23.9 C
Hyderabad
September 27, 2026
జాతీయంహోమ్

చైనా సరిహద్దు వద్ద భద్రత పెంచిన భారత్

#ChinaBoarder

చైనా సరిహద్దును మరింత పటిష్టం చేసే చర్యలకు భారత్ ఉపక్రమించింది. చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఐదు సమగ్ర యుద్ధ బృందాల ఏర్పాటు ప్రక్రియను బుధవారం అధికారికంగా ప్రారంభించింది. ఆదేశాలు అందిన 24 గంటల్లోనే లక్ష్యాలపై ప్రతిస్పందించి దాడులు నిర్వహించే సామర్థ్యంతో ఈ బృందాలను రూపొందిస్తున్నారు.

ఈ సమగ్ర యుద్ధ బృందాల ఐడియా 2001లో పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడి అనంతరం చేపట్టిన ఆపరేషన్ పరాక్రమ్ తర్వాత రూపుదిద్దుకున్న “కోల్డ్ స్టార్ట్” సైనిక వ్యూహానికి ఆధునిక రూపంగా భావిస్తున్నారు. ప్రతి సమగ్ర యుద్ధ బృందానికి మేజర్ జనరల్ హోదా కలిగిన అధికారి నాయకత్వం వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఐదుగురు మేజర్ జనరల్ స్థాయి అధికారులను నియమించినట్లు సమాచారం.

మౌంటెన్ స్ట్రైక్ కార్ప్స్‌కు సంబంధించిన సమగ్ర యుద్ధ బృందాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం జూలై 1న అధికారిక అనుమతి ఇవ్వడంతో నియామకాలు, పరిపాలనా ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. ఈ ఏర్పాట్లన్నీ 2027 మధ్య నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఈ యుద్ధ బృందాలను చైనా సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో మోహరించనున్నారు. వీటికి దీర్ఘశ్రేణి ఫిరంగులు, ఇతర భారీ ఆయుధాలతో కూడిన అగ్ని మద్దతు బృందం సహకారం అందించనుంది. ప్రస్తుతం ఈశాన్య ప్రాంతానికి సంబంధించిన విభాగంలోనే ఈ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

సమగ్ర యుద్ధ బృందం అనేది కాల్బలం, ట్యాంకులు, ఫిరంగి దళం, ఇంజినీరింగ్ విభాగం, సమాచార వ్యవస్థలు, వైమానిక రక్షణ, సరఫరా విభాగాలను ఒకే కమాండ్ కింద సమన్వయం చేసే ప్రత్యేక నిర్మాణం. దీనివల్ల సైన్యం వేగంగా స్పందించడంతో పాటు స్వతంత్రంగా యుద్ధ చర్యలు చేపట్టగలదు. పెద్ద సైనిక విభాగాలపై ఆధారపడకుండా వేగంగా కదిలే విధంగా ఈ బృందాలను రూపొందిస్తున్నారు.

ప్రతి సమగ్ర యుద్ధ బృందంలో సుమారు ఐదు వేల మంది సైనికులు ఉంటారు. ఇది సాధారణ బ్రిగేడ్ కంటే పెద్దది, డివిజన్ కంటే చిన్నదిగా ఉంటుంది. హిమాలయ ప్రాంతాల్లో పనిచేసే ఈ బృందాలకు మైదాన ప్రాంతాల్లోని దళాలతో పోలిస్తే భిన్నమైన ఆయుధాలు, శిక్షణ, యుద్ధ వ్యూహాలు అమలు చేయనున్నారు.

ఈ బృందాల కోసం కొత్తగా సైనికులను నియమించకుండా ఇప్పటికే ఉన్న కాల్బలం, ట్యాంకు రెజిమెంట్లు, ఫిరంగి దళాలు, మానవరహిత వైమానిక వ్యవస్థలు, ఇంజినీరింగ్, సమాచార విభాగాల సిబ్బందిని సమన్వయం చేసి ఏర్పాటు చేయనున్నారు.

భారత సైన్యాన్ని మరింత సమర్థవంతంగా, వేగంగా స్పందించేలా మార్చే పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ చర్య చేపట్టారు. 2022లో భారత సైన్యం పునర్వ్యవస్థీకరణ, పరిమాణ సవరణపై నిర్వహించిన అధ్యయనంలో పశ్చిమ, ఉత్తర సరిహద్దుల భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ నిర్మాణాల్లో మార్పులు సూచించగా, సమగ్ర యుద్ధ బృందాల ఏర్పాటు కూడా అందులో కీలక అంశంగా నిలిచింది.

Related posts

కీలక ఘట్టాలతో వీడియో ప్రెజెంటేషన్

Satyam News

జనసేన ఎమ్మెల్యేలు జాగ్రత్త: పవన్

Satyam News

అక్రమ బొగ్గు మాఫియా పై ఈడీ దాడులు

Satyam News

భారత్ నౌకలపై ఇరాన్ దాడి: పొరపాటా గ్రహపాటా?

Satyam News

ఉత్తరాంధ్ర ఇలవేల్పును దర్శించుకున్న అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీ

Satyam News

దక్షిణ మధ్య రైల్వేకు జాతీయ సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ అవార్డు

Satyam News

Leave a Comment