సంపాదకీయంహోమ్

బంగారం కొనొద్దని ప్రధాని చెప్పింది ఇందుకే..

#Modi

ఒక ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన అలా ఎందుకు చెప్పారు అనే అంశంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఇంధన సంక్షోభం, పెరుగుతున్న ముడి చమురు ధరల ప్రభావంతో భారత ఆర్థిక పరిస్థితులపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఈ కీలక విజ్ఞప్తి చేశారు. కనీసం ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికంగా బంగారం కొనుగోలు చేయడం వల్ల దేశ విదేశీ మారక నిల్వలపై మరింత భారం పడుతుందని హెచ్చరించారు.

హైదరాబాద్‌లో జరిగిన భారతీయ జనతా పార్టీ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు మితవ్యయ చర్యలు పాటించాలని సూచించారు. వంటనూనెల వినియోగం తగ్గించడం, బంగారం కొనుగోళ్లు వాయిదా వేయడం, పెట్రోల్-డీజిల్ వినియోగాన్ని తగ్గించడం, విదేశీ ప్రయాణాలను పరిమితం చేయడం వంటి చర్యలు తీసుకోవాలని కోరారు.

“దేశ ప్రయోజనాల కోసం ఒక సంవత్సరం పాటు బంగారం కొనకుండా ఉండాలని మనం నిర్ణయించుకోవాలి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్ తన అవసరాలకు దాదాపు మొత్తం బంగారాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోందని, గత ఏడాది మాత్రమే బంగారం దిగుమతుల కోసం 72 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అంటే నెలకు సుమారు 6 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని బంగారం కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు.

తగ్గుతున్న రిజర్వు బ్యాంకు బంగారం నిధులు

భారతీయ రిజర్వు బ్యాంక్ వద్ద ప్రస్తుతం 880 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని, గత ఏడాది లండన్ నుంచి 168 టన్నుల బంగారం దేశానికి తీసుకువచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం దేశ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 16 శాతానికి చేరగా, గత ఏడాది అది 10 శాతం మాత్రమే ఉండేది.

పండుగలు, వివాహాల సమయంలో బంగారం కొనుగోళ్లు మరింతగా పెరుగుతాయని, దీంతో డాలర్ల వ్యయం అధికమై దేశ దిగుమతి భారం పెరుగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ ప్రజలు భారీగా కొనుగోళ్లు చేస్తున్నారు.

ఇక అమెరికా-ఇరాన్ ఘర్షణల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. పశ్చిమ ఆసియాలో కాల్పుల విరమణపై వచ్చే ప్రతి పరిణామానికి బులియన్ మార్కెట్లు తీవ్రంగా స్పందిస్తున్నాయి.

ట్రేడింగ్ ఎకనామిక్స్ గణాంకాల ప్రకారం ప్రస్తుతం భారత విదేశీ మారక నిల్వలు సుమారు 690.69 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫిబ్రవరిలో ఈ నిల్వలు 728 బిలియన్ డాలర్ల వరకు చేరగా, ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఏప్రిల్ నాటికి మళ్లీ 691 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వు బ్యాంక్ గణాంకాలు సూచిస్తున్నాయి.

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనాల ప్రకారం 2026 నాటికి భారత ప్రస్తుత ఖాతా లోటు 84.5 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఇది దేశ స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 2 శాతానికి సమానం. దేశం నుంచి వెళ్లే విదేశీ మారక ద్రవ్యం, దేశంలోకి వచ్చే దానికంటే ఎక్కువగా ఉండటం ఆందోళనకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు భయాలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బంగారం దిగుమతులను తగ్గించడం దేశ ఆర్థిక వ్యవస్థకు కొంత ఉపశమనం కలిగించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

ఈ స్వరాభిషేకం సినిమా కథ కాదు

Satyam News

తెలంగాణ పోలీస్ అకాడమీలో మహారాష్ట్ర పోలీస్ ల స్టడీ విజిట్

Satyam News

హైదరాబాద్ నుంచి సోమశిల కు హెలికాప్టర్

Satyam News

సాగునీటి సంఘాల అధ్యక్షులతో త్వరలో సమావేశం

Satyam News

ఓటర్ల జాబితా సవరణలో తప్పులు జరిగితే ఊరుకోం

Satyam News

హోర్మోజ్ జలసంధి నుంచి భారత్ కు మరో రెండు నౌకలు

Satyam News

Leave a Comment