కడపహోమ్

వీబీజీ రామ్ జీ పథకం ప్రారంభించిన చంద్రబాబు

#VBGRAMG

తిరుపతి జిల్లాలోని ముక్కాపారిపల్లెలో నిర్వహించిన వీబీజీ రామ్ జీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా అమలుకానున్న వీబీజీ రామ్ జీ పథకం ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి ప్రారంభం కావడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. గతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా రాయలసీమ నుంచే ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తరించిందని గుర్తు చేశారు.

ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.7,700 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.4 వేల కోట్లు వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 125 పనిదినాల అవకాశంతో గ్రామీణాభివృద్ధికి అవసరమైన రహదారులు, డ్రైనేజీలు, కాలువలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. జియో ట్యాగింగ్, బయోమెట్రిక్ వంటి సాంకేతికతతో పూర్తి పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.

భూగర్భ జలాల పెంపు నకు జలధార కార్యక్రమం

గాలేరు-నగరి నుంచి కోడూరుకు నీటిని తీసుకువచ్చే చర్యలు చేపడతామని, జలధార కార్యక్రమం ద్వారా భూగర్భ జలాల పెరుగుదలకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రాలు కూడా వాటా వ్యయం చేయడం భారం కాదని, అది బాధ్యతగా భావించాలని అన్నారు.

రాష్ట్రంలోని 13,226 గ్రామాల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించి గిన్నీస్ రికార్డు సాధించిన ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు దక్కిందన్నారు. ఇప్పటివరకు 7 వేల కిలోమీటర్ల సిమెంట్ రహదారులు, 40 వేల గోకులాలు, 15,500 నీటి తొట్టెలు, 1.07 లక్షల వ్యవసాయ చెరువులు, 1,373 కిలోమీటర్ల గిరిజన ప్రాంత రహదారులు, 1.66 లక్షల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి చేపట్టామని తెలిపారు. ఉపాధి హామీ పనుల కింద 55.44 కోట్ల పనిదినాలు కల్పించి రూ.16,695 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.

ఈ ఏడాది 10 వేల కిలోమీటర్ల గ్రావెల్ రహదారులు, 1,500 కిలోమీటర్ల సిమెంట్, బీటీ రహదారులు, 500 కిలోమీటర్ల ప్రత్యేక డ్రైన్లు, లక్ష ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. రైతులు పొలాలకు వెళ్లే డొంక రహదారులను కూడా వీబీజీ రామ్ జీ పథకం కింద నిర్మించవచ్చని తెలిపారు.

విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతామని ఇచ్చిన హామీని రెండేళ్లలోనే నిలబెట్టుకున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన 93 కేంద్ర పథకాలను తిరిగి పునరుద్ధరించామని, జల్ జీవన్ మిషన్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూ.28 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని, రాజధానిలో వేగంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అమరావతిని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టడంతో పాటు రైల్వే జోన్‌ను సాధించామని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్‌తో పాటు పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ కేంద్రం, సత్యవేడులో హీరో మోటార్ సైకిళ్ల తయారీ యూనిట్, తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ తయారీ కర్మాగారం ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు.

రాయలసీమను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడతాం

రాయలసీమను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెడతామని, తోతాపురి మామిడి రైతులకు సాయం, రహదారులు, ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకం కోసం కేంద్రం నిధులు అందించిందని తెలిపారు. ఇచ్చిన అన్ని హామీలు ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పడం లేదని, కానీ వాటి అమలుకు శుభారంభం చేశామని, ఒక్కొక్కటిగా అన్నింటినీ నెరవేరుస్తామని అన్నారు.

స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న చంద్రబాబు, బంగారం గనులు వెలుగులోకి వచ్చిన జొన్నగిరి ప్రాంతానికి చారిత్రక గుర్తింపుగా స్వర్ణగిరి అనే పేరు పెట్టామని తెలిపారు. ఉద్యాన పంటలకు కేంద్రంగా ఉన్న రాయలసీమను మరింత అభివృద్ధి చేస్తామని, త్వరలో మదనపల్లిలో ఉద్యానవనాల కేంద్రానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

ప్రజలంతా నిస్వార్థంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి సహకరించాలని, దేశం ముందు, ఆ తర్వాత మనం అనే భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, స్వర్ణాంధ్రప్రదేశ్ ఇక ఆగదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Related posts

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో మంత్రి లోకేష్ భేటీ ఎందుకు?

Satyam News

దర్శకుడు పీసీ ఆదిత్య కు గౌరవ డాక్టరేట్

Satyam News

ఇండియా మ్యాప్ లో అమరావతి కి టిక్ మార్క్

Satyam News

మత్స్యకార గ్రామంలో నిదురించనున్న కేంద్ర మంత్రి

Satyam News

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం

Satyam News

హంద్రీ నీవా నీటికి జలహారతి

Satyam News

Leave a Comment