాడాలని కోరినట్లు తెలుస్తోంది.
ఈ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లను కూడా విజయ్ కలిసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ఆర్థిక సహాయం కోరనున్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లను కూడా విజయ్ కలవనున్నట్లు సమాచారం. తమిళనాడులో కాంగ్రెస్ మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఈ సమావేశాలకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.
సినీ నటుడిగా ప్రజాదరణ పొందిన విజయ్, రాజకీయాల్లోకి వచ్చి తొలి ఎన్నికలలోనే అధికారాన్ని సాధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ద్రవిడ రాజకీయాల ఆధిపత్యానికి భిన్నంగా కొత్త రాజకీయ శక్తిగా ఆయన ఎదుగుదల తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు.
