ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC), సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎలాంటి పాత్ర లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) స్పష్టం చేసింది.
ఈ కేసులో ఇతర నిందితులపై అదనపు అభియోగ పత్రం (సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్) దాఖలు చేసిన ఈడీ, మనీలాండరింగ్ లేదా నేరానికి సంబంధించిన డబ్బు లావాదేవీల్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తమ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. విశాఖపట్నంలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కోర్టులో దాఖలు చేసిన అదనపు అభియోగ పత్రంలో, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు నుంచి ఉద్భవించిన నేరాదాయాలతో సంబంధం ఉన్న కార్యకలాపాల్లో చంద్రబాబు నాయుడు ప్రమేయం లేదని ఈడీ స్పష్టంగా పేర్కొంది.
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా 40 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటు లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును జగన్ రెడ్డి తన పాలనా కాలంలో తప్పుడు కేసులతో విదాదాస్పదం చేశాడు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడిని ఈ కేసులో అరెస్ట్ చేయగా, ఆయన 2023లో 53 రోజుల పాటు జైలులో గడిపారు.
ఈ కేసుకు సంబంధించి ఈడీ పేర్కొన్న వివరాల ప్రకారం, ఏపీ సీఐడీ 2024 ఏప్రిల్‌లో విజయవాడలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో చంద్రబాబు నాయుడు సహా పలువురిని నిందితులుగా పేర్కొంది. అయితే, ప్రాథమిక నేరానికి సంబంధించిన దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పేర్కొంటూ, ఆ ఛార్జ్‌షీట్‌ను ట్రయల్ కోర్టు తిరిగి పంపినట్లు 2025 సెప్టెంబర్‌లో సీఐడీ ఈడీకి తెలియజేసింది.
“మనీలాండరింగ్ చట్టం కింద చేసిన దర్యాప్తులో చంద్రబాబు నాయుడి పాత్ర ఏ విధంగానూ వెలుగులోకి రాలేదు. అందుకే ఆయనను గతంలోనూ, ఇప్పుడూ దాఖలు చేసిన అభియోగ పత్రాల్లో నిందితుడిగా చేర్చలేదు,” అని ఈడీ స్పష్టం చేసింది. జగన్ రెడ్డి తన కుట్ర తో ఏర్పాటు చేసిన సీఐడీ దర్యాప్తులో తప్పుడు ఆరోపణలు రికార్డు చేసినట్లు వెల్లడి అయింది.
2015లో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీమెన్స్‌తో రూ.3,300 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 10 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సి ఉండగా, మిగిలిన 90 శాతం సీమెన్స్ పెట్టుబడిగా ఉండాలి. అయితే, సీమెన్స్ ఆ నిధులను పెట్టకపోగా, ప్రభుత్వ నిధులనే వినియోగించినట్లు సీఐడీ తప్పుగా ఆరోపించింది.
అలాగే, ఆ మొత్తంలో కొంత డబ్బు షెల్ కంపెనీలకు మళ్లించబడినట్లు కూడా సీఐడీ పేర్కొంది. అయితే చంద్రబాబునాయుడికి ఆ డబ్బు తరలినట్లు జగన్ సిఐడి చేసిన ఆరోపణలు న్యాయస్థానాల్లో నిలవలేదు. తాజాగా ఈడీ కూడా అదే చెప్పింది. మొత్తానికి జగన్ రెడ్డి కక్షపూరితంగా చంద్రబాబునాయుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఇప్పుడు స్పష్టంగా వెల్లడి అయింది.
