నల్గొండహోమ్

ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా భువనగిరి

#JupallyKrishna Rao

భువనగిరి కోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోట పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమగ్రంగా సమీక్షిస్తూ, పనుల పురోగతిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ పర్యటనలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి, చామల కిరన్ కుమార్ రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ అర్జున్ రావుతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

భువనగిరి కోట అడుగుభాగంలో నిర్మిస్తున్న రోప్‌వే, హోటల్, పార్కింగ్ సదుపాయాలు, విశ్రాంతి గదులు, పిల్లల ఆట స్థలం, రాక్ గార్డెన్ లైటింగ్ పనులను మంత్రి పరిశీలించారు. అలాగే కొండపై చేపడుతున్న కోట పునరుద్ధరణ, నీటి వనరుల సుందరీకరణ, కేఫేటీరియా, కోట చరిత్రను వివరించే ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్, మెట్ల పునరుద్ధరణ, ప్రవేశ ద్వారం, టికెట్ కౌంటర్, వెయిటింగ్ లాంజ్, రెస్టారెంట్ తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు.

పనుల జాప్యంపై మంత్రి ఆగ్రహం

వివిధ శాఖల అధికారులు, పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో మాట్లాడిన మంత్రి, ప్రాజెక్టు అమలులో జరిగిన జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులను వేగవంతం చేసి అక్టోబర్ 2 నాటికి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, అవసరమైతే పగలు–రాత్రి పనులు కొనసాగించాలని సూచించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి జూపల్లి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. గత ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేశాయని, పర్యాటక ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని విమర్శించారు.

నూతన పర్యాటక విధానంతో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ సంపద సృష్టి, ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2047 నాటికి తెలంగాణను అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక, వారసత్వ, సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

యాదాద్రి, భువనగిరి కోట, కొలనుపాకలను అనుసంధానిస్తూ సమగ్ర ఆధ్యాత్మిక–వారసత్వ పర్యాటక సర్క్యూట్ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని బౌద్ధ వారసత్వ క్షేత్రాల పరిరక్షణ, పునరుద్ధరణకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

దేశీయ, విదేశీ పర్యాటకులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద రూ.56.81 కోట్ల అంచనా వ్యయంతో భువనగిరి కోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వారసత్వ పరిరక్షణతో పాటు ఆధునిక సదుపాయాలు, రోప్‌వే ఏర్పాటు, మెరుగైన పర్యాటక అనుభవాల ద్వారా సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. ప్రతి కుటుంబం కనీసం నెలకు రెండు సార్లు పర్యాటక ప్రాంతాలను సందర్శించి తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేయడం ద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుందని, జీవన విధానం మరియు ఆలోచనా ధోరణిలో సానుకూల మార్పులు వస్తాయని మంత్రి పేర్కొన్నారు.

Related posts

నెల్లూరు తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన

Satyam News

అమరావతి అప్‌డేట్: విజయవాడలో కొత్త స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం

Satyam News

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ..విజయసాయికి నోటీసులు..??

Satyam News

ప్రభుత్వ స్థలం అక్రమిస్తే కఠినమైన చర్యలు

Satyam News

అమెరికా ఆయిల్ టాంకర్ పై ఇరాన్ దాడి?

Satyam News

భారత్ లో పట్టుబడ్డ పాకిస్తాన్ యువ జంట

Satyam News

Leave a Comment