జూలై 17, 18, 19 తేదీల్లో బాగేశ్వర్ సర్కార్ శ్రీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దివ్య దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భక్తుల కోసం మూడు రోజుల పాటు శ్రీ హనుమాన్ కథ ఉంటుంది. హైదరాబాద్‌లో తొలిసారి బాగేశ్వర్ సర్కార్ శ్రీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి కార్యక్రమం నిర్వహించనున్నారు.
బాగేశ్వర్ సర్కార్ శ్రీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న మూడు రోజుల కార్యక్రమాల కోసం సోమవారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన బ్రోచర్ ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య నిర్వాహకులు అంజనీ కుమార్ అగర్వాల్, సూర్య కమల్ గుప్తా, సంజయ్ అగర్వాల్, రాకేష్ జలాన్, రాకేష్ నర్సింగ్‌పురియా, సందీప్ మిత్తల్, ఘనశ్యామ్ అగర్వాల్, నవీన్ అగర్వాల్, పవన్ తిబ్రేవాల్, అంకిత్ అగర్వాల్, ధీరజ్ అగర్వాల్, రూపేష్ అగర్వాల్, శుభమ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు జూలై 17, 18, 19 తేదీలలో గగన్ పహాడ్‌లోని పురాన్ సన్స్ ఫార్మ్స్ (ప్రెస్టీజ్ సిటీ గేట్ ఎదురుగా) జరగనున్నాయి. ఈ
మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని హైదరాబాద్ బాగేశ్వర్ ధామ్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛంద సేవకుల సమావేశంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు పాటించాల్సిన నియమాలు, సేవా విధానాలు, బాధ్యతల గురించి వారికి విపులంగా వివరించారు. పురాన్ సన్స్ ఫార్మ్స్‌లో పండిత్ సంజయ్ శర్మ ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది.
అనంతరం జరిగిన స్వచ్ఛంద సేవకుల సమావేశంలో కన్వీనర్ అంజనీ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఇంతటి భారీ స్థాయిలో ఈ తరహా ఆధ్యాత్మిక కార్యక్రమం తొలిసారిగా నిర్వహించబడుతోందన్నారు. అందరూ సమష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని చారిత్రాత్మక విజయంగా నిలపాలని ఆయన పిలుపునిచ్చారు.
బాగేశ్వర్ ధామ్ నుంచి 60 మంది సభ్యుల బృందం, అలాగే ఇతర ప్రాంతాల నుంచి 500 మంది రానున్నారని, వారికి వసతి, భోజన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. జూలై 16 నుంచి 19 వరకు స్వచ్ఛంద సేవకులు విధుల్లో ఉండాలని సూచించారు. సేవలందించిన ప్రతి స్వచ్ఛంద సేవకునికి ‘బాబా’ తరపున ప్రత్యేక ప్రశంసాపత్రం (సర్టిఫికేట్) అందిస్తామన్నారు.
17న హైదరాబాద్‌కు పూజ్య బాబా
జూలై 17న పూజ్య బాబా హైదరాబాద్‌కు చేరుకుంటారని, ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 వరకు శ్రీ హనుమాన్ కథ నిర్వహించబడుతుందని తెలిపారు. రెండో రోజు శ్రీ హనుమాన్ కథతో పాటు దివ్య దర్బార్ కూడా నిర్వహిస్తామన్నారు. ఇందులో బాబా భక్తుల సందేహాలకు, ప్రశ్నలకు సమాధానాలు అందిస్తారు.
ప్రతి స్వచ్ఛంద సేవకునికి మూడు రోజుల కోసం మూడు వేర్వేరు రంగుల స్కార్ఫ్‌లు, ఒక ఐడీ కార్డు అందిస్తారు. వారికి కేటాయించిన ప్రాంతాల్లో క్రమశిక్షణతో, ఆదర్శప్రాయంగా సేవలు అందించాలని సూచించారు. సేవ చేయాలనుకునే భక్తుల కోసం కార్యక్రమ ప్రాంగణంలో ప్రత్యేక సేవా నమోదు కౌంటర్లు ఏర్పాటు చేయబడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అపోలో, ఏఐజీ ఆసుపత్రులు ఆరోగ్య సేవలను అందించనున్నాయి. రక్తపోటు, మధుమేహ పరీక్షలు, కంటి పరీక్షలతో కూడిన ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు, కృత్రిమ అవయవాలను కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా ఈ కార్యక్రమం ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవకు కూడా వేదిక కానుంది.
భారీ ఏర్పాట్లు
ఈ కార్యక్రమం కోసం 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ పందిరి (పండాల్) నిర్మిస్తున్నారు. ఇందులో ఒకేసారి 50వేల మంది కూర్చునే వీలుండగా మొత్తం లక్ష మందికి పైగా భక్తులు శ్రీ హనుమాన్ కథను వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి 25 మంది కోర్ కమిటీ సభ్యులతో పాటు సుమారు 500 మంది భద్రతా సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు సేవలందిస్తారని తెలిపారు. ప్రతి భక్తుని ప్రేమతో, మర్యాదతో ఆదరిస్తూ సేవాభావంతో పనిచేయాలని సూచించారు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్యక్రమ స్థలంలో రెండు అంబులెన్సులు , ఒక అగ్నిమాపక వాహనం సిద్ధంగా ఉంటాయి. పోలీసు శాఖ, ప్రైవేట్ భద్రతా సిబ్బంది, స్వచ్ఛంద సేవకుల సహకారంతో సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అంజనీ తెలిపారు. అదనంగా టీఎస్‌ఆర్టీసీ తో చర్చలు జరుపుతూ 110 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయడంతో పాటు, విశ్రాంతి కేంద్రాల నుండి కార్యక్రమ ప్రాంగణానికి భక్తులను తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
విస్తృత పార్కింగ్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమ నిర్వహణలో సమర్థవంతమైన సమన్వయం కోసం ఆహారం, ఆహ్వానాలు, పూజా విభాగం, ఆరోగ్యం , అత్యవసర వైద్య సేవలు, సోషల్ మీడియా, ముద్రణ, అలంకరణ, క్యాటరింగ్, పార్కింగ్, గ్రౌండ్ మేనేజ్‌మెంట్, ప్రెస్ , మీడియా, వేదిక భద్రత, ప్రకటనలు, ప్రచారం, ప్రయాణం/టాక్సీలు, బస్సు సేవలు, ఫోటోగ్రఫీ తదితర విభాగాలకు ప్రత్యేక ఉపకమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్‌లో తొలిసారిగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా, చిరస్మరణీయంగా, చారిత్రాత్మకంగా నిలబెట్టేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మనీష్ అగర్వాల్ ఏర్పాట్లపై స్వచ్ఛంద సేవకులకు పూర్తి వివరాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. అదనంగా ధీరేంద్ర శాస్త్రి పాల్గొనే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
