ఒక వైపు చర్చలు అంటూ ప్రపంచాన్ని అమెరికా భ్రమ పెడుతున్న వేళ ఇజ్రాయెల్ మాత్రం తన దాడులను కొనసాగిస్తూనే ఉంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్, ఇరాన్ పై భారీ దాడులు ప్రారంభించింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశం జరగడానికి ముందే ఈ దాడులు జరగడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఇరాన్‌లోని పౌర మౌలిక వసతులపై దాడులపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది.
ఇజ్రాయెల్ “టెహ్రాన్ గుండె ప్రాంతం”లో లక్ష్యాలను దాడి చేసినట్లు తెలిపింది. అయితే ఏ ప్రాంతాలు దెబ్బతిన్నాయన్న వివరాలు వెంటనే వెల్లడించలేదు. మరోవైపు లెబనాన్ రాజధాని బీరుట్ పై పొగలు కనిపించినప్పటికీ, అక్కడ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ ధృవీకరించలేదు.
ఇక ఇజ్రాయెల్‌లో ప్రమాద సైరన్లు మోగగా, ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులను అడ్డుకునేందుకు తమ సైన్యం చర్యలు తీసుకుంటోందని తెలిపింది. ఇదే సమయంలో ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అరబ్ దేశాలపై దాడులను కొనసాగించింది. ముఖ్యంగా కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులు దాడులు జరిగినట్లు సమాచారం.
మరోవైపు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇరాన్‌తో కాల్పుల విరమణ కోసం 15 అంశాల ప్రతిపాదనపై చర్చలు జరపాలని ఒత్తిడి తెస్తున్నప్పటికీ, అదే సమయంలో వేలాది సైనికులను ప్రాంతానికి తరలిస్తోంది. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా సైనిక చర్యలు చేపట్టే అవకాశం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత దారుణమైన పతనాన్ని వాల్ స్ట్రీట్ చవిచూసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆసియా మార్కెట్లు కూడా పడిపోయాయి. యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందనే భయంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు.
