జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం సాధ్యమని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) అగ్రనాయకులు, తెలంగాణ ప్రభుత్వ మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో ఈనెల 27వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరిగిన ఐజేయూ 11వ ప్లీనరీ సమావేశాల్లో జర్నలిస్టుల హక్కులు, భద్రతపై కీలక తీర్మానాలు చేశామని తెలిపారు.
సోమవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్లీనరీ – సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. 2007లో ఏర్పాటైన మజీథియా వేజ్ బోర్డు సిఫార్సుల తర్వాత గత 19 ఏళ్లుగా జర్నలిస్టులకు ఎలాంటి వేతన సవరణ జరగకపోవడం బాధాకరమన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంకింగ్ రంగాల్లో, చివరకు పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో సైతం వేతన సవరణలు జరుగుతున్నా, భారతీయ మీడియా రంగంలో జరగకపోవడం గమనార్హమన్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన మీడియా రంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి, జర్నలిస్టులపై రోజురోజుకూ పెరుగుతున్న దాడుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రింట్ మీడియాతో పోలిస్తే, ఎలక్ట్రానిక్ మీడియాకు సరైన నియంత్రణ గానీ, వేతన నిర్మాణం గానీ లేదన్నారు. ఈ రంగంలోని ఉద్యోగులకు కనీసం అపాయింట్‌మెంట్ లెటర్లు లేకుండా షాపులు, ఎస్టాబ్లిష్‌మెంట్ వర్కర్ల లాగా పరిగణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని మీడియాను అణచివేసే కుట్రగా పేర్కొన్నారు.
మీడియా రక్షణ చట్టం కావాలి
అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా సూచీలో భారత్ ర్యాంకు రోజురోజుకూ దిగజారుతోందన్నారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నిరోధించడానికి ప్రత్యేక ‘మీడియా ప్రొటెక్షన్ యాక్ట’ ను తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గడువు ముగిసి రెండేళ్లు అవుతున్నా ఇంకా కొత్త కౌన్సిల్‌ను ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుబట్టారు.
సోషల్ మీడియాలో ఎలాంటి ‘గేట్‌కీపింగ’ లేకపోవడం వల్ల తప్పుడు సమాచారం విపరీతంగా వ్యాప్తి చెందుతోందని, ఇది వృత్తిపరమైన జర్నలిస్టులకు,మీడియా పరిశ్రమకు చెడ్డపేరు తెస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. ప్రభుత్వ నియంత్రణ లేకుండానే, సోషల్ మీడియాను నియంత్రించేలా ఒక సమతుల్య చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మరింత బలంగా పోరాడేందుకు, ఉమ్మడి స్వరాన్ని వినిపించేందుకు,ఏప్రిల్ నెలలో హైదరాబాద్‌లో అన్ని మీడియా సంస్థలు, ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విజయవాడలో ఐజేయూ సమావేశాల జయప్రదానికి సహకరించిన వారికి, ముఖ్యంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందిస్తూ హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబుకి శ్రీనివాస్ రెడ్డి కతజ్ఞతలు తెలియజేశారు.
నూతనంగా ఎన్నికైన ఐజేయూ సెక్రటరీ జనరల్ డి.సోమ సుందర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ఐజేయూ సమావేశాల్లో చర్చించి ఆమోదించిన తీర్మానాలను వివరించారు. ముఖ్యంగా పని పరిస్థితులు, వేతన వ్యవస్థ,మీడియా రంగంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. మీడియా రంగంలో పెట్టుబడులు, సమాచార పంపిణీలో సోషల్ మీడియా పాత్ర,నకిలీ వార్తల నియంత్రణ వంటి అంశాలను అధ్యయనం చేస్తూనే, పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను, వ్యక్తిగత గోప్యతను కాపాడేలా ఒక సమగ్ర మీడియా పాలసీ ఉండాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని రద్దు చేసి కొత్త లేబర్ కోడ్‌లను తీసుకురావడం వల్ల జర్నలిస్టుల భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పాత చట్టాన్ని ఆధునీకరించి, అందులో ఎలక్ట్రానిక్,డిజిటల్ మీడియాను కూడా చేర్చి వెంటనే పునరుద్ధరించాలని, మీడియా ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారతదేశం దిగువ స్థాయిలో ఉన్న నేపథ్యంలో, జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రత్యేక రక్షణ చట్టం అవసరమన్నారు.
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తరహాలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి చట్టాన్ని తీసుకురావాలని, కోవిడ్ సమయంలో నిలిపివేసిన రైల్వే ప్రయాణ రాయితీలను జర్నలిస్టులకు వెంటనే పునరుద్ధరించాలని, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేరును మీడియా కౌన్సిల’గా మార్చాలని, ఇందులో డిజిటల్,ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కూడా స్థానం కల్పించాలని, ఈ కౌన్సిల్‌కు జర్నలిస్టులపై దాడులు జరిగినప్పుడు విచారణ చేసేలా మరిన్ని చట్టబద్ధమైన అధికారాలు కల్పించాలని తదితర ముఖ్య అంశాలపై వివిధ తీర్మానాలను ఐజేయూ ప్లీనరీలో ఆమోదించినట్లు వివరించారు.
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి.సుబ్బారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న జర్నలిస్టులకు ఇళ్ళు, స్థలాల సమస్యను పరిష్కరించాలని, గత టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ప్రమాద బీమా పథకాన్ని, జర్నలిస్టుల సంక్షేమ నిధిని పునరుద్దరించాలని, దేశవ్యాప్తంగా అమలవుతున్న రిటైర్డు జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యాన్ని ఏపీలో కూడా అమలు చేయాలని, తదితర జర్నలిస్టుల సమస్యలన్నింటినీ ఈ సమావేశాలకు హాజరైన సీఎం చంద్రబాబును కోరినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా రవి, ఐజేయూ ఆఫీస్ బేరర్స్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
