హైదరాబాద్హోమ్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డి అరెస్ట్

#PoliceHyderabad

రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నాతాధికారిగా ఉంటూ, అధికార బలంతో కోట్లాది రూపాయల అక్రమాస్తులు కూడబెట్టిన ఒక అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీమ్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో జరిపిన సోదాల్లో కళ్లు చెదిరే స్థాయిలో ఆస్తులు, నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

రూ.కోట్ల విలువైన స్థిర, చరాస్తులు

డీఎస్పీ భీమ్రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారని సమాచారంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఆయన నివాసంతో పాటు, బంధువులు, ముఖ్య అనుచరులు, బినామీల ఇళ్లపై ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, వందల ఎకరాల వ్యవసాయ భూములు, కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలతో పాటు భారీగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ సొంత నివాసంలో రూ. 3.60 లక్షల నగదు లభించగా ఆయన బినామీ ఇంట్లో ఏకంగా రూ. 40 లక్షల నగదు లభ్యమైంది.

మొత్తం రూ. 43.6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు డీఎస్పీ ఇంట్లో దాదాపు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులను అధికారులు సీజ్ చేశారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ. 19.91 లక్షల నగదు నిల్వలను గుర్తించి, ఆ అకౌంట్లను స్తంభింపజేశారు. శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్ అనే సంస్థలో డీఎస్పీ రూ. 75 లక్షల మేర పెట్టుబడి పెట్టినట్లు పత్రాలు లభ్యమయ్యాయి. ఆస్తులతో పాటు డీఎస్పీ నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన 23 విదేశీ మద్యం బాటిళ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పక్క రాష్ట్రంలోనూ భారీగా ఆస్తులు

ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల ప్రకారం డీఎస్పీ భీమ్ రెడ్డి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పక్క రాష్ట్రంలో భారీగా స్థిరాస్తులను కూడబెట్టారు. వాటి అధికారిక విలువ కొన్ని కోట్లలో ఉండగా, మార్కెట్ విలువ వందల కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇబ్రహీంబాగ్‌లోని లగ్జరీ వెస్సెల్లా మెడోస్లో ఒక విల్లా, టెలికాం నగర్‌లో జీ ప్లస్2 అంతస్తులతో పెంట్‌హౌస్ కూడిన ఒక ఇల్లు, టెలికాం నగర్‌లో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో మరో ఐషోరామ ఫ్లాట్, తెల్లాపూర్‌లో రెండు ఫ్లాట్లు, మణికొండలో 500 గజాల విస్తీర్ణంలో ఉన్న జీ ప్లస్ 5 అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ వాటా ఉన్నట్లు అధికారులు తెల్చారు.

మణికొండ ప్రాంతంలోనే మరో 3,000 చదరపు అడుగుల కమర్షియల్ ప్లాట్ ఉన్నట్లు సోదాల్లో గుర్తించారు. ప్రగతి రిసార్ట్స్ సమీపంలో 500 గజాల ప్లాట్, నాగోల్ కామినేని ఆస్పత్రి సమీపంలో 200 గజాల ప్లాట్, పటాన్‌చెరు జీపీఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 గజాల ప్లాట్, పటాన్‌చెరులోనే మరో 200 గజాల ప్లాట్, వికారాబాద్ జిల్లా మొమిన్‌పేట్‌లో 1,000 గజాల ఖాళీ స్థలం, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, వికారాబాద్ జిల్లా మొమిన్‌పేట్‌లో 2 ఎకరాల వ్యవసాయ భూమి, వికారాబాద్ జిల్లా సీసీ కుంట మండలం ముచింతల గ్రామంలో 4.20 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలో ఒకచోట 6 ఎకరాలు, మరోచోట ఏకంగా 38 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో 1 ఎకరం విలువైన భూమిని అధికారులు గుర్తించారు.

అరెస్టు, రిమాండ్ కు తరలింపు

డీఎస్పీ సంకిరెడ్డి భీమ్ రెడ్డి తన అధికార దుర్వినియోగానికి పాల్పడి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో ఏసీబీ అధికారులు తెల్చారు. ప్రస్తుతం దొరికిన ఆస్తుల పత్రాలను పరిశీలిస్తున్నామని ఆయనకు సంబంధించిన మరికొన్ని బినామీ అకౌంట్లు, లాకర్లు, ఇతర ప్రాంతాల్లోని ఆస్తులపై విచారణ ఇంకా కొనసాగుతోందని ఏసీబీ ప్రకటన ద్యారా వెల్లడించింది.

పోలీస్ శాఖలోనే డీఎస్పీ హోదాలో ఉంటూ, ఆదాయానికి మించి ఇంత భారీ స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టడం నగరంలో సంచలనంగా మారింది. డీఎస్పీ భీమ్ రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ పూర్తి అయిన తర్వాత న్యాయమూర్తి ముందు హజరుపర్చి రిమాండ్ కు తరలించనున్నారు.

Related posts

గవర్నర్‌ను కలిసిన నూతన సీఎస్ సంజయ్ జాజు

Satyam News

ఆశ్రమంలో అపర వాల్మీకి జయంతి వేడుకలు

Satyam News

డొల్ల కంపెనీల పుట్ట.. చెవిరెడ్డి బుట్ట

Satyam News

చెరువు నీళ్లు కూడా అమ్ముకున్న పిన్నెల్లి

Satyam News

గూగుల్ కు విశాఖే ఎందుకు నచ్చింది?

Satyam News

ఎన్నికల వ్యవస్థపై రాహుల్ ‘జ్ఞానోదయం’.!

Satyam News

Leave a Comment